దలాల్‌ స్ట్రీట్‌ ఢాం | Russia, Ukraine conflict raises big risks for global economy | Sakshi
Sakshi News home page

దలాల్‌ స్ట్రీట్‌ ఢాం

Published Fri, Feb 25 2022 5:32 AM | Last Updated on Fri, Feb 25 2022 9:50 AM

Russia, Ukraine conflict raises big risks for global economy - Sakshi

ముంబై: ఉక్రెయిన్‌లో రష్యా వేసిన బాంబులకు దలాల్‌ స్ట్రీట్‌ దద్దరిల్లింది. గత రెండేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో మార్కెట్లో మహా ఉత్పాతం సంభవించింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాల ఊచకోత జరగడంతో యుద్ధానికి మించిన రక్తపాతం జరిగింది. యుద్ధ భయాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన స్టాక్‌ సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. వెరసి స్టాక్‌ మార్కెట్లకు ఈ గురువారం ‘‘టెర్రిబుల్‌ థర్స్‌డే’’గా నిలిచిపోయింది. సెన్సెక్స్‌ 2,702 పాయింట్లు నష్టపోయి 54,530 వద్ద ముగిసింది.

నిఫ్టీ 815 పాయింట్లు క్షీణించి 16,248 వద్ద నిలిచింది. తొలి దశ కోవిడ్‌ లాక్‌డౌన్‌ విధింపు ప్రకటన(2020 మార్చి 23)తర్వాత జరిగిన సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఏకంగా ఆరుశాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లోనూ ఏ ఒక్క షేరు లాభపడలేదు. ఇండెక్సుల్లో దిగ్గజాలైన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్, యాక్సిస్, బ్యాంక్, టెక్‌ మహీంద్రా, మారుతీ షేర్లు ఏడుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,448 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.7,668 కోట్లను కొన్నారు.  

ఇంట్రాడేలో ట్రేడింగ్‌ ఇలా...  
ఉదయం సెన్సెక్స్‌  1,814 పాయింట్ల భారీ పతనంతో 55,418 వద్ద మొదలైంది. నిఫ్టీ 514 పాయింట్ల క్షీణించి 16,549 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమ్మకాల సునామీ ట్రేడింగ్‌ ముగిసే వరకు కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్‌ 2,850 పాయింట్లు క్షీణించి 54,383, నిఫ్టీ 860 పాయింట్లు 16,203 వద్ద కనిష్టాలను తాకాయి.  

మార్కెట్లో మరిన్ని సంగతులు
► ఇన్వెస్టర్లు భయాలను ప్రతిబింబించే వొలటాలిటి ఇండెక్స్‌ వీఐఎక్స్‌ 30.31 శాతం ఎగిసి 31.98 స్థాయికి చేరింది.
► బీఎస్‌ఈ ఎక్సే్ఛంజీలోని నమోదైన మొత్తం కంపెనీల షేర్లలో 3,160 షేర్లు నష్టాన్ని, 232 షేర్లు స్టాకులు లాభపడ్డాయి. 86 షేర్లులో ఎలాంటి మార్పులేదు. ఇందులో 279 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి.  
► ఇదే ఎక్సే్ఛంజీల్లో వివిధ రంగాలకు ప్రాతినిథ్యం వహించే మొత్తం 19 రంగాల ఇండెక్సులన్నీ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్సులు 6% క్షీణించాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీల్లో ఒక్క షేరు లాభపడలేదు.


రూ.13.57 లక్షల కోట్లు ఆవిరి
రష్యా సైనిక చర్య ప్రభావంతో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. సెన్సెక్స్‌ రెండేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూడటంతో బీఎస్‌ఈలో రూ.13.57 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువ రూ.242.20 లక్షల కోట్లకు దిగివచ్చింది. గతేడాది(2021) అక్టోబర్‌ 18న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.274.69 లక్షల కోట్లకు చేరి జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. నాటితో పోలిస్తే నాలుగు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.32 లక్షల కోట్లను కోల్పోయారు.

బంగారం భగభగ
పెట్టుబడులకు ‘పసిడి’ కవచం
అంతర్జాతీయ మార్కెట్‌లో 2,000 డాలర్లకు చేరువ...
దేశీయంగా ఒకేరోజు రూ. 2,000 అప్‌  

న్యూఢిల్లీ: యుద్ధ తీవ్రత నేపథ్యంలో ఇన్వెస్టర్లు తక్షణం తమ పెట్టుబడులకు బంగారాన్ని ఆశ్రయించారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో గత ముగింపుతో పోల్చితే  20 డాలర్లు లాభంతో 1930 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా చూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 52 వారాల కనిష్టం 1,682 డాలర్లు. కోవిడ్‌–19 తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయ  మార్కెట్‌లో 2020 ఆగస్టులో పసిడి ధర ఆల్‌టైమ్‌ గరిష్టం 2,152 డాలర్లను తాకింది. వ్యాక్సినేషన్, కరోనా భయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో ధర క్రమంగా దిగివస్తూ, 2021 ఆగస్టునాటికి 1,682 డాలర్లకు దిగివచ్చింది. అయితే ఈ స్థాయి కొనుగోళ్ల మద్దతుతో తిరిగి క్రమంగా 1,800 డాలర్ల స్థాయికి చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు తిరిగి పసిడిని కీలక అవరోధం 1,910 డాలర్ల పైకి చేర్చాయి.

దేశీయంగా భారీ జంప్‌
ఇక అంతర్జాతీయంగా చరిత్రాత్మక ధరకు చేరిన సందర్భంలో దేశీయంగా పసిడి ధర 10 గ్రాములకు ధర మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్‌) రూ.56,191కి చేరింది. వార్షికంగా ఇది దాదాపు 45% పెరుగుదల. అటు తర్వాత క్రమంగా రూ.45 వేల దిగువకు దిగివచ్చిన పసిడి ధర,  ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో రూ.51,540 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపుతో పోల్చితే ఇది రూ.1,160 పెరుగుదల. ట్రేడింగ్‌ ఒక దశలో ధర రూ.52,797కు చేరడం గమనార్హం.  దేశీయ ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్‌లో పసిడి 10 గ్రాముల ధర గురువారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత 2,491 పెరిగి రూ. 52,540 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.2,481 ఎగసి రూ.52,330కి చేరింది. వెండి కేజీ ధర రూ. 3,946 ఎగసి రూ.68,149 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రాతిపదికన పసిడి తదుపరి కదలికలు ఉంటాయని భావిస్తున్నారు.  

అయ్యో.. రూ‘పాయే’...
 99 పైసలు నష్టంతో 75.60 కు డౌన్‌  
భారత్‌ కరెన్సీ రూపాయిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం 99 పైసలు బలహీనపడి, 75.60 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, దీనితో మార్కెట్‌ పతనం, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు రూపాయిని బలహీనపరిచాయి. ట్రేడింగ్‌లో విలువ 75.02 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.75కు పతనమైంది. ఆయిల్‌ దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్‌ వచ్చింది. ఆసియా దేశాల కరెన్సీల్లో రూపాయి తీవ్రంగా నష్ట పోయింది.  కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలర్‌ ఇండెక్స్‌ 1.30 శాతం లాభంతో 97.35 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).   

నష్టాలకు కారణాలివే...  
► యుద్ధ భయాలు
అంతర్జాతీయ ఆంక్షల బెదిరింపులను లెక్కచేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై ‘‘వార్‌’’ ప్రకటించడం మార్కెట్‌ వర్గాలను కలవరపెట్టింది. రష్యా సేనలు గురువారం ఉదయం తూర్పు ఉక్రెయిన్‌పై దాడికి దిగాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు.   
► క్రూడాయిల్‌ కష్టాలు
ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటింది. ప్రపంచ క్రూడ్‌ ఎగుమతుల్లో పదిశాతం వాటాను కలిగి ఉన్న రష్యాపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తే  ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించడం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది.  
► ఎఫ్‌అండ్‌ఓ ముగింపు అమ్మకాలు  
ఫిబ్రవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు స్కేయర్‌ ఆఫ్‌ చేసుకున్నట్లు గణాంకాలు తెలిపాయి. వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కూడా గురువారమే కావడంతో ఇన్వెస్టర్లు విక్రయాలకు తెగబడ్డారు.
► ప్రపంచ మార్కెట్ల పతనం  
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయోచ్చనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. యుద్ధ భయాలతో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు ఆకాశానికి చేరుకోవడంతో పాటు, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల పతానికి కారణమయ్యాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా, తైవాన్‌ సూచీలు మూడు శాతం నుంచి రెండున్నర శాతం వరకు నష్టపోయాయి. జపాన్, చైనా ఇండోనేషియా దేశాలు  2% క్షీణించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ‘‘వార్‌’’ జరుగుతున్న ఐరోపా ప్రాంతాల్లోనూ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అక్కడి ప్రధాన మార్కెట్లైన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్‌ సూచీలు నాలుగు నష్టపోయాయి. అమెరికా మార్కెట్ల రెండున్నర శాతం నష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలానికి కారణమైన రష్యా  ప్రధాన స్టాక్‌ సూచీ ఆర్‌టీఎస్‌ 38 శాతం క్షీణించింది. మరో సూచీ ఎంఓఈఎక్స్‌ 45 శాతం మేర పతనమైంది. డాలర్‌ మారకంలో రష్యా దేశ కరెన్సీ రూబుల్‌ 45% పతనమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement