
చరిత్ర చెంపలపై కన్నీటిని మనిషే తన రెండు చేతులతో తుడిచేస్తాడు. కొన్నిరోజుల్లో మహ మ్మారికి విరుగుడు కనిపెట్టి సాగనంపుతారు. ‘మంచోని బుద్ధి మాంసం కాడ తెలుస్తుందన్నట్లుగా’ మానవ మనస్తత్వం చికెన్, మాంసం కొట్లకాడ కన్పిస్తుంది. నేనొక్కణ్ణే బతకాలనే దశకు ప్రపంచం వచ్చిందనుకుంటా! కరోనా తర్వాత మానవ మనస్తత్వం, ప్రవర్తన, జీవన విధానాలలో చెప్పుకోదగిన విధంగా మార్పులు వస్తాయని ఆశించవచ్చునా? భౌతిక దూరం పాటించకుండా రెండు నెలలకు సరిపడా గోధుమపిండి, నూనె ప్యాకెట్లు, పప్పు, ఉప్పు, బియ్యాలు తెచ్చుకుంటే సరిపోదు. క్లోరోక్విన్ మాత్రలే వేసుకుని బతుకుదామనే ప్రయత్నం తప్ప కరోనా తర్వాత మనుషులంతా మారిపోతారా? అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మా సీతారాం అన్నట్లు తడిచెత్త పొడిచెత్తలను వేరుచేయలేని మనుషులు స్వీయ నియంత్రణలను ఎంతవరకు పాటిస్తారోనన్న అనుమానాలు అట్లనే ఉన్నాయి.
నిజంగా కరోనా సమయంలో మానవులు మహామానవులుగా, కరుణామయులుగా అవతరించాల్సిన సందర్భమే. ఇప్పటికైనా తనకు ఉన్నదాంట్లో వితరణ చేయవచ్చును. ఈ కష్టకాలంలో ఆర్థికంగా ఉన్నవాళ్లు పేదలైన కొన్ని కుటుంబాలనైనా ఆదుకోవచ్చు. ఎవరికోసమైతే తమ రాష్ట్రాలను, సొంతవూళ్లను వదిలిపెట్టి వలస కార్మికులు వచ్చారో వారిని తీసుకొచ్చిన నిర్మాణరంగ యజమానులు వాళ్లను చూడవలసిన కనీస బాధ్యతలేదా? కరోనా సమయంలో కూడా కొందరు కర్కశంగానే ఉన్నారనటానికి ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో, తదనంతరకాలంలో స్వీయ సంరక్షణతోపాటుగా ఇతరులకు తనవల్ల హాని జరుగకూడదన్న భావనలు బలంగా బలపడాలి. అది కరోనాకే కాదు సమాజంలో పేరుకుపోయిన పలు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మందు అవుతుంది. కరోనా అనంతరకాలంలో ఎట్లుం టదో? మనిషిలో ఇప్పటి వరకు గూడుకట్టుకున్న అహంకారాలు, ఆధిపత్యాలు, ఒకర్ని మరొకరు అణగదొక్కాలన్న తొక్కిసలాటలన్నీ వదిలేస్తారా? ఎక్కువ తక్కువల్లేని సమానగీతలు గీసుకుంటూ పోతారా?
కరోనా అనంతరం సినిమా థియేటర్లు ఎట్ల నడుస్తయ్, బస్సులెట్లా తిరుగుతయ్, రైళ్లలో సీట్లెట్లుంటయ్, విమాన ప్రయాణాల్లో మొత్తం లగ్జరీ సీట్లే ఉంటాయా? కరోనా అనంతరం మనిషికి మనిషి ఎంతెంతదూరం? వివాహవేదికపై వధువు, వరుడూ మధ్య ఉండాల్సిన దూరం ఎంత? సామూహిక, సహపంక్తి భోజనాలు ఉంటాయా? తూఫాన్ జీపులో డైలీఫ్యాసింజర్స్ ఎంతమంది? ఆటో త్రీసీటరా! వన్ సీటరా?! తిరుపతి వెంకన్న దగ్గర భక్తుల మధ్య దూరం ఎంతెంత? బహిరంగసభలుంటాయా? సమ్మక్క సారలమ్మ మహాజాతరలో మళ్లీ జనం పోటెత్తుతారా? బావర్చీ, ప్యారడైజ్ హోటళ్ల దగ్గర బిర్యానీ క్యూలెట్లుంటాయో? కేసీఆర్ చెప్పిండు ఇక కలవారైనా పేదవాళ్లైనా ఎవరైనా గాంధీ దవాఖానకే!! కరోనా ఖతమైనా అది ప్రపంచాన్ని వెంటాడి వేటాడిన సందర్భాన్ని మనిషి మరిచిపోకూడదు.
మనిషి ప్రకృతిని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన గాలిని, నీటిని కాపాడుకోవాలి. లేకుంటే కొంతకాలానికి మరో కరోనా కనిపించే రూపమెత్తి ఏదీ మిగల్చకుండా మహా విధ్వంసం చేయవచ్చు. ఇది ఒకర్ని ఒకరం నిందించుకునే కాలం కాదిది. వలసకార్మికుల లెక్క దేశంలో ఎవరిదగ్గరా లేదు. దాన్నేం చేస్తాం? ఉన్నంతలో పాలనా యంత్రాంగాన్ని కదిలించి సాయం అందిస్తున్నారు. ఈ సమయంలో ప్రజల్లో అభద్రతను పెంచకూడదు. చేతనైన సహాయం చేయాలి. పేదలకు సహాయం అందేటట్లు చూడాలి. కరోనాకాలంలో కూడా అభద్రతా భావాన్ని కల్గించే ఇలాంటి మనస్తత్వాన్ని మార్చలేకపోయింది అదే పెద్ద విషాదం. ఈ తాళాలు తీశాక / పరిపూర్ణ మానవుని కోసం తలుపులు తెరవాలి / కొత్త వెలుగు కిరణాల నుంచైనా / బుద్ధులు క్రీస్తులు పుట్టకపోతారా అని చిన్న ఆశ../ దూరాలను దగ్గర చేసే సూదిమందు కావాలిపుడు / ఇప్పుడిక మనిషిని మనిషి ప్రేమించే / టీకా కనుక్కోవాలి.
జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment