వామ్మో..దోమ | Vammodoma | Sakshi
Sakshi News home page

వామ్మో..దోమ

Published Wed, Oct 8 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

Vammodoma

సాక్షి, నెల్లూరు : అసలే పారిశుధ్యం అధ్వానం. దీనికి తోడు ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షపు నీరు తోడైంది. ఇంకేముంది నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నగరవాసులు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు ఇబ్బందులు పడుతున్నారు. దోమకాటుతో రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అయినా ఘనత వహించిన నెల్లూరు కార్పొరేషన్ వారు దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. లెక్కల్లో మాత్రం లక్షలు ఖర్చులు చూపిస్తూ నిధులు స్వాహా చేస్తున్నారన్న  ఆరోపణలున్నాయి. దోమల నివారణ కోసం ప్రజలు నగర పరిధిలో  ఏడాదిలో రూ.కోట్లు సొంతంగా వెచ్చించాల్సి వస్తోంది.

వర్షం రాకతో నెల్లూరు నగరంతో పాటు జిల్లాలో  పారిశుధ్యం అధ్వానంగా మారింది. కాలువలలో సక్రమంగా పూడిక తీయడంలేదు. దీంతో దోమలు పెరిగాయి.  నగర వాసులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో ఉంటున్న కుటుంబాలకు దోమలతో పడుతున్న బాధలు అధికం.  దోమల నివారణ ఖర్చు పక్కన పెడితే దోమ కాటుతో ప్రజలు రకరకాల జబ్బులకు గురికావాల్సి వస్తోంది. రోగాలను నయం చేసుకునేందుకు ఆస్పత్రి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. రాబోవు కాలంలో  దోమల బెడద మరింత పెరిగే అవకాశముంది.

నగరంలోని హరనాథపురం, బాలాజీనగర్, మన్సూర్‌నగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం, గాంధీగిరిజన కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మురుగు గుంటలు మరింతగా పెరిగాయి. చాలా చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఖాళీగా ఉండటంతో  లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా వాటిలో నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.

 దోమల నివారణ కోసం నెల్లూరు నగరంతో పాటు పట్టణాల్లో ఒక్కో కుటుంబం  పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇది పేద, మధ్యతరగతి వారికి మరింత భారంగా మారింది. నగరంలో 6లక్షల 50 వేల జనాభా ఉంది.  1.40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల కుటుంబాలున్నాయి. దోమల నివారణ కోసం ఆలౌట్ ,జెట్‌కాయిన్స్, క్రీములు, బ్యాట్‌లు, మెస్‌లు వాడాల్సి వస్తోంది. జిల్లా మొత్తం మీద దోమల నివారణకు * కోట్లలోనే ఖర్చు వస్తున్నట్టు సమాచారం. దోమల బారినపడి రోగాలు నయం చేసుకునేందుకు రూ.కోట్లలోనే ఖర్చు వస్తోంది.  

 దోమలవ్యాప్తి : మురుగుగుంటలే దోమలకు ఆవాసాలు. దోమల గుడ్లు లార్వాగా రూపాంతరం చెంది, ఆ తర్వాత దోమగా మారతాయి. ఒక దోమ 7 నుంచి 10 రోజులు బతుకుతుంది. 10 రోజుల్లో ఒక్కో దోమ లక్ష గుడ్లు పెడుతుంది. దోమల్లో అనాఫిలస్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాప్తి చెందుతుంది. క్యూలెక్స్ దోమవల్ల బోదకాలు, ఏజీటీసీ దోమవల్ల డెంగ్యూ లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాప్తి చెందుతాయి.
 అనారోగ్యంతో అల్లాడుతున్న ప్రజలు : దోమకాటుతో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ప్రైవేటు డాక్టర్లు, ఆర్‌ఎంపీలు చికున్‌గున్యా, స్వైన్‌ప్లూ, డెంగ్యూ అంటూ రోగులను భయభ్రాంతులకు గురిచేసి నానా పరీక్షల పేరుతో లక్షలాది రూపాయిలు గుంజుతున్నారు.

 నివారణ చర్యలు : దోమల నివారణకు మురుగుగుంటలు,కాలువల్లో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు చేరిన పక్షంలో మురుగు నీటిలో కిరోసిన్ పోయాలి. కిరోసిన్ పోయడం వల్ల లార్వాలకు ఆక్సిజన్ అందకుండా పోతుంది.  దోమల నివారణకు ఎబేట్ స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయాలి.
 పట్టించుకోని అధికారులు : వర్షాకాలం ప్రారంభం కావడంతో జిల్లా ఆరోగ్యశాఖ ముఖ్యంగా మలేరియా విభాగం దోమలు వ్యాప్తికాకుండా చూడాల్సి ఉంది.

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సబ్‌యూనిట్ అధికారి, క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం, జిల్లాస్థాయిలో జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ) దోమల నివారణ, తద్వారా మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరి పనితీరును జిల్లా వైద్యాధికారి పర్యవేక్షించాల్సి ఉంది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు ఆ దిశగా ఇప్పటికీ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. నెల్లూరు నగరంలో దోమల నివారణ చర్యలు అసలేలేవు. కనీసం ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా కానరావడంలేదు.  కలెక్టరైనా స్పందించి అధికారులను అప్రమత్తం చేసి దోమలను నివారించాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement