అవినీతి నిగ్గు తేల్చండి | Ministerial Subcommittee On TDP Govt Corruption | Sakshi
Sakshi News home page

అవినీతి నిగ్గు తేల్చండి

Published Thu, Jun 27 2019 4:22 AM | Last Updated on Thu, Jun 27 2019 8:14 AM

Ministerial Subcommittee On TDP Govt Corruption - Sakshi

వ్యవస్థను బాగు చెయ్యాలన్న నా ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలి. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెబుతున్నా.  అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లుగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకున్న తీరుపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి సాగించిన దోపిడీని బట్టబయలు చేయాలని సంకల్పించింది. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, కమీషన్లే లక్ష్యంగా పని చేసి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిన వైనాన్ని ఎత్తిచూపాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 30 అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేస్తుందని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్, సీఐడీ విభాగాల్లోని సీనియర్‌ అధికారుల బృందం విచారణకు సహకారం అందజేస్తుందన్నారు.

బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యుత్‌ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత టీడీపీ సర్కారు పాల్పడిన అక్రమాలపై సమగ్రంగా విచారణ చేసి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఐదుగురు సభ్యుల మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి.. భారీఎత్తున దోచేసిన తీరును ప్రజల ముందు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి పారదర్శక పరిపాలన అందించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతిని వెలికి తీయడం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.  

ఎందుకు ఉప సంఘం వేయాల్సి వచ్చిందంటే..: అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విభజన గాయాలతో ఛిద్రమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన టీడీపీ సర్కార్‌ తద్భిన్నంగా వ్యవహరించింది. జూన్‌ 2, 2014 నుంచి మే 29, 2019 వరకు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. అక్రమార్జన కోసం అనుకూలమైన విధానాలను రూపొందించింది. వాటిని అడ్డం పెట్టుకుని ఇసుక నుంచి గనుల వరకూ సహజ సంపదను కొల్లగొట్టింది. టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి పేదల భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ, దేవదాయ భూములను హస్తగతం చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. టీడీపీ నేతల దోపిడీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమించింది. టీడీపీ సర్కారు అసంబద్ధ విధానాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, యువకులు, బలహీన వర్గాలు, మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల చిన్న, మధ్య తరగతి రైతులు భూములు కోల్పోయారు. భూ కబ్జాల వల్ల ప్రజలు వారి సొంత ఇళ్లను, గ్రామాలను కోల్పోయి నిర్వాసితులగా మారారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేసి దోపిడీ చేయడం వల్ల రాష్ట్రంలో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలిగింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ఈ దోపిడీ సాగింది. ఈ నేపథ్యంలో చెడిపోయిన వ్యవస్థను బాగు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అవినీతి రహిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అవినీతికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులతో పాటు సంస్థలను గుర్తించి, ఆ నిర్ణయాల వెనుక ఉన్న దురుద్దేశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనలను చేస్తుంది.  

మంత్రివర్గ ఉప సంఘం స్వరూపం.. 
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ఈ ఉప సంఘం నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ఇవీ మార్గదర్శకాలు
- గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన భారీ నిర్ణయాలు, కార్యక్రమాలు, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడంపై విచారణ. 
రాష్ట్రంలో టెండర్ల విధానం, ఆ విధానంలో టీడీపీ సర్కారు చేసిన సవరణలు, కాంట్రాక్టర్లకు అప్పగించిన భారీ ప్రాజెక్టుల పనులు, ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులు, స్విస్‌ ఛాలెంజ్‌ విధానం, సహజ వనరుల కేటాయింపు (ప్రధానంగా భూములు, నీళ్లు, గనులు, విద్యుత్‌)లో నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి దోచుకున్న తీరుపై సమీక్ష. 
బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రజాభ్యుదయం ముసుగులో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ సంస్థలపై చూపిన దుష్ప్రభావంపై సమీక్ష 
గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్స్, లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ), స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్, జాయింట్‌ వెంచర్స్‌లో అవినీతికి పాల్పడటం, ఆశ్రిత పక్షపాతం చూపడంపై విచారణ. 
వివిధ కార్పొరేషన్లు, పరిశ్రమలు, అథారిటీలు, సొసైటీల పనీతీరుపై సమీక్ష. వాటిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలి. 
గత ప్రభుత్వం భారీఎత్తున కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయడంపై సమగ్రంగా విచారణ. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన తీరుపై సమీక్ష 
ప్రభుత్వ భూముల కేటాయింపుపై సమగ్ర విచారణ. భూముల కేటాయింపులో క్విడ్‌ప్రోకోకు పాల్పడిన వ్యవహారాలపై ప్రత్యేకంగా సమీక్ష 
గత ప్రభుత్వం మైనింగ్‌ లీజులు మంజూరు చేయడంపై సమగ్ర విచారణ. అక్రమంగా మైనింగ్‌ లీజులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చేకూరిన నష్టంపై నివేదిక.  
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో నిబంధనలను ఉల్లంఘించడం, అక్రమాలకు పాల్పడి కమీషన్లు తీసుకోవడంపై విచారణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సొసైటీల్లో అక్రమాలకు పాల్పడిన తీరుపైన దర్యాప్తు. 
వైద్య, విద్య, పౌష్టికాహార కార్యక్రమాల్లో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ. 
ఐటీ రంగంపై సమగ్రంగా సమీక్ష.  
సీఆర్‌డీఏ, పోలవరం ప్రాజెక్టు, పోర్టులు, విమానాశ్రయాలు, హైవే ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ పెద్దలు పాల్పడిన అక్రమాలపై సమగ్ర సమీక్ష. సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విధానంలో భూముల కొనుగోలు ద్వారా అక్రమంగా లబ్దిపొందడంపై విచారణ. 
ఈ అక్రమాల్లో రాజకీయ నేతలు, కీలక అధికారుల పాత్రపై విచారణ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement