కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ | Sensex, Nifty close at record highs, Infosys leads gains in IT stocks | Sakshi
Sakshi News home page

కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ

Published Tue, Jan 14 2020 6:14 AM | Last Updated on Tue, Jan 14 2020 6:14 AM

Sensex, Nifty close at record highs, Infosys leads gains in IT stocks - Sakshi

అమెరికా–చైనాల మధ్య తొలి దశ ఒప్పందంపై సంతకాలు ఈ వారమే జరుగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా సోమవారం లాభపడింది. గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 1.8 శాతం వృద్ధి సాధించడం, ఇన్ఫోసిస్‌ క్యూ3 ఫలితాలు అంచనాలను మించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 70.82కు చేరడం(ఇంట్రాడేలో), సానుకూల ప్రభావం చూపించాయి. టెక్నాలజీ, బ్యాంక్, లోహ, రియల్టీ  షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లను సృష్టించాయి. ఇంట్రాడేలో 41,900 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్‌ చివరకు 260 పాయింట్ల లాభంతో 41,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,330 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో 12,338 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.

నికర లాభాలు పెరుగుతాయ్‌....!  
ఇన్ఫోసిస్‌ క్యూ3 ఫలితాలు బాగా ఉండటంతో ఇతర కంపెనీల ఫలితాలు కూడా బాగానే ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల కారణంగా కంపెనీల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో నికర లాభాలు మాత్రం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆసియా,  యూరప్‌ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి.  
     
► నికర లాభం 24 శాతం పెరగడంతో ఇన్ఫోసిస్‌ షేర్‌ 4.7 శాతం లాభంతో రూ.773 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. సెన్సెక్స్‌ మొత్తం 260 పాయింట్ల లాభంలో సగం పాయింట్లు  (125 పాయింట్లు) ఇన్ఫోసిస్‌ షేర్‌వి కావడం విశేషం.  

► ఇన్వెస్టర్ల సంపద ఒక్క సోమవారం రోజే రూ. లక్ష కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 1 లక్ష కోట్లు పెరిగి రూ.158.74 లక్షల కోట్లకు ఎగసింది.  

► లిస్టింగ్‌ నిబంధనలను పాటించనందున వచ్చే నెల 3 నుంచి కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ షేర్ల ట్రేడింగ్‌ నిలిచిపోనున్నది. దీంతో ఈ రెండు షేర్లు చెరో 5 శాతం మేర నష్టపోయాయి. కాఫీ డే షేర్‌ రూ.39.65కు, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ షేర్‌ 4.9 శాతం నష్టంతో రూ.10.80కు చేరాయి.

► జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్, మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్, ఫీనిక్స్‌ మిల్స్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్, టాటాగ్లోబల్‌ బేవరేజేస్‌ తదితర షేర్లు  ఆల్‌టైం హైని తాకాయి.

► ఎర్విన్‌ సింగ్‌బ్రెయిచ్‌ పెట్టుబడుల ప్రణాళికను యస్‌ బ్యాంక్‌ తిరస్కరించింది. ఈ బ్యాంక్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఒకరు రాజీనామా చేశారు. అంతే కాకుండా నిధుల సమీకరణను రూ.10,000 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించింది. దీంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 6 శాతం నష్టంతో రూ.42 వద్ద ముగిసింది.  

► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో డీఎల్‌ఎఫ్‌ షేర్‌ జోరుగా పెరిగింది. 3.5 శాతం లాభంతో రూ. 253కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement