బొగతజలపాతం ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు
- అభివృద్ధి పనులకు రూ.12 కోట్లు మంజూరు
- అటవీ, టూరిజం శాఖాధికారుల పరిశీలన
- వివరాలు వెల్లడించిన టూరిజంశాఖ జనరల్ మేనేజర్ మనోహర్
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతానికి మహర్దశ పట్టనుంది. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు మండలం అటవీ ప్రాంతంలో ఉన్న బొగత అందాలను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్టాలకు చెందిన పర్యాటకులు నిత్యం వందలాదిగా తరలివస్తున్నారు. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం స్పందించింది. కాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బుధవారం టూరిజం, అటవీశాఖాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా బొగత జలపాతం అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరు చేసినట్లు టూరిజం శాఖ జనరల్ మేనేజర్ మనోహర్ వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలోని మేడారం, లక్నవరం, తాడ్వాయి, బొగత తదితర ప్రాంతాలను కలిపి ఆదివాసీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. వీటి అభివృద్ధి కోసం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ.84 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో బాగంగానే అటవీశాఖాధికారులతో కలిసి బొగత జలపాతాన్ని సందర్శించి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా బొగత జలపాతం బాగుందని, జలపాతానికి పై వైపున, క్రింద వైపున రెండు రెస్టారెంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. 80 గదులతో కాటేజీ నిర్మాణం చేస్తామని 20 ఏసీ గదులు, 60 నాన్ ఏసీ గదులుంటాయన్నారు. బొగత జలపాతం వరకూ రెండున్నర కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టూరిజం శాఖ ఎస్టేట్ మేనేజర్ సునంద, కరీంనగర్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరావు, వరంగల్ జిల్లా మేనేజర్ నాధన్, డిప్యూటీ ఇంజనీర్ సామ్యేల్, అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణ, భద్రాచలం డీఎఫ్‌ఓ శివాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.