సందర్భం
సంచారజాతుల వాళ్లు సాంప్రదాయ వృత్తులనుంచి ముందుకు సాగాలంటే వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. అప్పుడు మాత్రమే స్థిరత్వ జీవన విధానంవైపుకు ఈ కులాలు మళ్లుతాయి.
తెలంగాణలో వెనుకబడిన వర్గాలను నిలబెట్టేందుకు, ప్రధానంగా సంచారజాతులకు అండదండగా నిలిచేందుకు కేసీఆర్ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. సంచారజాతులు తమకాళ్లపై తాము నిలబడేందుకు ఏ సాయం ఏ మేరకు అందినా అది ఎంతో ప్రశంసనీయమైనదే అవుతుంది.
తెలంగాణలోని బాగా వెనుకబడ్డ బీసీల జీవన ముఖచిత్రం మార్చటంపై కేసీఆర్ గురిపెట్టారు. దీంతో సంచారజాతులు కూడా స్థిరనివాసం వైపుకు వెళ్లటం జరుగుతుంది. వీరి జీవన విధానంలోనే మార్పు తెచ్చే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీసీలలో బాగా వెనుకబడ్డ కులాలు, సంచారజాతుల వాళ్లు చేస్తున్న పనులకు కొంత ప్రోత్సాహం, ఆర్థిక సాయం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సంచారజాతుల వాళ్లు చేసే ఆధునికవృత్తి పనుల ద్వారా కొందరు వ్యక్తులుగా లాభపడుతున్నారు కానీ పని చేసే వారి స్థితిగతుల్లో మార్పులేదు. చెత్త ఏరుకునేవారు, పాత ప్లాస్టిక్ సామానులు సేకరించేవారు, రోజూ నగరంలో సేకరించి హోల్‌సేల్ వాళ్లకు అమ్ముతారు. చిన్నవ్యాపారులు ఈ సామాన్లు కొంటారు. పాత ఇనుము సామాన్లనంతా ఐరన్ ఫ్యాక్టరీలకు, పాతపేపర్లను కాగిత పరిశ్రమకు అందిస్తారు.
సంచార జాతుల వాళ్లు అమ్మేవస్తువులు ఇతరులెవరూ అమ్మలేరు. వీళ్లలో గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. పార్థీ(పిట్లలోళ్లు) వాళ్లు పూసలు, దువ్వెనలు, పక్కపిన్నీసులు అమ్ముతుంటారు. కొన్ని సంచార జాతులు, బుడిగ జంగాలు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటారు. మొండిబండ కులస్తులు నెత్తి వెంట్రుకలను ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. ఈ సేకరించిన వెంట్రుకల్ని కరెన్నీ కట్టల్లా కట్టలు కడతారు. వెంట్రుకలు ఇంత నల్లగా మనదేశంలోనే ఉంటాయి. ఈరకమైన వెంట్రుకలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉంటుంది. ఈ వెంట్రుకలను శుభ్రపరిచి యుకె, యుఎస్‌ఎ, నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేస్తారు. దీని ద్వారా విగ్గులు తయారుచేస్తారు. డక్కలివాళ్లు మరికొందరు మ్యూజిక్ వస్తువులకు ఫ్రేమ్‌లు తయారుచేస్తారు. కొన్ని సంచారజాతుల వాళ్లు ఇంటింటికి తిరిగి కరివేపాకులు, డప్పులు, కొన్ని రకాల పప్పులు, ముగ్గులు, ముగ్గురాళ్లు, ఇసుకరాళ్లు, రోకళ్లు అమ్ముతారు. పెద్దపెద్ద షాపుల్లో సైతం అమ్మలేని వస్తువులను వీళ్లు తమనైపుణ్యంతో అమ్ముతారు. ఇది గొప్ప వ్యాపారకళ.
పాత ఇనుము, పాతపేపర్లు, పాతప్లాస్టిక్ సామాన్లు దగ్గర నుంచి తలవెంట్రుకల వరకు వాటిని సేకరించేది, అమ్మేది, కొనేది అంతా పేదవాళ్లే. కాని ఇందుకు సంబంధించి ఒక్కహైదరాబాద్ నగరంలోనే రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దీనిపై వచ్చే ఆదాయం అంతా కొంతమంది ధనవంతుల చేతుల్లోకి పోతుంది. ఈ వృత్తులవారికి కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసి షేర్‌హోల్టర్లుగా చేస్తే సంచారజాతులు నిలబడగలుగుతాయి ఇనుము, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలన్నీ ప్రత్యామ్నాయ వృత్తులు. బాగా వెనుకబడ్డ కులస్తులైన ఈ సంచార, అర్థసంచార, ఆశ్రితకులాల వారికి రివాల్వింగ్ ఫండ్ కావాలి. ఈ ప్రత్నామ్నాయ వృత్తులకోసం కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటుచేసి వారుచేసే పనిని బట్టి ఆ కులాలకు ప్రత్యేకంగా కొంత మూలధనం సమకూర్చితే వారు మధ్యదళారుల చేతుల్లోంచి బైటపడతారు. సంచార జాతుల వాళ్లు వడ్డీలకు డబ్బుతెచ్చి వ్యాపారం చేస్తుంటారు. ఇది వీరి జీవితాలను గుల్లచేస్తోంది. వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. వీరికి ఆర్థికసాయం అందిస్తే, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా సమూహాలను ఏర్పాటు చేసి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటారు. అప్పుడే సంచారజాతులు ఉత్పత్తి కులాలుగా ఉత్పత్తి శక్తులుగా మారుతారు.
హైదరాబాద్ నగరంలో సిగ్నల్స్ దగ్గర రోడ్లపైన, రైల్వే స్టేషన్ల దగ్గర వస్తువులను అమ్మేవాళ్తంతా సంచారజాతులవాళ్లే. వీళ్లు సిగ్నల్స్ దగ్గర వాహ నాలు ఆగినప్పుడు ఆ రెండు మూడు నిమిషాల్లోనే వస్తువులను వినియోగదారులకు అమ్మే నైపుణ్యాలున్నవారు. పిల్లల ఆట వస్తువులు, గొడుగులు, ఆట బొమ్మలు, వాహనాల సీట్ల వెనుక ఆధారంగా ఉండే మెత్తలు, కార్లు తుడిచే బట్టలు వీటన్నింటిని కొన్ని నిమిషాల్లో, సెకండ్లలో అమ్మగలుగుతారు. అయితే వీరు అమ్మే అనేక వస్తువులను వీళ్లు తయారు చేయగలుగుతారు. కాకపోతే ఈ వస్తువుల తయారీకి యాంత్రికపరమైన యంత్రాలు, సాంకేతిక పరి జ్ఞానం జోడించవలసి ఉంది. ఇందుకు వీరికి ఆర్థిక సాయం అందించవలసి ఉంటుంది. చిన్న చిన్న పెట్టుబడులతో పెట్టే చిన్న పరిశ్రమలను, అత్యంత వెనుకబడిన కులాలకు సంచారజాతుల వారికి అందించవలసి ఉంది. ఈ ఆధునికవృత్తులకు సంబంధించిన ఉత్పత్తి, శిక్షణ, నైపుణ్యం అందించేందుకు వీరి కోసం ప్రత్యేక సంస్థలను నెలకొల్పవలసి ఉంది. ఇందుకోసం కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు ఫలిస్తే దేశానికి తెలంగాణ ఆదర్శమౌతుంది.
జూలూరు గౌరీ శంకర్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment