![Sensex technical aspects 32365 - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/11/mar.jpg.webp?itok=37KkW0Rz)
ఒకవైపు కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో మే నెల తొలిరోజుల్లో ప్రపంచ మార్కెట్లన్నీ పతనానికి గురైనప్పటికీ, వెనువెంటనే నష్టాల నుంచి కోలుకున్నాయి. కానీ ఇండియా మార్కెట్ మాత్రం గతవారం 6.5 శాతం వరకూ నష్టపోయింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్‌జోన్లు అయినందున ఆర్థిక వ్యవస్థ నిస్తేజంకావడం. రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో జాప్యం వంటి స్థానిక అంశాలు ఇక్కడి మార్కెట్లను కోలుకోనీయలేదు. ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత భారీ ద్రవ్యలోటుకు దారితీసే అతిపెద్ద ప్రభుత్వ రుణ సమీకరణ ప్రకటన వెలువడింది. ఇది సమీప భవిష్యత్తులో మార్కెట్‌కు ప్రతికూలాంశమే. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
మే 8తో ముగిసినవారంలో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 31,160 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 2,075 పాయింట్ల భారీ నష్టంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 31,160–32,365 పాయింట్ల శ్రేణి కీలకం. ఈ శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే...అటు ప్రయాణించే అవకాశం వుంటుంది. 32,365 పాయింట్ల తొలి అవరోధస్థాయిని దాటితే వేగంగా 32,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 33,350 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ వారం 31,160 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 30,750 వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 30,350 వరకూ పడిపోవొచ్చు.
నిఫ్టీ కీలకశ్రేణి 9,115–9,450 పాయింట్లు
గత సోమవారం భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఏ దశలోనూ రికవరీకాలేక, 9,116 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 608 పాయింట్ల నష్టంతో 9,252 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 9,115–9,450 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి కీలకం. ఈ శ్రేణిని ఎటు అధిగమిస్తే, అటువైపు నిఫ్టీ కదలవచ్చు. ఈ వారం 9,450 పాయింట్ల నిరోధాన్ని నిఫ్టీ దాటితే 9,530 పాయింట్ల స్థాయిని వెనువెంటనే అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే 9,730 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ వారం 9,115 పాయింట్ల మద్దతును కోల్పోతే, వేగంగా 8,960 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 8,810 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు.
– పి. సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment