ఇంటి రుణం.. ఇదీ పన్ను ప్రయోజనం | Government provides tax benefits for to home loans | Sakshi
Sakshi News home page

ఇంటి రుణం.. ఇదీ పన్ను ప్రయోజనం

Published Mon, May 25 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

ఇంటి రుణం.. ఇదీ పన్ను ప్రయోజనం

ఇంటి రుణం.. ఇదీ పన్ను ప్రయోజనం

ఏళ్ళకు ఏళ్లు సాగే గృహ రుణాలు వడ్డీలపరంగా చూస్తే భారంగానే కనిపిస్తాయి. కానీ వీటి వల్ల పన్ను పరమైన లాభాలూ ఉంటాయి. వాటి పరంగా చూస్తే లాభమే. గృహ రుణ చెల్లింపుల్లో అసలుపై, వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. అదెలాగన్నది వివరించేదే ఈ కథనం.
 
ఇల్లు కొనడమంటే మాటలు కాదు. మొదట డౌన్‌పేమెంట్ కింద బోలెడంత కట్టాలి. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకుంటే.. అనేక సంవత్సరాల పాటు ప్రతి నెలా వాయిదాలు కడుతూ పోవాలి. ఇల్లు కొనేవారికిది భారమే. అందుకే ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గృహ రుణాలపై కొంత పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. దీని ప్రధానోద్దేశం.. ప్రాపర్టీలను కొనేలా ప్రజల్ని ప్రోత్సహించడం, తద్వారా నిర్మాణ రంగానికి, బ్యాంకింగ్‌కు ఊతమివ్వడం. ఇలా చేస్తే ఇది మిగతా రంగాలకూ విస్తరించి ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు లభిస్తుంది.

పన్ను మినహాయింపులకొస్తే.. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం-1961 ప్రకారం 24, 80సీ, 80ఈఈ సెక్షన్ల కింద ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పిస్తోంది. కేవలం వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) మాత్రమే ఈ ప్రయోజనాలకు అర్హులు. ఇవి గృహ రుణాలకే తప్ప ప్రాపర్టీపై తీసుకునే లోన్‌కు వర్తించవు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీపైనా అదనపు పన్ను రాయితీలు లభించేలా గత యూపీఏ ప్రభుత్వం సెక్షన్ 80ఈఈని 2013-14లో ప్రవేశపెట్టింది. అప్పట్లో తొలిసారి ఇంటి రుణం తీసుకున్న వారికి వడ్డీపై సెక్షన్ 24కింద ఇచ్చిన మినహాయింపుతో అదనంగా మరో రూ.1 లక్ష దాకా కలిసి వచ్చేది. దీనివల్ల కొనుగోలుదారులకు ఆ మేర పన్నులు తగ్గి చేతిలో కాస్త డబ్బు మిగిలేది. అయితే, ఈ సెక్షన్ 80ఈఈని ఆ తర్వాత కాలంలో మరి పొడిగించలేదు. దీంతో ఇపుడు సెక్షన్ 80సీ, సెక్షన్ 24 కింద మాత్రమే గృహ రుణాలపై పన్ను ప్రయోజనాలు పొందే వీలుంది.

సెక్షన్ 80సీ - అసలు, స్టాంప్ డ్యూటీ/రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులపై ..
ఎ) అసలు చెల్లింపుపై: గృహ రుణం రీపేమెంట్‌లో అసలు భాగానికి 80సీ సెక్షన్ వర్తిస్తుంది. దీనికింద ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల మేర మినహాయింపు పొందవచ్చు. ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. నిర్మాణం పూర్తయి, కంప్లీషన్ సర్టిఫికెట్ లభించాక మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే నిర్మాణ దశలో కట్టిన వడ్డీకి సంబంధించి ఆ తర్వాత వరుసగా ఐదేళ్ల పాటు 5 సమాన వాయిదాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే వీలుంది. మరో విషయం, ఇల్లు మీ అధీనంలోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్ల లోపే ప్రాపర్టీని విక్రయిస్తే అప్పటిదాకా తీసుకున్న పన్ను ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తుంది. ఆ వ్యవధిలో పొందిన పన్ను ప్రయోజనాలు ఆదాయం కిందికి వస్తాయి. దీనిపై పన్నులు కట్టాల్సి వస్తుంది.

బి) స్టాంపు డ్యూటీ/ రిజిస్ట్రేషన్ చార్జీలపై: ప్రాపర్టీని కొనేటప్పుడు చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల పరిమితికి లోబడి దీన్ని అనుమతిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టిన ఏడాదే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 24 - వడ్డీ చెల్లింపుపై ..
ఇంటి నిర్మాణం పూర్తయి, పొజెషన్ సర్టిఫికెట్‌కి ఆమోదముద్ర పడ్డాకే ఈ సెక్షన్ కింద వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులు పొందడానికి వీలవుతుంది. ఇంటి కొనుగోలే కాక నివాస గృహం నిర్మాణం, రిపేరు, రీకన్‌స్ట్రక్షన్‌కి తీసుకునే రుణాలపై వడ్డీకి కూడా ఈ సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఎవరికీ అద్దెకు ఇవ్వకుండా సొంతానికి ఉపయోగించుకుంటున్న ఇంటికైతే గరిష్టంగా రూ. 2 లక్షల దాకా డిడక్షన్ లభిస్తుంది. ఒకవేళ రుణం మంజూరైన తేదీ నుంచి మూడేళ్లలోగా గానీ ప్రాపర్టీ నిర్మాణం పూర్తి కాకపోతే.. వడ్డీ పరమైన ప్రయోజనాలు రూ.2 లక్షల నుంచి ఏకంగా రూ.30,000కు తగ్గిపోతాయి. ఇక, ప్రాపర్టీగానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాకపోతే .. ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి వడ్డీకి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement