సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలకు మహర్దశ
సాక్షిప్రతినిధి, గుంటూరు : సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 61 డివిజన్లు ఉన్న ఈ రెండు మున్సిపాలిటీల్లో ముందు ముందు మౌలిక వసతుల కల్పనతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
తొలి విడత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 77 కిలోమీటర్ల నిడివిలోని ప్రాంతాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. ఆ నిడివిలోని గ్రామాలను వివరిస్తూ జనవరి 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత ఈ రెండు మున్సిపాలిటీలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రాథమికంగా రూ.వెయ్యి కోట్ల నిధితో ఏర్పాటైన ఈ మండలి రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ, తదితర చర్యలు చేపట్టనుంది.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల మండలం మాదల. సత్తెనపల్లి మండలంలోని 17 గ్రామాలు తొలి విడతలోనే సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చాయి. సత్తెనపల్లి మున్సిపాలిటీని తొలి విడత మినహాయించారు.
పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలంలోని 16 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చి మున్సిపాలిటీని మినహాయించారు.
తాజాగా ఈ రెండు మున్సిపాలిటీలను సీఆర్‌డీఏ పరిధిలోకి తెస్తూ బుధ వారం ఉత్తర్వులు వెలువడ్డాయి.50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న పొన్నూరు మున్సిపాలిటీలో 59,859 మంది జనాభా ఉన్నారు. మొత్తం 31 వార్డులున్నాయి. 1964లో మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ 1967లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.తొలి మున్సిపల్ చైర్మన్‌గా కొప్పాక వెంకయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు 11 మంది చైర్మన్లుగా, ముగ్గురు ఇన్‌చార్జి చైర్మన్లుగా పనిచేశారు.
30 వసంతాలు పూర్తిచేసుకున్న సత్తెనపల్లి మున్సిపాలిటీలో 56,663 మంది జనాభా ఉన్నారు. 1984 మార్చి 2న సత్తెనపల్లిని మున్సిపాలిటీగా మా ర్చారు. మొత్తం 30 వార్డులు ఉన్నాయి.
ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను సీఆర్‌డీఏకు విడు దల చేసినా, క్రమంగా నిధుల విడుదల పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.