రికార్డుల ర్యాలీ కొనసాగేనా..? | Asian Stocks Seen Mixed Ahead of Holiday Break | Sakshi
Sakshi News home page

రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?

Published Mon, Dec 23 2019 5:35 AM | Last Updated on Mon, Dec 23 2019 5:35 AM

Asian Stocks Seen Mixed Ahead of Holiday Break - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గతవారం వరుస రికార్డులతో దూసుకెళ్లింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో.. ఏకంగా నాలుగు రోజులు సూచీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. జీఎస్‌టీలో వడ్డనలు లేకపోవడం, అమెరికా–చైనాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్‌ యూనియన్‌తో బ్రిటన్‌ ఒప్పందానికి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అంగీకారం తెలపడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో గడిచిన వారంలో సెన్సెక్స్‌ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. శుక్రవారం 12,294 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 12,272 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 41,810 పాయింట్లకు చేరుకుని.. చివరకు 41,682 వద్ద నిలిచింది. ఈ స్థాయి రికార్డులతో జోరుమీదున్న మన మార్కెట్‌.. ఈవారంలో ఏ విధంగా ఉండనుందనే అంశానికి, ప్రధానంగా అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనా వేస్తున్నారు.  

కన్సాలిడేషన్‌కు చాన్స్‌..!
వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీ మార్కెట్‌ ఈ వారంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. వాల్యుయేషన్స్‌ ప్రియంగా మారడమే ఇందుకు కారణంగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే ఈ వారంలో కొనుగోలు చేయడం వివేకవంతమైన విధానమని, మార్కెట్‌ బాగా పెరిగినందున కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ పరిశోధన విభాగం వీపీ అజిత్‌ మిశ్రా అన్నారు. బాగా పెరిగిన షేర్ల నుంచి ప్రాఫిట్‌ బుకింగ్‌ జరిగి వ్యాల్యూ పిక్స్‌ వైపునకు పెట్టుబడులు మారే అవకాశం ఉన్నందున తాను కూడా కన్సాలిడేషన్‌ జరగవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ నాయర్‌ చెప్పా రు. ఏడాది చివరి రోజులు కావడంతో స్టాక్‌ స్పెసి ఫిక్‌ ర్యాలీకి మాత్రమే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ
జిమీత్‌ మోడీ విశ్లేషించారు.

సెన్సెక్స్‌ 30 సూచీ నుంచి యస్‌ బ్యాంక్‌ అవుట్‌
బొంబే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (బీఎస్‌ఈ) బెంచ్‌మార్క్‌ సూచీ (సెన్సెక్స్‌)లోని 30 షేర్ల జాబితాలో ఈ వారంలోనే భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా మోటార్స్, టాటా మోటార్స్‌ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్‌ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్‌ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్‌ఈ చేర్చనుంది. ఇదే విధంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ వంటి పలు సూచీల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ఫండ్‌ మేనేజర్లు వారి పోర్ట్‌ఫోలియోలో భారీ మార్పులను చేయనున్నారని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఉండడం వల్ల రికార్డుల ర్యాలీ కొనసాగేందుకు అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే..
క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం (25న) దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (26న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement