‘ఇంటికో ఉద్యోగం’ ఇస్తామని, లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 1.70 కోట్ల కుటుంబాలు ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంత వరకు ఒక్క కొత్త ఉద్యోగమూ రాలేదు. ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నాలుగేళ్లు గడచిపోయాయి. నెలకు రూ.2వేల చొప్పున 48 నెలల్లో ఒక్కో నిరుద్యోగికీ రూ.96వేలు బకాయి పడ్డారు. అయితే రుణమాఫీ లానే ఈ హామీనీ సవాలక్ష ఆంక్షలతో నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలిసింది. నిరుద్యోగ భృతిని అనేక ఆంక్షలతో అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా అటకెక్కించిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా నీరుగార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్లు ప్రచారం భారీస్థాయిలో జరుగుతున్నా వాస్తవానికి రైతు రుణమాఫీలానే దీనిని కూడా మమ అనిపించేయడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి అనేక ఆంక్షలను ప్రతిపాదిస్తూ మంత్రి వర్గ ఉపసంఘం ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొత్తగా ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయారు కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం భృతి ఇవ్వడానికి తగినంత బడ్జెట్ కేటాయించాలి. కానీ ఇప్పటి వరకూ ఏ బడెŠజ్‌ట్‌లోనూ ఈ నిధుల కేటాయింపు లేదు. గతేడాది బడ్జెట్‌లో నామ్‌కేవాస్తే లాగా రూ. 500 కోట్లు నిరుద్యోగ భృతికి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు.
మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిన ఆంక్షలివీ..
ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిరుద్యోగ యువతకు సాయం పేరుతో రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పూర్తిస్థాయిలో నిరుద్యోగ భృతి అందించేందుకు ఇది ఏమూలకూ చాలదు. దీంతో విధివిధానాల పేరుతో నిరుద్యోగుల సంఖ్యను వీలైనంత మేరకు కుదించేందుకు కసరత్తు చేస్తోంది. నిరుద్యోగ భృతికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సవాలక్ష షరతులు ప్రతిపాదించింది. అందులో కొన్ని ఇలా ఉన్నాయి....
– నిరుద్యోగ భృతికి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపువారే అర్హులు.
– పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివినవారు భృతికి అనర్హులు. డిగ్రీ చదివిన వారికే భృతిని వర్తింపచేయాలని నిర్ణయం
– ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు భృతి వర్తింపచేయరాదని, శిక్షణ మాత్రమే ఇవ్వాలని నిర్ణయం.
– భృతి పొందాలంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడీ తప్పనిసరి. స్థానికుడై ఉండాలనే నిబంధన
– నాలుగు చక్రాల వాహనముంటే అనర్హులు
– 2.50 ఎకరాల్లోపు మాగాణి, 5 ఎకరాల్లోపు మెట్ట విస్తీర్ణం కలిగిన దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుద్యోగులు మాత్రమే భృతికి అర్హులు
– దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో ఒక్కో కుటుంబంలో ఒక్కరికే నిరుద్యోగ భృతి
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల కింద స్వయం ఉపాధికోసం ఆర్థిక సాయం లేదా రుణం పొందిన వారు భృతికి అనర్హులు.
– పబ్లిక్, ప్రైవేట్ రంగాలు, క్వాసీ గవర్నమెంట్ లేదా స్వయం ఉపాధి రంగాల్లో పనిచేస్తున్నవారూ భృతికి అనర్హులే.
– ప్రభుత్వ సర్వీసు నుంచి డిస్మిస్ అయినవారు, అలాగే క్రిమినల్ కేసుల్లో శిక్షపడినవారు కూడా అనర్హులు
పోర్టల్ నిర్వహించే బాధ్యత ప్రయివేటు ఏజెన్సీకి...
నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ తరహాలో పోర్టల్‌ను నిర్వహించే బాధ్యతను ఓ ప్రయివేటు ఏజెన్సీకి అప్పగిస్తారు. భృతికోసం అభ్యర్థులు ఆ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానికత, విద్యార్హతలు, వయసు, కుటుంబం వార్షిక ఆదాయంతో కూడిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను కార్మిక ఇఎస్‌ఐ, ఈపీఎఫ్ డేటాతో తనిఖీలు నిర్వహిస్తారు. దరఖాస్తుదారు నైపుణ్య శిక్షణకు వెళ్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలి. ఆ మేరకు రెగ్యులర్‌గా నైపుణ్య శిక్షణకు వెళ్లాలి. అలా వెళ్లనివారికి భృతిని నిలిపేస్తారు. అలాగే భృతికోసం దరఖాస్తు చేసుకునేవారు సామాజికంగా స్వచ్ఛ భారత్, వనం–మనం, మైనర్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ రంగాల్లో పనిచేస్తామని స్పష్టం చేయాలి. రాష్ట్ర స్థాయిలో సీఎం అధ్యక్షతన గల కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అయితే ఇవన్నీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment