ఉపసంఘం సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్, సబిత, హరీశ్, తలసాని, ఎర్రబెల్లి, పువ్వాడ తదితరులు
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మళ్లీ వేగంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లను నిర్మించే పథకాన్ని కూడా వేగంగా అమలు చేయాలని, సొంత జాగాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, జాగా లేని వారికి ప్రభుత్వపరంగా స్థలాలు కేటాయించాలని కూడా నిర్ణయించింది. ఇళ్ల స్థలాల పంపిణీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం సమావేశమయ్యింది.
మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాసగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
2014లో ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కింద 1.25 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్.. జీఓ నం. 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇంటి స్థలాల పట్టాల పంపిణీని ఇక నుంచి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించారు. పట్టణాల్లో 60 గజాలు, గ్రామాల్లో 120 గజాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.
పేదల అనుకూల విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి..
ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో 4 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.12 వేల కోట్ల మొత్తాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో సొంత జాగాలు ఉన్నవారికి ఇంటికి రూ.3 లక్షలు చొప్పున మంజూరు చేసి వారే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టుకునేలా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే సొంత జాగాలు లేనివారి సంఖ్య భారీగా ఉన్నందున, వారి నుంచి కూడా ఒత్తిడి వస్తోందంటూ ఇటీవల ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఇప్పుడు వారికి పట్టాలు మంజూరు చేయటం ద్వారా స్థలానికి వీలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక నోటరీ పత్రాల గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల పరిష్కారానికి సమయానుకూల కార్యాచరణను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు అనుకూలమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అర్హత ఉన్న వారి కేసుల సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జీఓ నం.58, 59 అంశాలతోపాటు సాదా బైనామాలు, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
రూ.850 కోట్ల బకాయిలపై దృష్టి
నిధులను వేగంగా సమీకరించుకునే క్రమంలో మంత్రివర్గ ఉపసంఘం హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డుకు పెద్ద మొత్తంలో భూముల నిధి ఉంది. కానీ అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉండటంతో వాటి విక్రయాలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో గతంలో వివిధ ప్రాజెక్టులు, వెంచర్ల కోసం కేటాయించిన భూములకు సంబంధించి ఆయా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి చెల్లించకుండా బకాయిపడ్డ రూ.850 కోట్లను వేగంగా వసూలు చేయటంపై దృష్టి సారించింది. ఏయే సంస్థ ఎన్ని నిధులు చెల్లించాల్సి ఉందో వివరాలను ఆరా తీసి వాటిపై చర్చించింది.
బకాయిలు ఇంతకాలం చెల్లించనందుకు పేరుకుపోయిన వడ్డీ వివరాలు తెలుసుకుని, వీలైనంత త్వరగా వాటిని వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వాటికి సంబంధించి ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ చూపి బకాయిదారులకు నోటీసులు జారీ చేసి ఆ మొత్తాలను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించింది.
చిన్న చిన్న బిట్లు వేలం వేయండి
గతంలో అమ్మగా మిగిలిన చిన్నచిన్న భూముల బిట్లను సమీకరించి వేలం పాటలో ఉంచి విక్రయించాలని మంత్రులు ఆదేశించారు. ఇక స్వగృహ కార్పొరేషన్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఉన్నవి ఉన్నట్టుగా వేలం వేసేందుకు వీలుగా హెచ్‌ఎండీఏతో కలిసి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పనులు జరపకుండా ఖాళీగా ఉంచిన భూములను కూడా అమ్మే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. త్వరలో వీటికి సంబంధించిన ప్రణాళికను అందజేయాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment