Juluru gowri sankar
-
కరోనా అనంతర జీవితం..!
చరిత్ర చెంపలపై కన్నీటిని మనిషే తన రెండు చేతులతో తుడిచేస్తాడు. కొన్నిరోజుల్లో మహ మ్మారికి విరుగుడు కనిపెట్టి సాగనంపుతారు. ‘మంచోని బుద్ధి మాంసం కాడ తెలుస్తుందన్నట్లుగా’ మానవ మనస్తత్వం చికెన్, మాంసం కొట్లకాడ కన్పిస్తుంది. నేనొక్కణ్ణే బతకాలనే దశకు ప్రపంచం వచ్చిందనుకుంటా! కరోనా తర్వాత మానవ మనస్తత్వం, ప్రవర్తన, జీవన విధానాలలో చెప్పుకోదగిన విధంగా మార్పులు వస్తాయని ఆశించవచ్చునా? భౌతిక దూరం పాటించకుండా రెండు నెలలకు సరిపడా గోధుమపిండి, నూనె ప్యాకెట్లు, పప్పు, ఉప్పు, బియ్యాలు తెచ్చుకుంటే సరిపోదు. క్లోరోక్విన్ మాత్రలే వేసుకుని బతుకుదామనే ప్రయత్నం తప్ప కరోనా తర్వాత మనుషులంతా మారిపోతారా? అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మా సీతారాం అన్నట్లు తడిచెత్త పొడిచెత్తలను వేరుచేయలేని మనుషులు స్వీయ నియంత్రణలను ఎంతవరకు పాటిస్తారోనన్న అనుమానాలు అట్లనే ఉన్నాయి. నిజంగా కరోనా సమయంలో మానవులు మహామానవులుగా, కరుణామయులుగా అవతరించాల్సిన సందర్భమే. ఇప్పటికైనా తనకు ఉన్నదాంట్లో వితరణ చేయవచ్చును. ఈ కష్టకాలంలో ఆర్థికంగా ఉన్నవాళ్లు పేదలైన కొన్ని కుటుంబాలనైనా ఆదుకోవచ్చు. ఎవరికోసమైతే తమ రాష్ట్రాలను, సొంతవూళ్లను వదిలిపెట్టి వలస కార్మికులు వచ్చారో వారిని తీసుకొచ్చిన నిర్మాణరంగ యజమానులు వాళ్లను చూడవలసిన కనీస బాధ్యతలేదా? కరోనా సమయంలో కూడా కొందరు కర్కశంగానే ఉన్నారనటానికి ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో, తదనంతరకాలంలో స్వీయ సంరక్షణతోపాటుగా ఇతరులకు తనవల్ల హాని జరుగకూడదన్న భావనలు బలంగా బలపడాలి. అది కరోనాకే కాదు సమాజంలో పేరుకుపోయిన పలు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మందు అవుతుంది. కరోనా అనంతరకాలంలో ఎట్లుం టదో? మనిషిలో ఇప్పటి వరకు గూడుకట్టుకున్న అహంకారాలు, ఆధిపత్యాలు, ఒకర్ని మరొకరు అణగదొక్కాలన్న తొక్కిసలాటలన్నీ వదిలేస్తారా? ఎక్కువ తక్కువల్లేని సమానగీతలు గీసుకుంటూ పోతారా? కరోనా అనంతరం సినిమా థియేటర్లు ఎట్ల నడుస్తయ్, బస్సులెట్లా తిరుగుతయ్, రైళ్లలో సీట్లెట్లుంటయ్, విమాన ప్రయాణాల్లో మొత్తం లగ్జరీ సీట్లే ఉంటాయా? కరోనా అనంతరం మనిషికి మనిషి ఎంతెంతదూరం? వివాహవేదికపై వధువు, వరుడూ మధ్య ఉండాల్సిన దూరం ఎంత? సామూహిక, సహపంక్తి భోజనాలు ఉంటాయా? తూఫాన్ జీపులో డైలీఫ్యాసింజర్స్ ఎంతమంది? ఆటో త్రీసీటరా! వన్ సీటరా?! తిరుపతి వెంకన్న దగ్గర భక్తుల మధ్య దూరం ఎంతెంత? బహిరంగసభలుంటాయా? సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మళ్లీ జనం పోటెత్తుతారా? బావర్చీ, ప్యారడైజ్ హోటళ్ల దగ్గర బిర్యానీ క్యూలెట్లుంటాయో? కేసీఆర్ చెప్పిండు ఇక కలవారైనా పేదవాళ్లైనా ఎవరైనా గాంధీ దవాఖానకే!! కరోనా ఖతమైనా అది ప్రపంచాన్ని వెంటాడి వేటాడిన సందర్భాన్ని మనిషి మరిచిపోకూడదు. మనిషి ప్రకృతిని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన గాలిని, నీటిని కాపాడుకోవాలి. లేకుంటే కొంతకాలానికి మరో కరోనా కనిపించే రూపమెత్తి ఏదీ మిగల్చకుండా మహా విధ్వంసం చేయవచ్చు. ఇది ఒకర్ని ఒకరం నిందించుకునే కాలం కాదిది. వలసకార్మికుల లెక్క దేశంలో ఎవరిదగ్గరా లేదు. దాన్నేం చేస్తాం? ఉన్నంతలో పాలనా యంత్రాంగాన్ని కదిలించి సాయం అందిస్తున్నారు. ఈ సమయంలో ప్రజల్లో అభద్రతను పెంచకూడదు. చేతనైన సహాయం చేయాలి. పేదలకు సహాయం అందేటట్లు చూడాలి. కరోనాకాలంలో కూడా అభద్రతా భావాన్ని కల్గించే ఇలాంటి మనస్తత్వాన్ని మార్చలేకపోయింది అదే పెద్ద విషాదం. ఈ తాళాలు తీశాక / పరిపూర్ణ మానవుని కోసం తలుపులు తెరవాలి / కొత్త వెలుగు కిరణాల నుంచైనా / బుద్ధులు క్రీస్తులు పుట్టకపోతారా అని చిన్న ఆశ../ దూరాలను దగ్గర చేసే సూదిమందు కావాలిపుడు / ఇప్పుడిక మనిషిని మనిషి ప్రేమించే / టీకా కనుక్కోవాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
దశ తిరగనున్న ‘సంచారం’
సందర్భం దాదాపు 50 ఏళ్లకు పైగా తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న 24 సంచార జాతులకు కుల సర్టిఫికెట్లను కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వగలిగితే, 2018లో సంచార జాతుల జీవితంలో కొత్త వసంతం చిగురించినట్లే. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 24 సంచారజాతుల కులాలకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అనేక విన్నపాలు బీసీ కమిషన్ దృష్టికి వచ్చాయి. వారు 1.బాగోతుల, 2.క్షత్రియ రామజోగి (రామజోగి), 3.బైలుకమ్మర, బైట కమ్మర (ఘిసాడి), 4. కాకిపడగల, 5.ఓడ్, 6. బొప్పల తోలుబొమ్మలాటవారు, 7.గంజికూటివారు, 8.ఏనూటివారు, 9.గుర్రపువాళ్లు, 10.అద్దపువారు, 11.మాసయ్యలు, 12. పటంవారు, 13.సాధనాసూరులు, 14.రుంజ, 15.పనస, 16.పెక్కర, 17.పాండవుల వారు, 18. గౌడజెట్టి, 19.ఆదికొడుకులు, 20. తెరచీరలు, 21.గవులి, 22.అహిర్ (యాదవ్), 23.సారోళ్లు, 24.వాఘిరి. వీరికి కుల సర్టిఫికెట్లు అత్యవసరంగా అందించవల్సి ఉంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి బీసీ కమిషన్ పని సులభమైంది. సంచార జాతులకు ప్రయోజనాలను చేకూర్చేందుకు కమిషన్ తనవంతు పాత్ర నిర్వహించనుంది. మొత్తం 24 కులాల జనాభా సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరికి ఈ కుల సర్టిఫికెట్లు ఇస్తే ఎంతో ఆసరాగా ఉంటుందని తమ పిల్లలు బడులు పోవడానికి మార్గం సుగమం అవుతుందని తెలియజేస్తున్నారు. నిజంగానే గత 50 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన ఏలికలు తమకేమీ చేయలేదన్న నిరాసక్తతతో ఎంబీసీ, సంచారజాతుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణతో తమ బతుకులు మారతాయని సంచారజాతులు, ఎంబీ సీలు భావిస్తున్నారు. 