రూ.4 లక్షలకే డబుల్ బెడ్ రూం ఇల్లు
ఎంపీ మురళీమోహన్
గుణదల : రాజధానిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షలతోనే నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా), క్యాపిటల్ రీజియన్ బిల్డర్స్ అసోసియేషన్ (సీఆర్‌బీఏ) ప్రభుత్వానికి సహకరించనున్నట్లు రాజమండ్రి ఎంపీ, అప్రెడా చైర్మన్ మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని హోటల్ కృష్ణమార్గ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని సమస్యలను అదిగమిస్తున్న అప్రెడా, సీఆర్‌బీఏ సంస్థలు ఇకపై కలిసి ముందుకు సాగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
నూతనంగా నిర్మించే రాజధానిలో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పేద, మధ్య తరగతి, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఇళ్లను నిర్మించటానికి గృహ నిర్మాణ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. కృష్ణా జిల్లాలో భూముల ధరలను విపరీతంగా పెంచేశారని, ఈ పరిస్థితి హైదరాబాద్‌తో సహా రాష్ర్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించే దశగా సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో మెడికల్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. సమావేశంలో అప్రెడా అధ్యక్షుడు జి.హరిబాబు, సీఆర్‌బీఏ చైర్మన్ గద్దె రాజలింగ్, అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.