కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.
కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.
సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..
ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్‌తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
ఉద్యోగులకు షేర్‌క్యాపిటల్‌లో 5 శాతం వాటా
కంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్‌క్యాపిటల్‌లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.
ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
కరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment