స్టాక్‌ మార్కెట్‌: బడ్జెట్‌ ముందు అప్రమత్తత | Share Market Highlights: Nifty settles above 17600,Bank Nifty ends in green | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌: బడ్జెట్‌ ముందు అప్రమత్తత

Published Wed, Feb 1 2023 7:54 AM | Last Updated on Wed, Feb 1 2023 7:55 AM

Share Market Highlights: Nifty settles above 17600,Bank Nifty ends in green - Sakshi

ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో స్టాక్‌ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో 2022–23 ఆర్థిక సర్వే సమర్పణ, నేడు(బుధవారం)బడ్జెట్, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయం వెల్లడి తదితర కీలక పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వహించారు. ట్రేడింగ్‌లో 683 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్‌ 49 పాయింట్లు పెరిగి 59,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆఖరికి 13 పాయింట్ల లాభంతో 17,662 వద్ద నిలిచింది.

బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఫార్మా, అయిల్‌అండ్‌గ్యాస్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 1.50%, రెండుశాతానికి పైగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,440 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,506 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ వెల్లడి(నేడు) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలపడంతో రూపాయి 41 పైసలు క్షీణించి 81.93 స్థాయి వద్ద స్థిరపడింది. 

మార్కెట్లో మరిన్ని సంగతులు  
►     జనవరి అమ్మక గణాంకాల వెల్లడి(నేడు)కి ముందు ఆటో కంపెనీల షేర్లు రాణించాయి. అశోక్‌ లేలాండ్, ఎంఅండ్‌ఎం, భాష్, మదర్శన్, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు 3.50% నుంచి మూడుశాతం దూసుకెళ్లాయి. హీరోమోటోకార్ప్, ఎంఆర్‌ఎఫ్, టాటా మోటార్స్‌ షేర్లు రెండుశాతం పెరిగాయి. భారత్‌ ఫోర్జ్, మారుతీ సుజుకీ, టీవీఎస్‌ మోటార్స్‌ షేర్లు ఒకశాతం లాభపడ్డాయి. 
►   క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య బలహీన అంచనా వ్యాఖ్యలతో టెక్‌ మహీంద్రా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో రెండుశాతం నష్టపోయి రూ.1,015 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతం క్షీణించి రూ.996 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement