Ministerial subcommittee
-
ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాం
సాక్షి, అమరావతి : ఉద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, మరో ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆందోళనను విరమించుకోవాలని కోరగా.. వారు అంగీకరించారని తెలిపారు. ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీని ప్రకటిస్తామన్నారు. మధ్యంతరం భృతి (ఐఆర్) ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ఇస్తారని, ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కోవిడ్ ప్రభావంతో పీఆర్సీ ఆలస్యమైందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మార్చిలోపు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌పై వచ్చి న అభ్యర్థనను సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పీఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్, డీఏ, జీపీఎఫ్, ఎస్ఎల్ఎస్ బిల్లుల చెల్లింపు వంటి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సర్విసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అలాగే, సెర్ప్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగ సలహాదారులు ఎన్.చంద్రశేఖరరెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఫైనాన్స్ మినిస్టర్ సమావేశపు హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగుల క్రమబద్దికరణకు సంబంధించిన క్యాడర్ ఫిక్సేషన్, పేపిక్సేషన్ అంశాన్ని చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గౌరవ స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అడిషనల్ సీఈవో విజయకుమారి, అడ్మిన్ డైరెక్టర్ సుశీల, సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు టి.ధనంజయరెడ్డి, కె.నాగరాజు, జె.శోభన్‌బాబు ఎంఎస్ మూర్తి, అబ్దుల్ రెహమాన్, ఆదయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ఇళ్ల పట్టాలు.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మళ్లీ వేగంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లను నిర్మించే పథకాన్ని కూడా వేగంగా అమలు చేయాలని, సొంత జాగాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, జాగా లేని వారికి ప్రభుత్వపరంగా స్థలాలు కేటాయించాలని కూడా నిర్ణయించింది. ఇళ్ల స్థలాల పంపిణీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం సమావేశమయ్యింది. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాసగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2014లో ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కింద 1.25 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్.. జీఓ నం. 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇంటి స్థలాల పట్టాల పంపిణీని ఇక నుంచి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించారు. పట్టణాల్లో 60 గజాలు, గ్రామాల్లో 120 గజాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. పేదల అనుకూల విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. ప్రభుత్వం తాజా బడ్జెట్లో 4 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.12 వేల కోట్ల మొత్తాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో సొంత జాగాలు ఉన్నవారికి ఇంటికి రూ.3 లక్షలు చొప్పున మంజూరు చేసి వారే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టుకునేలా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే సొంత జాగాలు లేనివారి సంఖ్య భారీగా ఉన్నందున, వారి నుంచి కూడా ఒత్తిడి వస్తోందంటూ ఇటీవల ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఇప్పుడు వారికి పట్టాలు మంజూరు చేయటం ద్వారా స్థలానికి వీలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నోటరీ పత్రాల గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల పరిష్కారానికి సమయానుకూల కార్యాచరణను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు అనుకూలమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అర్హత ఉన్న వారి కేసుల సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జీఓ నం.58, 59 అంశాలతోపాటు సాదా బైనామాలు, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రూ.850 కోట్ల బకాయిలపై దృష్టి నిధులను వేగంగా సమీకరించుకునే క్రమంలో మంత్రివర్గ ఉపసంఘం హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డుకు పెద్ద మొత్తంలో భూముల నిధి ఉంది. కానీ అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో వాటి విక్రయాలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గతంలో వివిధ ప్రాజెక్టులు, వెంచర్ల కోసం కేటాయించిన భూములకు సంబంధించి ఆయా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి చెల్లించకుండా బకాయిపడ్డ రూ.850 కోట్లను వేగంగా వసూలు చేయటంపై దృష్టి సారించింది. ఏయే సంస్థ ఎన్ని నిధులు చెల్లించాల్సి ఉందో వివరాలను ఆరా తీసి వాటిపై చర్చించింది. బకాయిలు ఇంతకాలం చెల్లించనందుకు పేరుకుపోయిన వడ్డీ వివరాలు తెలుసుకుని, వీలైనంత త్వరగా వాటిని వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వాటికి సంబంధించి ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ చూపి బకాయిదారులకు నోటీసులు జారీ చేసి ఆ మొత్తాలను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించింది. చిన్న చిన్న బిట్లు వేలం వేయండి గతంలో అమ్మగా మిగిలిన చిన్నచిన్న భూముల బిట్లను సమీకరించి వేలం పాటలో ఉంచి విక్రయించాలని మంత్రులు ఆదేశించారు. ఇక స్వగృహ కార్పొరేషన్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఉన్నవి ఉన్నట్టుగా వేలం వేసేందుకు వీలుగా హెచ్ఎండీఏతో కలిసి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పనులు జరపకుండా ఖాళీగా ఉంచిన భూములను కూడా అమ్మే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. త్వరలో వీటికి సంబంధించిన ప్రణాళికను అందజేయాల్సిందిగా సూచించారు. -
అవినీతి నిగ్గు తేల్చండి
వ్యవస్థను బాగు చెయ్యాలన్న నా ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలి. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెబుతున్నా. అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లుగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకున్న తీరుపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి సాగించిన దోపిడీని బట్టబయలు చేయాలని సంకల్పించింది. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, కమీషన్లే లక్ష్యంగా పని చేసి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిన వైనాన్ని ఎత్తిచూపాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 30 అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేస్తుందని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్, సీఐడీ విభాగాల్లోని సీనియర్ అధికారుల బృందం విచారణకు సహకారం అందజేస్తుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యుత్ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత టీడీపీ సర్కారు పాల్పడిన అక్రమాలపై సమగ్రంగా విచారణ చేసి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఐదుగురు సభ్యుల మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి.. భారీఎత్తున దోచేసిన తీరును ప్రజల ముందు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి పారదర్శక పరిపాలన అందించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతిని వెలికి తీయడం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు ఉప సంఘం వేయాల్సి వచ్చిందంటే..: అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విభజన గాయాలతో ఛిద్రమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన టీడీపీ సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. జూన్ 2, 2014 నుంచి మే 29, 2019 వరకు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. అక్రమార్జన కోసం అనుకూలమైన విధానాలను రూపొందించింది. వాటిని అడ్డం పెట్టుకుని ఇసుక నుంచి గనుల వరకూ సహజ సంపదను కొల్లగొట్టింది. టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి పేదల భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ, దేవదాయ భూములను హస్తగతం చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. టీడీపీ నేతల దోపిడీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమించింది. టీడీపీ సర్కారు అసంబద్ధ విధానాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, యువకులు, బలహీన వర్గాలు, మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల చిన్న, మధ్య తరగతి రైతులు భూములు కోల్పోయారు. భూ కబ్జాల వల్ల ప్రజలు వారి సొంత ఇళ్లను, గ్రామాలను కోల్పోయి నిర్వాసితులగా మారారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేసి దోపిడీ చేయడం వల్ల రాష్ట్రంలో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలిగింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ఈ దోపిడీ సాగింది. ఈ నేపథ్యంలో చెడిపోయిన వ్యవస్థను బాగు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అవినీతి రహిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అవినీతికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులతో పాటు సంస్థలను గుర్తించి, ఆ నిర్ణయాల వెనుక ఉన్న దురుద్దేశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనలను చేస్తుంది. మంత్రివర్గ ఉప సంఘం స్వరూపం.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ఈ ఉప సంఘం నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇవీ మార్గదర్శకాలు - గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన భారీ నిర్ణయాలు, కార్యక్రమాలు, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడంపై విచారణ. - రాష్ట్రంలో టెండర్ల విధానం, ఆ విధానంలో టీడీపీ సర్కారు చేసిన సవరణలు, కాంట్రాక్టర్లకు అప్పగించిన భారీ ప్రాజెక్టుల పనులు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు, స్విస్ ఛాలెంజ్ విధానం, సహజ వనరుల కేటాయింపు (ప్రధానంగా భూములు, నీళ్లు, గనులు, విద్యుత్)లో నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి దోచుకున్న తీరుపై సమీక్ష. - బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రజాభ్యుదయం ముసుగులో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ సంస్థలపై చూపిన దుష్ప్రభావంపై సమీక్ష - గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్స్, లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ), స్పెషల్ పర్పస్ వెహికల్స్, జాయింట్ వెంచర్స్‌లో అవినీతికి పాల్పడటం, ఆశ్రిత పక్షపాతం చూపడంపై విచారణ. - వివిధ కార్పొరేషన్లు, పరిశ్రమలు, అథారిటీలు, సొసైటీల పనీతీరుపై సమీక్ష. వాటిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలి. - గత ప్రభుత్వం భారీఎత్తున కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయడంపై సమగ్రంగా విచారణ. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన తీరుపై సమీక్ష - ప్రభుత్వ భూముల కేటాయింపుపై సమగ్ర విచారణ. భూముల కేటాయింపులో క్విడ్‌ప్రోకోకు పాల్పడిన వ్యవహారాలపై ప్రత్యేకంగా సమీక్ష - గత ప్రభుత్వం మైనింగ్ లీజులు మంజూరు చేయడంపై సమగ్ర విచారణ. అక్రమంగా మైనింగ్ లీజులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చేకూరిన నష్టంపై నివేదిక. - విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నిబంధనలను ఉల్లంఘించడం, అక్రమాలకు పాల్పడి కమీషన్లు తీసుకోవడంపై విచారణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సొసైటీల్లో అక్రమాలకు పాల్పడిన తీరుపైన దర్యాప్తు. - వైద్య, విద్య, పౌష్టికాహార కార్యక్రమాల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ. - ఐటీ రంగంపై సమగ్రంగా సమీక్ష. - సీఆర్డీఏ, పోలవరం ప్రాజెక్టు, పోర్టులు, విమానాశ్రయాలు, హైవే ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ పెద్దలు పాల్పడిన అక్రమాలపై సమగ్ర సమీక్ష. సీఆర్డీఏ పరిధిలో భూముల కేటాయింపు, ఇన్సైడర్ ట్రేడింగ్ విధానంలో భూముల కొనుగోలు ద్వారా అక్రమంగా లబ్దిపొందడంపై విచారణ. - ఈ అక్రమాల్లో రాజకీయ నేతలు, కీలక అధికారుల పాత్రపై విచారణ. -
షరతులతో ‘మమ’
‘ఇంటికో ఉద్యోగం’ ఇస్తామని, లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 1.70 కోట్ల కుటుంబాలు ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంత వరకు ఒక్క కొత్త ఉద్యోగమూ రాలేదు. ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నాలుగేళ్లు గడచిపోయాయి. నెలకు రూ.2వేల చొప్పున 48 నెలల్లో ఒక్కో నిరుద్యోగికీ రూ.96వేలు బకాయి పడ్డారు. అయితే రుణమాఫీ లానే ఈ హామీనీ సవాలక్ష ఆంక్షలతో నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలిసింది. నిరుద్యోగ భృతిని అనేక ఆంక్షలతో అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా అటకెక్కించిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా నీరుగార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్లు ప్రచారం భారీస్థాయిలో జరుగుతున్నా వాస్తవానికి రైతు రుణమాఫీలానే దీనిని కూడా మమ అనిపించేయడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి అనేక ఆంక్షలను ప్రతిపాదిస్తూ మంత్రి వర్గ ఉపసంఘం ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొత్తగా ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయారు కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం భృతి ఇవ్వడానికి తగినంత బడ్జెట్ కేటాయించాలి. కానీ ఇప్పటి వరకూ ఏ బడెŠజ్ట్లోనూ ఈ నిధుల కేటాయింపు లేదు. గతేడాది బడ్జెట్లో నామ్కేవాస్తే లాగా రూ. 500 కోట్లు నిరుద్యోగ భృతికి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిన ఆంక్షలివీ.. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగ యువతకు సాయం పేరుతో రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పూర్తిస్థాయిలో నిరుద్యోగ భృతి అందించేందుకు ఇది ఏమూలకూ చాలదు. దీంతో విధివిధానాల పేరుతో నిరుద్యోగుల సంఖ్యను వీలైనంత మేరకు కుదించేందుకు కసరత్తు చేస్తోంది. నిరుద్యోగ భృతికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సవాలక్ష షరతులు ప్రతిపాదించింది. అందులో కొన్ని ఇలా ఉన్నాయి.... – నిరుద్యోగ భృతికి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపువారే అర్హులు. – పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివినవారు భృతికి అనర్హులు. డిగ్రీ చదివిన వారికే భృతిని వర్తింపచేయాలని నిర్ణయం – ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు భృతి వర్తింపచేయరాదని, శిక్షణ మాత్రమే ఇవ్వాలని నిర్ణయం. – భృతి పొందాలంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడీ తప్పనిసరి. స్థానికుడై ఉండాలనే నిబంధన – నాలుగు చక్రాల వాహనముంటే అనర్హులు – 2.50 ఎకరాల్లోపు మాగాణి, 5 ఎకరాల్లోపు మెట్ట విస్తీర్ణం కలిగిన దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుద్యోగులు మాత్రమే భృతికి అర్హులు – దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో ఒక్కో కుటుంబంలో ఒక్కరికే నిరుద్యోగ భృతి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల కింద స్వయం ఉపాధికోసం ఆర్థిక సాయం లేదా రుణం పొందిన వారు భృతికి అనర్హులు. – పబ్లిక్, ప్రైవేట్ రంగాలు, క్వాసీ గవర్నమెంట్ లేదా స్వయం ఉపాధి రంగాల్లో పనిచేస్తున్నవారూ భృతికి అనర్హులే. – ప్రభుత్వ సర్వీసు నుంచి డిస్మిస్ అయినవారు, అలాగే క్రిమినల్ కేసుల్లో శిక్షపడినవారు కూడా అనర్హులు పోర్టల్ నిర్వహించే బాధ్యత ప్రయివేటు ఏజెన్సీకి... నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ తరహాలో పోర్టల్‌ను నిర్వహించే బాధ్యతను ఓ ప్రయివేటు ఏజెన్సీకి అప్పగిస్తారు. భృతికోసం అభ్యర్థులు ఆ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానికత, విద్యార్హతలు, వయసు, కుటుంబం వార్షిక ఆదాయంతో కూడిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. వ్యక్తిగతంగా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను కార్మిక ఇఎస్ఐ, ఈపీఎఫ్ డేటాతో తనిఖీలు నిర్వహిస్తారు. దరఖాస్తుదారు నైపుణ్య శిక్షణకు వెళ్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలి. ఆ మేరకు రెగ్యులర్‌గా నైపుణ్య శిక్షణకు వెళ్లాలి. అలా వెళ్లనివారికి భృతిని నిలిపేస్తారు. అలాగే భృతికోసం దరఖాస్తు చేసుకునేవారు సామాజికంగా స్వచ్ఛ భారత్, వనం–మనం, మైనర్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ రంగాల్లో పనిచేస్తామని స్పష్టం చేయాలి. రాష్ట్ర స్థాయిలో సీఎం అధ్యక్షతన గల కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అయితే ఇవన్నీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. -
నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమానికి విధివిధానాలు రూపొందించేందుకుగాను సలహాలుస్వీకరించేందుకు మత్స్య సహకార సొసైటీలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం జరుగుతుంది.