న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది.
2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది.
ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్‌లో 90 డాలర్లు, నవంబర్‌లో 83.42 డాలర్లకు దిగొచ్చింది.
స్థిరత్వం లేనందునే..
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది.
ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు.
క్రూడాయిల్ డిమాండ్‌కు భారత్, ఆఫ్రికా దన్ను
అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙
ఎస్‌అండ్‌పీ నివేదిక
భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్‌లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది.
80–90 డాలర్ల రేటు..
సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు.
పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్‌కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment