షేర్స్, మ్యూచువల్ ఫండ్స్‌కు ఇక అది తప్పనిసరి
షేర్స్, మ్యూచువల్ ఫండ్స్‌కు ఇక అది తప్పనిసరి
Published Thu, Aug 10 2017 9:17 AM | Last Updated on Sat, Sep 16 2017 4:19 PM
ముంబై : స్టాక్‌మార్కెట్‌లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇక మీరందరూ కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దలాల్ స్ట్రీట్‌లో జరిగే అవకతవకలని, పన్ను ఎగవేతలను, బ్లాక్ మనీని వైట్‌గా చేసుకునే ప్రక్రియను నిర్మూలించడానికి త్వరలోనే సరికొత్త నిబంధనలు రాబోతున్నాయి. అవేమిటంటే.. ఇప్పటికే పలు ప్రయోజనాలకు, పథకాలకు తప్పనిసరి చేస్తూ వస్తున్న ఆధార్‌ను, దలాల్‌స్ట్రీట్‌లోకి అడుగుపెట్టడానికి తప్పనిసరి చేయబోతున్నారు. షేర్లను, మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలుచేయడానికి ఇక ఆధార్ త్వరలోనే తప్పనిసరి కాబోతుందని తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం, సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడైంది. ఆధార్‌తో స్టాక్ మార్కెట్ ద్వారా బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునే ప్రక్రియకు కళ్లెం వేయొచ్చని ప్రభుత్వం, సెబీ భావిస్తోంది.
కేవలం పాన్ మాత్రమే పన్ను లీక్స్‌ను అరికట్టలేదని ప్రభుత్వం గుర్తించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీల కోసం తాము తీసుకునే చర్యలతో తప్పుడు కార్యక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఫైనాన్సియల్ మార్కెట్ లావాదేవీలకు ఏకైక గుర్తింపు సంఖ్య లాగా పాన్‌ను ఆధార్ భర్తీ చేస్తుందో లేదో ఇంకా స్పష్టంకాలేదు. అయితే అవినీతి రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి ఫైనాన్సియల్ మార్కెట్ లావాదేవీలతో ఆధార్‌ను లింక్‌చేయడం ఎంతో ముఖ్యమైన అంశమని ఐఐఎఫ్‌ఎల్ గ్రూప్ చైర్మన్ నిర్మల్ జైన్ తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం పాన్‌కు, బ్యాంకు అకౌంట్లకు, మొబైల్ ఫోన్ నెంబర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాదారులు తమ ఆధార్‌ను లింక్ చేసుకునే గడువును ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు విధించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లలో ఆన్‌లైన్ కేవైసీలకు ప్రస్తుతం దీన్ని వాడుతున్నారు.
Advertisement