24 కులాలను బీసీ కులాల జాబి తాలో చేర్చడం నూతన సంవత్సరంలో జరుగుతుందని, వచ్చే ఏడాది బడులు తెరిచేనాటికి తమపిల్లలు తమ కుల సర్టిఫికెట్లతో వెళతారన్న నమ్మకం ఉంది. 2018లో తమకు మేలు జరుగుతుందన్న విశ్వాసం మొత్తం బీసీ వర్గాల్లో ఉంది. ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీల రిజర్వేషన్ 54 శాతానికి పెంచటం, దాంతో పాటుగా అన్ని వర్గాల బీసీల ప్రాతినిధ్యానికి, ఎంబీ సీలు, సంచారజాతులవారికి ఆ రిజర్వేషన్ ఫలాలందే విధంగా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ జరగాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2018లో ఎంబీసీలు, వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారికి విద్యా, ఉద్యోగ విషయాలలో ప్రత్యేక రాయితీలను కల్పించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో నాలుగు రోజులు సుదీ ర్ఘంగా చర్చించటం జరిగింది. ఆ కమిటీ ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ విషయంపై ముఖ్యమంత్రి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ సందర్భంగానే బీసీలకోసం ప్రత్యేకంగా అసెం బ్లీని కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ అసెంబ్లీలోనే అనేక కీలక అంశాలను సీఎం ప్రకటించే అవకాశం ఉంది. బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీలకు రుణాలు ఇవ్వాలని ఎప్పట్నించో చర్చ జరుగుతుంది. అది తొలిసారిగా నూతన సంవత్సరంలో ఆచరణ రూపానికి వచ్చే అవకాశం ఉంది. తరతరాలుగా సంచారం చేస్తూ స్థిరనివాసం లేని వారికి నివాసాలు కల్పించటం, వారి పిల్లలకు చదువులు చెప్పించటం జరగాలి. ఇప్పటికే గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై కొన్ని వందల కోట్ల రూపాయలను కేటాయించడం, వాటి ఫలాలను పొందే దిశగా ముందుకు సాగుతున్నారు. బీసీలలో వృత్తులనే నమ్ముకున్న వారు ఆధునిక వృత్తులలోకి వెళ్లేందుకు శిక్షణను ఇవ్వాల్సి ఉంది. ఎంట్రన్స్ పరీక్షలతో సంబంధం లేకుండా సంచార జాతుల పిల్లలకు గురుకులాలలో రిజర్వ్డ్ సీట్లను వీరికి కేటాయించాలని కోరుతున్నారు. సంచారకులాల్లో కొందరిని ఇప్పటికీ నేరస్త కులాలుగా చూస్తున్నారు. ఆ నేరస్త కులాల పట్టికను రద్దుచేయాలి. ఎంబీసీలు, సంచార జాతుల వారికి వారు చేయగల్గిన పనులన్నింటికీ ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు నిధులిచ్చి, ప్రత్యేక శిక్షణలిచ్చి, ఆధునిక వృత్తుల్లోకి తీసుకు రావాలి. మొత్తం మీద 2018 బీసీ కులాలకు, తెగలకు, ఎంబీసీలకు, సంచార జాతులకు కలిసివచ్చే సంవత్సరంగా ఉంటుందని ఆ వర్గాలు ఆశి స్తున్నాయి. తెలంగాణ సమాజం మొత్తంగా వారి ఆశలు నెరవేరాలని దీవించాలి. సంచార జాతులతో కూడిన సగం సమాజం బాగుపడితే మొత్తం తెలంగాణ సమాజం శక్తివంతమవుతుంది. ఈ 24 కులాల సంచార జాతులను బీసీ జాబితాలో చేర్చటం జరిగితే అదే తమకు కొత్త సంవత్సరపు సంతోషకరమైన వార్త అవుతుందని సంచార జాతుల వారు అంటున్నారు. ఇప్పటి వరకు కుల సర్టిఫికెట్లు లేని 24 కులాల వారికి కుల సర్టిఫికెట్లు ఇచ్చి నూతన సంవత్సరంలో విముక్తం చేస్తారన్న విశ్వాసాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. ఇది సంచార జాతులు, ఎంబీసీల సంవత్సరం, ఇది బీసీ వసంతం. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
వాళ్లే అసలైన ఉత్పత్తి శక్తులు
సందర్భం సంచారజాతుల వాళ్లు సాంప్రదాయ వృత్తులనుంచి ముందుకు సాగాలంటే వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. అప్పుడు మాత్రమే స్థిరత్వ జీవన విధానంవైపుకు ఈ కులాలు మళ్లుతాయి. తెలంగాణలో వెనుకబడిన వర్గాలను నిలబెట్టేందుకు, ప్రధానంగా సంచారజాతులకు అండదండగా నిలిచేందుకు కేసీఆర్ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. సంచారజాతులు తమకాళ్లపై తాము నిలబడేందుకు ఏ సాయం ఏ మేరకు అందినా అది ఎంతో ప్రశంసనీయమైనదే అవుతుంది. తెలంగాణలోని బాగా వెనుకబడ్డ బీసీల జీవన ముఖచిత్రం మార్చటంపై కేసీఆర్ గురిపెట్టారు. దీంతో సంచారజాతులు కూడా స్థిరనివాసం వైపుకు వెళ్లటం జరుగుతుంది. వీరి జీవన విధానంలోనే మార్పు తెచ్చే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీసీలలో బాగా వెనుకబడ్డ కులాలు, సంచారజాతుల వాళ్లు చేస్తున్న పనులకు కొంత ప్రోత్సాహం, ఆర్థిక సాయం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సంచారజాతుల వాళ్లు చేసే ఆధునికవృత్తి పనుల ద్వారా కొందరు వ్యక్తులుగా లాభపడుతున్నారు కానీ పని చేసే వారి స్థితిగతుల్లో మార్పులేదు. చెత్త ఏరుకునేవారు, పాత ప్లాస్టిక్ సామానులు సేకరించేవారు, రోజూ నగరంలో సేకరించి హోల్‌సేల్ వాళ్లకు అమ్ముతారు. చిన్నవ్యాపారులు ఈ సామాన్లు కొంటారు. పాత ఇనుము సామాన్లనంతా ఐరన్ ఫ్యాక్టరీలకు, పాతపేపర్లను కాగిత పరిశ్రమకు అందిస్తారు. సంచార జాతుల వాళ్లు అమ్మేవస్తువులు ఇతరులెవరూ అమ్మలేరు. వీళ్లలో గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. పార్థీ(పిట్లలోళ్లు) వాళ్లు పూసలు, దువ్వెనలు, పక్కపిన్నీసులు అమ్ముతుంటారు. కొన్ని సంచార జాతులు, బుడిగ జంగాలు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటారు. మొండిబండ కులస్తులు నెత్తి వెంట్రుకలను ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. ఈ సేకరించిన వెంట్రుకల్ని కరెన్నీ కట్టల్లా కట్టలు కడతారు. వెంట్రుకలు ఇంత నల్లగా మనదేశంలోనే ఉంటాయి. ఈరకమైన వెంట్రుకలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉంటుంది. ఈ వెంట్రుకలను శుభ్రపరిచి యుకె, యుఎస్ఎ, నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేస్తారు. దీని ద్వారా విగ్గులు తయారుచేస్తారు. డక్కలివాళ్లు మరికొందరు మ్యూజిక్ వస్తువులకు ఫ్రేమ్‌లు తయారుచేస్తారు. కొన్ని సంచారజాతుల వాళ్లు ఇంటింటికి తిరిగి కరివేపాకులు, డప్పులు, కొన్ని రకాల పప్పులు, ముగ్గులు, ముగ్గురాళ్లు, ఇసుకరాళ్లు, రోకళ్లు అమ్ముతారు. పెద్దపెద్ద షాపుల్లో సైతం అమ్మలేని వస్తువులను వీళ్లు తమనైపుణ్యంతో అమ్ముతారు. ఇది గొప్ప వ్యాపారకళ. పాత ఇనుము, పాతపేపర్లు, పాతప్లాస్టిక్ సామాన్లు దగ్గర నుంచి తలవెంట్రుకల వరకు వాటిని సేకరించేది, అమ్మేది, కొనేది అంతా పేదవాళ్లే. కాని ఇందుకు సంబంధించి ఒక్కహైదరాబాద్ నగరంలోనే రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దీనిపై వచ్చే ఆదాయం అంతా కొంతమంది ధనవంతుల చేతుల్లోకి పోతుంది. ఈ వృత్తులవారికి కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసి షేర్హోల్టర్లుగా చేస్తే సంచారజాతులు నిలబడగలుగుతాయి ఇనుము, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలన్నీ ప్రత్యామ్నాయ వృత్తులు. బాగా వెనుకబడ్డ కులస్తులైన ఈ సంచార, అర్థసంచార, ఆశ్రితకులాల వారికి రివాల్వింగ్ ఫండ్ కావాలి. ఈ ప్రత్నామ్నాయ వృత్తులకోసం కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటుచేసి వారుచేసే పనిని బట్టి ఆ కులాలకు ప్రత్యేకంగా కొంత మూలధనం సమకూర్చితే వారు మధ్యదళారుల చేతుల్లోంచి బైటపడతారు. సంచార జాతుల వాళ్లు వడ్డీలకు డబ్బుతెచ్చి వ్యాపారం చేస్తుంటారు. ఇది వీరి జీవితాలను గుల్లచేస్తోంది. వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. వీరికి ఆర్థికసాయం అందిస్తే, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా సమూహాలను ఏర్పాటు చేసి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటారు. అప్పుడే సంచారజాతులు ఉత్పత్తి కులాలుగా ఉత్పత్తి శక్తులుగా మారుతారు. హైదరాబాద్ నగరంలో సిగ్నల్స్ దగ్గర రోడ్లపైన, రైల్వే స్టేషన్ల దగ్గర వస్తువులను అమ్మేవాళ్తంతా సంచారజాతులవాళ్లే. వీళ్లు సిగ్నల్స్ దగ్గర వాహ నాలు ఆగినప్పుడు ఆ రెండు మూడు నిమిషాల్లోనే వస్తువులను వినియోగదారులకు అమ్మే నైపుణ్యాలున్నవారు. పిల్లల ఆట వస్తువులు, గొడుగులు, ఆట బొమ్మలు, వాహనాల సీట్ల వెనుక ఆధారంగా ఉండే మెత్తలు, కార్లు తుడిచే బట్టలు వీటన్నింటిని కొన్ని నిమిషాల్లో, సెకండ్లలో అమ్మగలుగుతారు. అయితే వీరు అమ్మే అనేక వస్తువులను వీళ్లు తయారు చేయగలుగుతారు. కాకపోతే ఈ వస్తువుల తయారీకి యాంత్రికపరమైన యంత్రాలు, సాంకేతిక పరి జ్ఞానం జోడించవలసి ఉంది. ఇందుకు వీరికి ఆర్థిక సాయం అందించవలసి ఉంటుంది. చిన్న చిన్న పెట్టుబడులతో పెట్టే చిన్న పరిశ్రమలను, అత్యంత వెనుకబడిన కులాలకు సంచారజాతుల వారికి అందించవలసి ఉంది. ఈ ఆధునికవృత్తులకు సంబంధించిన ఉత్పత్తి, శిక్షణ, నైపుణ్యం అందించేందుకు వీరి కోసం ప్రత్యేక సంస్థలను నెలకొల్పవలసి ఉంది. ఇందుకోసం కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు ఫలిస్తే దేశానికి తెలంగాణ ఆదర్శమౌతుంది. జూలూరు గౌరీ శంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
పుస్తక సమీక్షణం
పుస్తకం : వెన్నెల్లో మంచుపూలు (కవిత్వం) రచన : తిరువాయపాటి రాజగోపాల్ పేజీలు: 100 వెల: 60 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు విషయం : నువ్వు ఇప్పటికీ చిగురు వేస్తున్నావా? జీవన సాఫల్యం జుర్రుకుంటున్నావా? అవునో కాదో తేల్చుకోవాలంటే రాజగోపాల్ ‘వెన్నెల్లో మంచుపూలు’ పరిమళాన్ని ఆస్వాదించాల్సిందే. ‘అంతర్ముఖత్వం అన్ని ఔన్నత్యాలకూ ఆది మూలం’ అని విశ్వసిస్తారు కవి. ‘నా అనామకత్వానికి, నేను విసిరే సవాలు, నా కవిత్వం’ అంటారు. మనం ‘అభినయిస్తున్న విజయాలన్నీ, అప్రకటిత పరాజయాలు’ అని ఆక్షేపిస్తారు. బాల్యజ్ఞాపకాల్లోంచి ‘బతికున్న క్షణాలు’ ఏరుకుంటారు. గాలిసవ్వడిలో గాంధర్వం వింటారు. అధికారాంతం, వాడూ నేనూ, ఇలా కూడా వీలౌతుంది... ప్రతి కవితా దేనికదే ప్రత్యేకం. స్ఫూర్జితశరం, అక్షతగాత్రయోధుడు, నక్షత్ర వృక్షజాలం, దీర్ఘచతురస్రీకరణ... రాజగోపాల్ సొంత పదసామగ్రిని సృష్టించుకుంటారు. ‘రాసిన పంక్తులు, జవనాశ్వాలై, జగత్తును రంగస్థలి చేసుకుని, కవాతు చెయ్యాలి’ అన్న కవి కల నెరవేరాలని ఆశిద్దాం. - ఎమ్వీ రామిరెడ్డి లోతుగా వెంటాడే కలలు పుస్తకం : ఊదారంగు మధ్యాహ్నం (కథలు) రచన : ఎమ్మెస్ సూర్యనారాయణ పేజీలు: 98 వెల: 50 ప్రతులకు: ఎం.రత్నమాల, ఆదిత్య కుటీర్, పొదలాడ, రాజోలు, తూ.గో. -533 242 9298950941 విషయం : కవిత్వం, కథలు వేర్వేరు కావచ్చు. కానీ సూర్యనారాయణ కథలు చదివితే, కవిత్వం మారువేషంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. కోనసీమ కొబ్బరినీళ్లంత స్వచ్ఛమైన, చిక్కనైన కవిత్వం ఎమ్మెస్‌ది. అదే తరహా మ్యాగ్నటిజమ్ ఈ కథల్లోనూ టచ్ అవుతుంది. ఓ పట్టాన అర్థం కాని మోడ్రన్ ఆర్ట్లాంటి కథలివి. ఆయన కన్న కలలు, మెలకువలు, కలవర పాటలు, కలత నిదురలో రాసుకున్న స్వర్ణాక్షరాలు... వీటన్నిటి కలగలపుతో పుట్టిన కథలివి. గోదావరి నదిలో ఉండే గాంభీర్యంతో పాటు గలగల పారే చమత్కారం కూడా ఆవిష్కృతమవుతాయి. ఏదో భావజాలం, అంతర్మథనం వెంటాడీ వెంటాడనట్టుగా అనిపిస్తాయి. జన్మాంతరం, పడమటి ఉత్తరం, చిదంబర స్వప్నం, ఊదారంగు మధ్యాహ్నం, ఆత్మవస్త్రం... చదువుతుంటే, మనసుకున్న కొత్త లోతులు తెలుసుకోవాలనే తహతహ పెరుగుతుంది. ఒక్క ముక్కలో, ఇది స్లో మోషన్లో వెంటాడే కల. - శ్రీబాబు ఆలోచింపజేయటం ఒక సవాలు పుస్తకం : సవాళ్లతో సంఘర్షణ (ఉపన్యాసాలు) రచన : సీతారాం ఏచూరి పేజీలు: 228; వెల: 100 ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని ప్రజాశక్తి బ్రాంచీలు విషయం : ఒకప్పటి ప్రజానాయకుల ఉపన్యాసాలు విని, ఉద్యమ కారులుగా మారినవారు ఎందరో! ఇప్పటికీ ప్రజా ఉద్యమాల్లో పనిచేసేవారు కొందరు మాట్లాడితే జనం కదలిపోతారు. ఉపన్యాసాల ద్వారా తమ రాజకీయ భావజాలాలను వారు విస్తృతంగా ప్రచారం చేస్తారు. వామపక్ష ఉద్యమాల్లో జాతీయ నాయకుడిగా ఎదిగిన సీతారాం ఏచూరి మంచి వక్త. ఆయన తాత్విక భావజాలాన్ని, రాజకీయ అంశాలను అందరూ ఒప్పుకోవచ్చును లేదా వ్యతిరేకించవచ్చును. కానీ ఏచూరి తమ పార్టీ విధానాన్ని చెప్పేటప్పుడు, జాతీయ అంతర్జాతీయ అంశాలను విశ్లేషించేటప్పుడు ఇతరులను ఆకట్టుకునే శక్తి ఉంది. అందుకే చాలామంది మాట్లాడిన ఉపన్యాసాలు అప్పటికప్పుడు విని చప్పట్లు కొట్టి వదిలేయవచ్చును. కానీ ఏచూరి మాటలు ఆలోచింపజేసే దశకు తీసుకుపోతాయి. వామపక్ష దారిలో దేశానికి సోషలిజం వస్తుందా అన్నది సవాలక్షల సవాళ్ల ప్రశ్న అనుకోకండి. ఈ పుస్తకం ద్వారా వామపక్ష ఉద్యమదారి ఎటు పోతుందో తెలుస్తుంది. - జూలూరు గౌరీశంకర్ కొత్త పుస్తకాలు అక్షరమాల కథలు రచన: తల్లాప్రగడ రవికుమార్ పేజీలు: 134; వెల: 80 ప్రతులకు: రచయిత, 21-10-87, శ్రీనగర్ మొదటివీధి, సత్యనారాయణపురం, విజయవాడ-520011. ఫోన్: 9397831065 అంతర్భ్రమణం రచన: శ్రీ అరుణం పేజీలు: 214; వెల: 100 ప్రతులకు: విక్టరీ పబ్లిషర్స్, 30-17-18, వారణాశివారి వీధి, సీతారాంపురం, విజయవాడ-2. ఫోన్: 0866-2444156 1.వియోగి నాటికలు రచన: కోపల్లె విజయప్రసాదు పేజీలు: 200; వెల: 150 2. ఆత్మావలోకనం (నవల) రచన: శ్రీరాగి పేజీలు: 154; వెల: 120 3. సగటు ఉద్యోగి (నవల) రచన: శ్రీరాగి పేజీలు: 346; వెల: 200 ప్రతులకు: టి కె విశాలాక్షిదేవి, 87/395, కమలానగరు, బి క్యాంపు, కర్నూలు-518002. ఫోన్: 9502629095 శ్రీ గాయత్రీ శంకర భాష్యము (ఆంధ్ర వివరణ సహితము) రచన: శ్రీ శ్రీ చిదానంద భారతీ స్వామి పేజీలు: 112; వెల: 100 ప్రతులకు: బండారు శివరామకృష్ణశర్మ, శ్రీ చిదానంద భారతీస్వామి ఫౌండేషన్, 11-17-32/1, రామిరెడ్డిపేట, నరసరావుపేట. ఫోన్: 9247897994 ముక్తకములు రచన: డా.వై.బాలరాజు పేజీలు: 96; వెల: 90 ప్రతులకు: రచయిత, 2-9-12, బస్టాండ్ రోడ్, జనగాం, వరంగల్-506167. ఫోన్: 8500040827