న్యుఢిల్లీ: కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వరకట్న నిరోధక చట్టంలో మార్పులు అవసరం లేదని అభిప్రాయ పడుతున్నారు. మహిళలకు రక్షణగా ఉన్న చట్టం 498 A ఒక్కటేనని, అది యథాతథంగా ఉంటేనే మేలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ చట్ట సవరణకు సంబంధించి తన దగ్గరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆమె అన్నారు. దేశంలో అత్యధికంగా నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో వరకట్నహత్య కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మహిళా సంఘాల వాదనతో ఆమె ఏకీభవించారు.
వరకట్నం నిరోధక చట్టం(498 A) దుర్వినియోగమవుతోందన్న ఆరోపణలతో చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర గృహమంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో మేనకగాంధీ ఇలా స్పందించారు. కాగా 498 A కేసుల్లో పదిశాతం తప్పుడు కేసులు నమోదవుతున్నాయన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మహిళాసంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే.