యడ్లపాడు: నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో చారిత్రక కొండవీడుకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఆలోచనతో ప్రయత్నాలు చేస్తోంది. కొండవీడు ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటీవల కాలంలోనే కొండవీడు ఘాట్‌రోడ్డు పనులకు ప్రభుత్వం రూ. 35 కోట్ల నిధులను మంజూరు చేసింది. వీటితోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులను తీసుకువస్తే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చనే అలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని జూపార్కు మాదిరిగా ఇక్కడ నెలకొల్పాలని భావిస్తోంది. ఎకో, పోర్టు, మరో మూడు ప్రధాన దేవాలయాల అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
కొండవీడు అభివృద్ధికి ఆనాడే బీజం వేసిన వైఎస్...
కొండవీడు కోట ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపొందించాలంటూ అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. కొండవీడు ప్రాధాన్యతను నాడే గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొండపైకి ఘాట్‌రోడ్డు చేయాలని రూ. 5 కోట్లు నిధులను 2007 లో ఆర్‌అండ్‌బి శాఖకు విడుదల చేశారు.
ఆ తర్వాత ఏడుశాఖలకు చెందిన మంత్రులు వచ్చి కొండవీడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సీఎం రోశయ్య పలు శాఖల మంత్రులతో వచ్చి ఈ అభివృద్ధి పనుల్లో భాగమైన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్)ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటులో హంసా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కొత్తపాలెం నుంచి ఘాట్‌రోడ్డు వరకు అప్రొచ్‌రోడ్డు, ఘాట్‌రోడ్డు మూడు దశల సర్వే, ట్రాక్ రోడ్డు ఏర్పాటు, కేంద్ర అటవీ శాఖనుంచి రెండు దశల అనుమతి, ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కోట గ్రామంలో స్వాగత ద్వారం, కొండ మెట్లమార్గం వద్ద గెస్ట్‌హౌస్ నిర్మాణం చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం జరిగింది. తాజాగా పురాతన మసీదు పునరుద్ధరణ ప్రక్రియను పురావస్తు శాఖ చేపట్టింది.