టీజర్ లోన్స్ మళ్లీ కావాలి: ఎస్‌బీఐ
ముంబై: టీజర్(తక్కువ వడ్డీరేటు)రుణాలను మళ్లీ అందుబాటులోకి తేవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోరుతోంది. అయితే దీనికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ వ్యక్తం చేస్తోంది. టీజర్ రుణాల్లో ప్రారంభ సంవత్సరాల్లో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. తర్వాత ఫ్లోటింగ్ రేట్‌కు వడ్డీరేటును సవరిస్తారు. రుణ నాణ్యత ఆందోళన కారణంగా నాలుగేళ్ల క్రితం ఆర్‌బీఐ టీజర్ రుణాలను అటకెక్కించింది. అయితే వీటిని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య కోరుతున్నారు.
ప్రారంభంలో వడ్డీరేట్లు తక్కువగా ఉంటే ప్రజలు రుణాలు తీసుకుంటారని, కాలం గడుస్తున్న కొద్దీ, వారి వేతనాలు పెరుగుతాయి కాబట్టి, నెలవారీ సమాన వాయిదా(ఈఎంఐ)లు పెరిగినా ఇబ్బంది ఉండదని వివరించారు. అయితే తాము మాత్రం ప్రామాణిక వడ్డీరేట్ల రుణాలకే ప్రాధాన్యత ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ ఈడీ రాజీవ్ సభర్వాల్ పేర్కొన్నారు. ఈ తరహా రుణాల వల్ల రుణ కాలపరిమితి తీరేవరకూ ఒకే తరహా వడ్డీరేటు అమల్లో ఉంటుందని, ఎంత ఈఎంఐ చెల్లించేదీ రుణగ్రస్తుడికి అవగాహన ఉంటుందని వివరించారు.