పోయాం... మోసం...
* నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారుపై మండిపాటు
* నమ్మి నిలువునా మోసపోయామంటున్న యువత
* ఉపాధి లేదు సరికదా... భృతికూడా లేదనడం దారుణం...
ఉద్యోగం రాకున్నా... భృతిపై ఆశపడ్డా...
బాడంగికి చెందిన ఈమె పేరు అనకాపల్లి ఇందిర. గుంటూరులో ఈమె బీపీఈడీని 2015లో పూర్తి చేశారు. దురదృష్టం పీఈటీల నియామకాన్ని ఈ సర్కారు నిలిపేసింది. ఇక చేసేది లేక కానిస్టేబుల్ ఉద్యోగంకోసం యత్నిస్తున్నారు.
ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ నిజమే అనుకున్నారు. అసలు విషయం తెలుసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ ఉద్యోగం రాకపోయినా కనీసం నెలకు 2వేలు భృతి వస్తుందని నమ్మాననీ, దానితోనైనా ఏవైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని భావించాననీ... ఇప్పటికీ ప్రతీదానికీ తల్లితండ్రులపైనే అధారపడాల్సి వస్తోందనీ వాపోయారు.
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా... మీరు ఏమీ చదువుకోక పోయినా... నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి కావాలంటే బాబు రావాలి.’
- ఎన్నికల్లో వాడవాడలా టీడీపీ నేతలు చేసిన ప్రచారం.
‘నిరుద్యోగ భృతి పథకమే లేదు... మరి అలాంటపుడు ఎంత భృతి చెల్లించామన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.’
- నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ.
పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రకటనలూ జిల్లాలో కలకలం సృష్టించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ... నెరవేర్చకపోగా... అలాంటిదేమీ లేదని మంత్రి చెప్పడాన్ని అంతా తప్పుపడుతున్నారు. నిలువునా మోసపోయామని వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సర్కారు మోసం మరోసారి బట్టబయలైంది. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిన వైనం తేటతెల్లమైపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ... నిరుద్యోగ భృతి కల్పిస్తామని చేసిన వాగ్దానాలు నమ్మిన జిల్లాలోని 5లక్షల85వేల కుటుంబాలు, 3లక్షల మంది నిరుద్యోగులు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. కొత్త ఉద్యోగాలిస్తానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఆవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగుల్ని ఊడపీకారు. రైతులకు ఎంతో సేవలందించిన ఆదర్శరైతులను అర్ధంతరంగా తొలగించారు.
ఉపాధి వేతనదారులకు పని చూపించిన క్షేత్ర సహాయకులను అకారణంగా తీసేశారు. ఇంజినీర్లతో కలిసి పనిచేసిన వర్క్ ఇన్‌స్పెక్టర్లను రోడ్డున పడేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనైతే ఉన్నపళంగా ఆపేశారు. వారంతా ఇప్పుడు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారి దయనీయంగా బతుకుతున్నారు.
నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారు
ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించారు. ఒక్కొక్కరికీ రూ. 2వేలు చొప్పున నెలకు భృతి అందిస్తామని ఆశ చూపారు. ప్రజలను భ్రమల్లోకి తీసుకెళ్లి ఓట్లేయించుకున్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా పీఠమెక్కాక ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఇదేమంటే అసలు ఆ పథకమే లేదని మంత్రి అడ్డంగా బొంకేశారు. ప్రస్తుతం జిల్లాలో 5లక్షల 85వేల కుటుంబాలు ఉండగా అందులో 2లక్షల మంది వరకు నిరుద్యోగులున్నారు. వారంతా ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నారు.
రోడ్డున పడ్డ 55వేల మంది కార్మికులు
కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులకూ భరోసానివ్వడంలేదు. ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10జూట్‌మిల్లులు ఇప్పటికే మూతపడటంతో 20వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పిల్లల్ని పోషించలేక, చదివించుకోలేక కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఆందోళనకు గురై హఠాన్మరణం చెందుతున్నారు.
ఇక, ఫెర్రో పరిశ్రమలు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 12పరిశ్రమలు మూతపడ్డాయి. 25వేల మంది పనిలేక అలమటిస్తున్నారు. చిన్న చితకా పరిశ్రమలు మరో 20వరకు మూతపడ్డాయి. వీటిలో పనిచేసిన 10వేల మంది పనిలేక అవస్థలు పడుతున్నారు.దయనీయంగా బతుకుతున్నారు.
మోసపోయిన నిరుద్యోగులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తారన్న ఆశతో గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారు గణనీయంగా పెరిగారు. దాదాపు 54వేల మంది జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఉన్నారు. కొత్త రిక్రూట్‌మెంట్ల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఒక్క ఉద్యోగం తీయలేదు. నిరుద్యోగ భృతికి సంబంధించి కనీసం మాట్లాటలేదు. ఎందుకింత మోసమని నిరుద్యోగులంతా మండిపడు తున్నారు.