రెండో రోజూ.. అదే జోరు | At the same pace for the second day .. | Sakshi
Sakshi News home page

రెండో రోజూ.. అదే జోరు

Published Fri, Sep 30 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

రెండో రోజూ.. అదే జోరు

రెండో రోజూ.. అదే జోరు

  • 38 అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • l దగ్గరుండి పర్యవేక్షించిన మేయర్, కమిషనర్‌
  • l అక్రమార్కులకు నోటీసులు
  • l బడాబాబులకు బెదరని జీడబ్ల్యూఎంసీ
  • సాక్షి, హన్మకొండ : నాలా కబ్జాదారులు, చెరువు శిఖం ఆక్రమణదారులపై గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం దాడులు రెండో రోజూ ముమ్మరంగా కొనసాగాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా నాలాలపై ఉన్న 38 అక్రమ నిర్మాణాలను జేసీబీ లతో కూల్చివేశారు. భారీ పక్కా భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ దగ్గరుండి కూల్చివేత పనులు పర్యవేక్షించారు. నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత అనివార్యమని, ఇది నగర ప్రజల శ్రేయస్సు కోసమేనని మేయర్‌ నరేందర్‌ తేల్చిచెప్పగా.. నాలాలు, చెరువులను ఆక్రమణలకు సంబంధించి ఎవ్వరికీ మినహాయింపులు ఉండవని కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు. అక్రమణ నిర్మాణాల కూల్చివేత పనులను ఈ ఇద్దరు దగ్గరుండి పర్యవేక్షించారు. బీమారంలోని శ్యామల చెరువు ఆక్రమణల తొలగింపును గురువారం మేయర్‌ నరేందర్‌ పరిశీలించారు. అనంతరం నయీంనగర్‌ పెద్దమోరి బ్రిడ్జి వద్ద చైతన్య డిగ్రీ కళాశాల దగ్గర కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత.. నాలా వెడల్పుకై మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. హంటర్‌రోడ్డులోని ఎన్‌టీఆర్‌ నగర్‌లో భద్రకాళి నాలాను ఆక్రమించి సుమారు రెండు ఎకరాల స్థలంలో నిర్మించిన కంకర్‌ రెడీమిక్స్‌ యూనిట్‌ ప్రహరీ గోడ కూల్చివేత పనులను కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా రెడీమిక్స్‌ యూనిట్‌ ప్రతినిధులు సంబంధిత స్థలాన్ని కొనుగోలు చేశామని, ప్రహరీ, మిక్సింగ్‌ యూనిట్‌లను తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేసినట్లు  కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ భద్రకాళి చెరువు ఫుల్‌ టాంక్‌ లెవల్‌ పరిధిలో రెడీమిక్స్‌ యూనిట్‌ నిర్మాణం జరిగిందని, దీనివల్ల వదర నీటి ప్రవాహం సరిగా లేక ఎన్‌టీఆర్‌ నగర్, పరిసర కాలనీలు నీటమునిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. రెడీమిక్స్‌ యూనిట్‌ కూల్చివేతకు 15 రోజుల గడువు ఇవ్వాలని యూనిట్‌ నిర్వాహకుల అభ్యర్థించారు.  రెండు రోజుల వ్యవధిలో యూనిట్‌లో విలువైన యంత్రాలు తరలించాలని, లేదంటే యంత్ర పరికరాలతో సహా అన్నింటిని నేలమట్టం చేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు. రెడీమిక్స్‌ యూనిట్‌ ఉన్న రెండు ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీని పూర్తిగా కూల్చివేయాలని ఏసీపీ రవికి ఆదేశాలు జారీ చేశారు.
    మెుత్తం 51 నిర్మాణాలు కూల్చివేత
     అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా రెండో రోజు 38 నిర్మాణాలను నేలమట్టం చేశారు. కూల్చివేతలకు సమాంతరంగా శిథిలాల తొలగింపు, నాలాల వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇందులో నయింనగర్‌ నాలా వెంబడి ఉన్న వాగ్దేవి, చైతన్య విద్యాసంస్థలకు చెందిన 32 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. గురువారం కూల్చివేసిన నిర్మాణాలో మరుగుదొడ్లు 17, పిల్లర్‌ పునాది 1, రేకులషెడ్డులు 7, స్లాబ్‌ షెడ్‌ 1, షెడ్డు 1, ప్రహరీ గోడలు 5 ఉన్నాయి. హంటర్‌రోడ్డు ఎన్టీఆర్‌ నగర్‌ దగ్గర రెండు ప్రహరీ నిర్మాణాలు, నాలుగు షెడ్డులను కూల్చివేశారు. రెండు రోజులలో మొత్తం 51 నిర్మాణాలను కూల్చివేశారు. అక్టోబరు 3 నుంచి మలివిడత కూల్చివేత కార్యక్రమం కొనసాగనుంది.
    ఎగువ భాగంలో సర్వే..
    వడ్డేపల్లి నాలాకు సంబం«ధించి నయీంనగర్‌ పెద్దమోరి బ్రిడ్జి ఎగువ భాగంలో ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు వెలిశాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. దీంతో  బ్రిడ్జి ఎగువభాగంలో నాలాను పరిశీలించిన కమిషనర్‌ సర్ఫరాజ్‌ నాలా వెడల్పునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదే నాలాపై చైతన్య డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల వద్ద జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని కమిషనర్‌ పరిశీలించారు. నాలాకు ఇరువైపులా ఉన్న భవనాలకు అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఏసీపీ శ్యాంకుమార్‌ను ఆదేశించారు. అనుమతులు లేనట్టయితే సర్వే చేసి నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. చైతన్య కళాశాలను ఆనుకొని ప్రవహిస్తున్న నాలా సరిహద్దులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని ఏసీపీ శైలజకు సూచించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం ఇచ్చినందున అధికారులు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదన్నారు. కబ్జాదారుల చెరలో ఉన్న నాలాలను విడిపించి ప్రవాహం సజావుగా చూడాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఉందన్నారు. అక్రమణల కూల్చివేత పరిశీలనలో కమిషనర్‌ వెంట సీపీ రాజేంద్రప్రసాద్‌ నాయక్‌ ఉన్నారు. 
    అక్రమ నిర్మాణాల అంతుతేలుస్తాం 
    గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో నాలాలు, చెరువులపై ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి గ్రేటర్‌ను ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆక్రమణల కూల్చివేత అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల అంతు తేల్చేదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. చారిత్రక వరంగల్‌ నగరానికి ముంపు భయం లేకుండా ఉండాలంటే  క్రమ నిర్మాణాలు తొలగించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి తారకరామారావులు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రజలు సహకరించాలని కోరారు.
     
     
    నాలాలు, చెరువులపై ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి గ్రేటర్‌ను ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. అక్రమ నిర్మాణాల అంతు తేల్చేదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.
    – నన్నపునేని నరేందర్, మేయర్‌
     
    అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం ఇచ్చినందున అధికారులు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. 
    – సర్ఫరాజ్‌ అహ్మద్, కమిషనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement