సర్కార్ దగా ! | CM Chandrababu Naidu Govt Neglances | Sakshi
Sakshi News home page

సర్కార్ దగా !

Published Sat, Mar 12 2016 1:21 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

సర్కార్ దగా ! - Sakshi

సర్కార్ దగా !

‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా.. మీరు ఏమీ చదువుకోపోయినా నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి’. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’..ఇదీ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు పలికిన చిలక పలుకులు. జాబు రావాలంటే బాబు రావాలి అంటూ ఎక్కడ చూసినా ప్రకటనలు.. టీవీల్లో ఒకటే హోరు.. గోడలపై రాతలు.. ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు.

ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.రెండు వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు బాబు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. రాష్ర్టంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పించారు. దీంతో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. ఉద్యోగం లేదు..కనీసం భృతి అయినా ఇస్తారేమోనని కుటుంబసభ్యులు ఆశపడ్డారు. ఆ ఆశని సర్కార్ వమ్ము చేసింది. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లా నిరుద్యోగులు తక్షణమే ఆయన గద్దె దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

* నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు భృతి అంటూ హామీ
* ఎన్నికల సమయంలో వాగ్దానం
* అసెంబ్లీ సాక్షిగా మాటమార్చిన మంత్రి
* పోరాటం తప్పదని హెచ్చరిక
* జిల్లాలో 1.50 లక్షల నిరుద్యోగులు
* మండిపడుతున్న నిరుద్యోగులు
* నిరుద్యోగ భృతిపై మోసపూరిత ప్రకటన


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిరుద్యోగ భృతిపై మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నయవంచనకు పాల్పడడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో లక్షన్నర మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు విడుదలవుతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలొస్తే బతుకులు బాగుపడుతాయని సుమారు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కనీసం భృతి కల్పిస్తే కొంతయినా ఆదుకున్నట్టు ఉంటుందని నిరుద్యోగుల తల్లిదండ్రులంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం సాక్ష్యాత్తూ జిల్లా మంత్రే నిరుద్యోగ భృతిపై మాట మార్చడంపై తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
 
ఇవిగో ఉదాహారణ
జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ కార్యాలయంలో ఉన్న గణాంకాలు చూస్తుంటే నివ్వెరపోక తప్పదు. ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజీలో సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య గత ఫిబ్రవరి నాటికి 51,946 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 9,200 మంది కాగా బీసీలు 36,738, మహిళలు 13,609మంది. 38 వేల మందికి పైగా పురుష నిరుద్యోగులున్నారు. మూడేళ్ల తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే వారి వివరాలు మరికనిపించవు. అలాంటివారు వేలల్లో ఉన్నారు.

పీజీ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలు ఇక్కడ లభ్యం కావు. విశాఖలోని ఏయూలో ఎంప్లాయీమెంట్ గెడైన్స్ బ్యూరోలో పొందుపర్చారు. ఇక్కడ కేవలం డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీఈడీ, డీఈడీ సహా ఇతర టెక్నికల్ అభ్యర్థుల వివరాలే నమోదయ్యాయి. 2014లో 13,252 మంది, 2015లో 9,011 మంది, 2016లో ఇప్పటివరకు 2048 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఏటికేడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని అధికారులే చెబుతున్నారు. ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో మరెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్కే లేదు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస పోతున్నవారి సంఖ్య ఏటా లక్షమంది అని సాక్ష్యాత్తూ జిల్లా యంత్రాంగమే ప్రకటించింది. ఉద్యోగం లేకపోవడంతో గుజరాత్  తీర ప్రాంతానికి బోట్లలో పనిచేసేందుకు ఎంతోమంది వెళ్లిపోతున్నారు.
 
పదోతరగతి తరువాత..
జిల్లాలో పదోతరగతి పూర్తిచేసి ఉపాధికల్పనాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్న వారి సంఖ్యే 13,323 మంది ఉన్నారు. ఇంటర్ 11,916, డిగ్రీ 7,361, స్టెనోగ్రాఫర్లు 341, టైపిస్టు 1474, బీఈడీ 2,722, డీఈడీ 678, అన్ని వర్గాల డిప్లమో పూర్తిచేసిన వాళ్లు 1679, ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్‌లు 1060, ఐటీఐ 5,713, ఎంఎల్‌జే తరహా 1145, అన్‌స్కిల్డ్ (పదోతరగతి లోపు) 4537 మంది అభ్యర్థులు తాము ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని, ఏదైనా అవకాశం వస్తే తెలియజేయాలని రిజిస్ట్రేషన్ ద్వారా విన్నవించుకున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా ఇటు ఉద్యోగమూ లేక, అటు నిరుద్యోగ భృతీ అందక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చడంపై ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
 
అవగాహనా లేదు
జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడే ఉపాధి కల్పన, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. రెండేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఆయన ఒక్క హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉండి పోరాడాల్సిన వ్యక్తే అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో తాము చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని పదేళ్ల నుంచీ రిజిస్టర్ చేయించుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరి గూర్చి ఆలోచించలేకపోయిన మంత్రి మోసపూరిత ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు.
 
బాబు గద్దె దిగాలి
నిరుద్యోగుల ఓట్లతో అధికారం తెచ్చుకున్న చంద్రబాబు తక్షణమే గద్దె దిగాలి. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేనివాళ్లకు నెలకు రూ.2వేల భృతి అంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలిచ్చి ఇప్పుడు ఆ పథకమే లేదంటారా? అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల ప్రకటించిన బడ్జెట్‌లో కూడా నిరుద్యోగులకు భరోసా కల్పించలేకపోయారు. జిల్లాలో లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.టీడీపీ సర్కార్ గద్దె దిగేవరకు పోరాటం చేస్తాం.
- తలసముద్రం సూర్యం, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు.
 
చంద్రబాబు దయతో రోడ్డునపడి తిరుగుతున్నాం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తాడని ఆశతో గెలిపిం చాం. ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. నేను డిగ్రీ పూర్తి చేసి ఏడేళ్లయింది అప్పటి నుంచి కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు ప్రిపేరవుతున్నా. కరెక్టుగా అన్ని విభాగాల్లోను సరైన శిక్షణ పొందానన్న సమయంలో చంద్రబాబు అధికారం చేపట్టడంతో ఉద్యోగాలు తీయక రోడ్డున పడి ఉపాధి కోసం తిరగాల్సి వస్తోంది.           
- ఎం.శ్రీనివాసరావు, నిరుద్యోగి, గుజరాతీపేట
 
నూతన పరిశ్రమల జాడే లేదు

రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు బూట కపు మాటలు చెబుతున్నారే తప్పా ఎక్కడా పరిశ్రమలు రాలేదు. దీంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. బీటెక్ పట్టాలు పెట్టెలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి ఉద్యోగాలు ఇవ్వడానికి చొరవ చూపిస్తే బాగుంటుంది.
- ఆర్.శివ, బిటెక్ విద్యార్థి, శ్రీకాకుళం.
 
బాబు వైఖరి తెలియనిది కాదు

చంద్రబాబు ద్వంద్వవైఖరి తెలియనిది కాదు.  తొమ్మిదేళ్లు పా లించి ప్రజలను హింసపెట్టా రు. ఇటీవల ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయానని, ప్రజా సంక్షేమమే ధ్యేయమని నమ్మబలి కారు. గద్దెనెక్కాక మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు.
 - కర్నేన గౌరినాయుడు, నిరుద్యోగి, రాజాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement