ఉద్యోగులు ఔట్ | Employees Out | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు ఔట్

Published Sat, Dec 27 2014 1:46 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

ఉద్యోగులు ఔట్ - Sakshi

అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఊడగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం
 
చిత్తూరు: ‘ఏరు దాటేదాకా ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ‘బాబు వస్తే ఇంటికో ఉద్యోగం’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలోపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేసిన పాపాన పోలేదు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆదర్శ రైతులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణశాఖ వర్క్‌ఇన్‌స్పెక్టర్లతోపాటు పలుశాఖల పరిధిలో వందలాది మంది తాత్కాలిక సిబ్బంది ఉద్యోగాలు ఊడబెరికి ఇంటికి పంపారు. మిగిలిన వారిని సైతం డిసెంబర్ 31 నాటికి రోడ్డుపైకి నెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.2 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక  ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు. కొత్త ఉద్యోగాలు కల్పించడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడబెరకడం మొదలు పెట్టారు.

ఖాళీలను  భర్తీ చేయని ప్రభుత్వం

జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం  ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రెవె న్యూ, వైద్య ఆరోగ్యశాఖ, తాగునీటి సరఫరాల శాఖ, పంచాయతీరాజ్ తదితర ముఖ్య శాఖల్లోనూ అధిక సంఖ్యలో ఖాళీలు ఉండడంతో పనులు ముందుకు సాగడం లేదు.   జిల్లాలో 2006 నుంచి 1,793 మంది ఆదర్శరైతులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం నియమించిందన్న సాకుతో ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించింది.

గృహ నిర్మాణశాఖలో 112 మందిని తాత్కాలిక ఉద్యోగులను సైతం ఇంటికి పంపింది. మిగిలిన వారిని పంపేందుకు సిద్ధమైంది.మరోవైపు జిల్లాలో పనిచేస్తున్న 853 మంది ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లలో 300 మందిని తొలగించగా, మిగిలిన వారిని ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది.260 మంది వెలుగు ఉద్యోగులను సైతం ఇంటికి పంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీరితోపాటు  అన్నిప్రభుత్వ శాఖల పరిధిలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న తాత్కాలిక  ఉద్యోగులందరినీ వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు ఈ నెల 31 డెడ్‌లైన్‌గా పెట్టినట్లు తెలుస్తోంది.
 
 జిల్లా రెవెన్యూ శాఖలో ఖాళీలు:

సీనియర్‌అసిస్టెంట్లు -76, జూనియర్ అసిస్టెంట్లు -34, వీఆర్వోలు -186,
 వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలు:
 వైద్యాధికారులు-24, ఏఎన్‌ఎంలు-155, రెండవ ఏఎన్‌ఎంలు-75, ఎంపీహెచ్ మేల్-134, ల్యాబ్ టెక్నీషియన్లు- 43, ఫార్మసిస్టు-36, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు -86
 
సంక్షేమశాఖలో ఖాళీలు
 
మొత్తం వసతి గృహాలు-68, సహాయ బీసీ సంక్షేమ శాఖాధికారుల పోస్టులు-4,  ఖాళీ వార్డెన్ పోస్టులు-20, వర్కర్స్ -85,
 నీటి పారుదల శాఖలో ఖాళీలు:
 
జూనియర్ అసిస్టెంట్లు-2, టైపిస్టులు- 8, అటెండర్లు-34, జూనియర్ టెక్నీషియన్స్ - 13, టెక్నికల్ అసిస్టెంట్-1, డీఈ-3, ఏఈ-10,
ఉద్యానశాఖలో ఖాళీలు
 
సీనియర్ అసిస్టెంటు-1, అటెండర్ -1 డ్వామాలో ఖాళీలు
 ఏపీవోలు -2, టెక్నికల్ కన్సల్టెంట్ -18, కంప్యూటర్ ఆపరేటర్లు -15
 
పశుసంవర్థక శాఖలో ఖాళీలు

 
వెటర్నరీ అసిస్టెంట్లు-21, ప్యారావెట్స్- 136, అటెండర్లు-86
 వ్యవసాయశాఖలో ఖాళీలు
 వ్యవసాయాధికారులు-4, అదనపు వ్యవసాయాధికారుల పోస్టులు- 33         
 చిత్తూరు కార్పొరేషన్‌లో ఖాళీ పోస్టులు -
 అసిస్టెంట్ కమిషనర్ -1, రెవెన్యూ అధికారి -1, మేనేజర్ -1, అకౌంటెంట్ -1, పర్యావరణ ఇంజనీర్ -1, సిటీ ప్లానర్ -1, ఏఈ-2, శానిటరీ ఇన్‌స్పెక్టర్ -3, హెల్త్ ఇన్‌స్పెక్టర్ -1, మహిళ వైద్యాధికారి -1, వెటర్నరీ అసిస్టెంట్ -5, ఆయాలు -3, సీనియర్ అసిస్టెంట్ -16, ఆఫీసర్ సూపరింటెండెంట్ -7, యూడీఆర్‌ఐ -1, పబ్లిక్ అండ్ హెల్త్ - 4, స్వీపర్లు -19
 తాగునీటి సరఫరా విభాగం ఖాళీలు
 ఎస్‌ఈ -1,  ఈఈ-1, డీఈ-1, ఏఈ-24, జూనియర్ అసిస్టెంట్లు -2, అటెండర్లు -18, టైపిస్టులు -4, జేటీఓలు -13, టెక్నికల్ అసిస్టెంట్ - 1
 జిల్లాపరిషత్‌లో ఖాళీలు
 జూనియర్ అసిస్టెంట్లు -12, అటెండర్లు -8
 
అరకొర పోస్టులతో డీఎస్సీ


 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. దీంతో ఒ క్కొక్క పోస్టుకు వెయ్యిమంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక శాఖల్లో ఖాళీలు ఉన్నా భర్తీకి మాత్రం నోచుకోలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్‌లో బయాలజీకి ఒక్కపోస్టు కూడా చూపకపోవడం దారుణం. - చరణ్‌రాజ్,డీఎస్సీ అభ్యర్థి, ఐరాల
 
ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించాలి

 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతియేటా డీఎస్సీని నిర్వహించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఉన్నత విద్యలను పూర్తిచేస్తే ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెందుతోంది. నిరుద్యోగ సమస్య అధికమవుతోంది.
  -కుమార్, బీఈడీ నిరుద్యోగి,చిత్తూరు
 
10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు


 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. అధికారం చేపట్టాక నిరుద్యోగుల గురించి యోచనైనా చేయలేదు. కందిస్థాయి ఉద్యోగాలే కాకుండా ఇంజనీర్లు,ఎంఈవోలు,డీవైఈవోలు అధికసంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
 - షేరు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు
 
 రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి

 రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో అధికసంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- ఇమ్రాన్,చిత్తూరు
 
 జాబ్ జాడ ఎక్కడ బాబు  

 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఒక డీఎస్సీ మినహా ఏ ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు. అది కూడా అరకొర పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతి ప్రస్తావన తేవడం లేదు. పెపైచ్చు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచారు. అలాగే యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ  వయస్సును 60 నుంచి 62 వరకు పెంచారు. ఫలితంగా  నిరుద్యోగులు మరో రెండేళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది.
 
-వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement