నిరుద్యోగులకు రిక్తహస్తం | TDP Govt Cheated on Unemployment allowance | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు రిక్తహస్తం

Published Sun, Sep 30 2018 3:55 AM | Last Updated on Sun, Sep 30 2018 11:52 AM

TDP Govt Cheated on Unemployment allowance - Sakshi

సాక్షి, అమరావతి/గుంటూరు: ఇంటికో ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయకుండా యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల తరుణంలో మరో వంచనకు తెరతీశారు. నెలకు కేవలం రూ.1,000 చొప్పున రెండు మూడు నెలల పాటు తూతూమంత్రంగా భృతి ఇచ్చేసి, చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 50 నెలలు పూర్తయ్యాయి. నెలకు రూ.2,000 చొప్పున ఒక్కో నిరుద్యోగికి రూ.లక్షకు పైగా భృతి అందాలి. కానీ, నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఇప్పటిదాకా పైసా కూడా ఇవ్వలేదు. మళ్లీ ఎన్నికలు తరుముకొస్తుండడంతో చంద్రబాబుకు హఠాత్తుగా నిరుద్యోగులు గుర్తొచ్చారు. రూ.2,000 సంగతిని పక్కనపెట్టి, భృతి కింద నెలకు కేవలం రూ.1,000 చొప్పున ఇస్తామంటూ మళ్లీ నిరుద్యోగులపై వల విసురుతున్నారు. అర్హుల సంఖ్యను భారీగా కుదించేందుకు ఇప్పటికే సవాలక్ష ఆంక్షలు విధించారు. పైగా దరఖాస్తు ప్రక్రియను అర్థం కాని బ్రహ్మపదార్థంగా మార్చేశారు. భృతి పొందడానికి అన్ని అర్హతలున్నా వారు కూడా దరఖాస్తు చేసుకోలేక లబోదిబోమంటున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం’ అని నామకరణం చేసిన ఈ పథకం నిజానికి ఎవరి నేస్తమో అర్థం కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

యువత ఆశలపై ఆంక్షల కత్తి 
నిరుద్యోగ భృతిని వీలైనంత మేరకు కుదించేందుకు ప్రభుత్వం లెక్కలేనన్ని షరతులు విధించింది. భృతి పొందాలంటే డిగ్రీ పూర్తి చేసినవారు లేదా డిప్లొమా చేసిన వారు మాత్రమే అర్హులు. అంతేకాదు ప్రజా సాధికార సర్వేలో తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఈకేవైసీ వెరిఫికేషన్‌ పూర్తికావాలి. ఈకేవైసీ వెరిఫికేషన్‌ అంటే.. కుటుంబ సభ్యులందరి వివరాలతో ఆ కుటుంబంలోని నిరుద్యోగి వివరాలు సరిపోవాలి. ఆధార్‌ కార్డు కోసం చెప్పిన వివరాలు, ప్రజా సాధికార సర్వేలో చెప్పిన వివరాలు వంద శాతం సరిపోవాలి. నిరుద్యోగి బ్యాంక్‌ ఖాతాకు అతడి ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం(లింక్‌) కావాలి. గతంలో ప్రజా సాధికార సర్వే నిర్వహించినప్పుడు చాలామంది యువతీ యువకుల ఇళ్లల్లో లేరు. దాంతో సర్వేలో వారు పేర్లు, వివరాలు నమోదు కాలేదు. అలాంటి వారు ఇప్పుడు నిరుద్యోగ భృతి పొందే అవకాశం లేదు. ఏదైనా ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నా, గతంలో పనిచేసి మానేసినా భవిష్య నిధి(పీఎఫ్‌) ఖాతా, ఈఎస్‌ఐ అకౌంట్‌ ఉంటే నిరుద్యోగ భృతికి అనర్హులే. గతంలో ఉపకార వేతనాలు పొందిన నిరుద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.50 వేలు తీసుకున్న వారు కూడా అనర్హులే. 

ప్రభుత్వం విధించిన మరికొన్ని ఆంక్షలు... 
- కుటుంబంలో ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. 
22 నుంచి 35 ఏళ్లలోపు వయసు మాత్రమే ఉండాలి. 
ప్రజా సాధికారత సర్వేలో నమోదై ఉండాలి. తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. 
ప్రైవేట్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగి అయి ఉండకూడదు. 
కుటుంబంలో ఎవరు కారు కలిగి ఉండకూడదు. 

వయసు నిబంధన విడ్డూరం 
భృతి పొందాలంటే వయసు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యే ఉండాలన్న నిబంధన పట్ల నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది 40 ఏళ్లు దాటినా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి వయో పరిమితిని పెంచాలని కోరుతున్నారు. 

ఆధార్‌ ఉంటేనే భృతి ఇస్తారట!  
సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్‌ సంఖ్య అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ, ఆధార్‌ సంఖ్య లేకపోతే నిరుద్యోగ భృతి రాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. యువనేస్తం వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే ఫోన్‌కు వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుందని, దాన్ని ఎంటర్‌ చేయగానే సదరు వ్యక్తి నిరుద్యోగ భృతికి అర్హుడా కాదా అనే విషయం తెలిసిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులో కాదో వెబ్‌సైట్‌లో నిర్ధారణ అయినప్పుడు ప్రత్యేకంగా దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఓటీపీ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. మరికొన్నిచోట్ల సర్వర్‌ పనిచేయక అభ్యర్థులు అగచాట్లు పడుతున్నారు. చాలామంది నిరుద్యోగులు ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన ఫోన్‌ నంబర్లను ప్రస్తుతం వాడడం లేదు. కొందరు ఫోన్లు పోగొట్టుకొని నంబర్‌ కూడా వదిలేసుకున్నారు. వారికి ఓటీపీ రాదు. అంటే దరఖాస్తు చేసుకునే అవకాశం లేనట్లే. 

ఇప్పటిదాకా 5.39 లక్షల దరఖాస్తులే..  
నిరుద్యోగ భృతి కోసం శనివారం సాయంత్రం 7 గంటల వరకు 5,39,159 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం 1,62,451 మంది వివరాలను పరిశీలించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఓటీపీ రాని వారు 14,658 మంది ఉన్నారు. తమ దరఖాస్తు తిరస్కరణకు గురైందని 32,591 మంది ఫిర్యాదు చేశారు. నిరుద్యోగ భృతికి ప్రభుత్వం విధించిన షరతులు, దరఖాస్తుల ప్రక్రియలో లోపాల వల్ల లక్షలాది మంది ఈ పథకం కింద ప్రయోజనానికి నోచుకోలేకపోతున్నారు. 

లింక్‌ కాకపోతే అంతే సంగతి 
ముఖ్యమంత్రి యువనేస్తం దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో ఎన్నో తప్పులున్నాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం.. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట పొలం కంటే ఎక్కువ ఉన్నా, అనంతపురం జిల్లాలో అయితే 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. 5 ఎకరాలు, అంతకంటే తక్కువ అసైన్డ్‌ భూమి ఉన్న అభ్యర్థులు మాగాణి కలిగి ఉన్నారంటూ వెబ్‌సైట్‌ వారి దరఖాస్తులను స్వీకరించడం లేదు. సర్టిఫికెట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ యూనివర్సిటీతో లింక్‌ కాలేదనే కారణంతో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం డిగ్రీ పూర్తి చేయలేదంటూ యువనేస్తం వెబ్‌సైట్‌ చూపుతోంది. 

లైసెన్స్‌ ఉంటే కారు ఉన్నట్టేనా? 
నాలుగు చక్రాల వాహనం ఉన్న అభ్యర్థులు భృతికి అనర్హులని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యువనేస్తం వెబ్‌సైట్‌లో, యాప్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో కనీసం బైక్‌ కూడా లేని అభ్యర్థులకు కారు ఉందని చూపుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. నాలుగు చక్రాల వాహనం నడిపేందుకు లైసెన్స్‌ ఉన్నవారికి ఈ సమస్య ఎదురవుతోంది. 

ఫిర్యాదు చేసినా ఫలితం సున్నా 
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే డయల్‌ 1100, మెయిల్‌ ఐడీల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు ప్రకటించారు. అయితే, ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. 

అనుసంధాన గండం 
నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుందామంటే  ఆధార్‌ గండం పట్టి పీడిస్తోంది. గతంలో చాలామందికి పుట్టిన తేదీ పూర్తిగా నమోదు చేయకుండానే ఆధార్‌ కార్డులు ఇచ్చారు. కొందరు తమ ఆధార్‌ సంఖ్యకు మొబైల్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోలేదు. ప్రస్తుతం నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం పూర్తిగా ఉండాలి. అభ్యర్థుల ఆధార్‌ సంఖ్య వారి మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం కావాలి. ఆధార్‌లో మార్పులు చేర్పులు, మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం కోసం నిరుద్యోగులు ఆధార్‌ నమోదు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

బైక్‌ కూడా లేని నాకు కారు ఉందట! 
‘‘నేను బీఈడీ పూర్తిచేసి డీఎస్సీకి సన్నద్ధమవుతున్నా. నాకు బైక్‌ కూడా లేదు. కానీ, నిరుద్యోగ భృతి కోసం యువనేస్తం వెబ్‌సైట్‌లో నా వివరాలను నమోదు చేస్తే నాకు కారు ఉందంటూ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. 1100కు ఫిర్యాదు చేసినా నా సమస్యను పరిష్కరించలేదు. 
– అరుణ్, నిరుద్యోగ ఐక్య వేదిక కో–కన్వీనర్, గుంటూరు

డిగ్రీ పూర్తి చేయలేదని చూపిస్తోంది
‘‘నేను 2009లో డిగ్రీ, 2017లో ఎమ్మెస్సీ పూర్తిచేశా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నా. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటే నేను డిగ్రీ కూడా చేయలేదని వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. 1100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు’’ 
– బి.శ్రీలక్ష్మి, నిరుద్యోగి, గుంటూరు జిల్లా 

దరఖాస్తు ప్రక్రియ తప్పులతడక 
‘‘మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న పేరిట 5 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. నేను ఎంబీఏ చదివాను. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుందామంటే మాకు 5 ఎకరాల మాగాణి ఉన్నట్టుగా వెబ్‌సైట్‌లో చూపుతోంది. నా దరఖాస్తును స్వీకరించడం లేదు. యువనేస్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా తప్పులతడక. ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ 
– కృష్ణ, నిరుద్యోగి, గుంటూరు జిల్లా

ఆధార్‌ సెంటర్‌ చుట్టూ తిరుగుతున్నా... 
‘‘నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే నా ఆధార్‌ నంబర్‌ మొబైల్‌ నంబర్‌కు అనుసంధానం కాలేదని చూపిస్తోంది. దీంతో అనుసంధానం చేయించుకోవడానికి రెండు వారాలుగా ఆధార్‌ సెంటర్‌ చుట్టూ తిరుగుతున్నా. సర్వర్‌ పనిచేయడం లేదని చెబుతున్నారు. ప్రతిరోజూ తిరగాల్సి వస్తోంది’’ 
– టి.రామాంజనేయులు, నిరుద్యోగి, లాల్‌పురం, గుంటూరు

దరఖాస్తులకు కొర్రీలా? 
‘‘నేను ఎంకాం పూర్తిచేశా. అయినా ఉద్యోగం రాలేదు. మాది నిరుపేద కుటుంబం. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు యువనేస్తం పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే నేను డిగ్రీలో ఉత్తీర్ణుడిని కాలేదని చూపుతోంది. బ్యాంక్‌ ఖాతా సంఖ్యను కూడా వెబ్‌సైట్‌ స్వీకరించడం లేదు. దరఖాస్తు చేయలేకపోయా. మా స్నేహితులు చాలామంది ఇలాంటి కొర్రీల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు’’ 
– పప్పల రంగనాయుడు, నిరుద్యోగి, చిన్నరావుపల్లి, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 
‘‘ప్రభుత్వం ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా యువనేస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అర్హుల సంఖ్యలో కోత విధించేందుకు అంక్షలు పెట్టింది. ఈ పథకం అమల్లో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.
– హేమంత్‌ కుమార్, నిరుద్యోగి, చిత్తూరు జిల్లా

నిరాశతో వెనుతిరిగా... 
‘‘నేను డిగ్రీ పూర్తి చేశా. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే నా ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నెంబర్‌ అనుసంధానం కాలేదని దరఖాస్తు తిరస్కరణకు గురైంది. మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి మీ–సేవ కేంద్రాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అనుసంధానం వెంటనే జరగదని, 15 రోజులకు పైగా సమయం పడుతుందని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగా’’  
– సి.శ్రీకాంత్, బ్రాహ్మణపల్లి, కూడేరు మండలం, అనంతపురం జిల్లా

దరఖాస్తును తిరస్కరించడం దారుణం  
‘‘2006లో డిగ్రీ పూర్తి చేశా. ఎస్‌కేయూలో పీజీ చదివా. నిరుద్యోగ భృతి కోసం మీ–సేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకున్నా. మా కుటుంబానికి 2.60 ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపడంతో దరఖాస్తును తిరస్కరించారు. కానీ, అనంతపురం జిల్లాలో భృతి పొందాలంటే నిరుద్యోగులకు 10 ఎకరాల దాకా భూమి ఉండొచ్చని ప్రభుత్వం చెప్పింది. అయినా నా దరఖాస్తును తిరస్కరించడం దారుణం’’ 
– శ్రీనాథ్‌ నవీన్, శింగనమల, అనంతపురం జిలా

విద్యార్హతలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు 
‘‘నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేద్దామంటే అన్‌లైన్‌లో విద్యార్హతలను చూపించడం లేదు. నేను 2016లో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పీజీ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ప్రభుత్వం ప్రకటించిన యువనేస్తం వెబ్‌సైట్‌ నా వివరాలను తీసుకోవడం లేదు. ఇప్పటిదాకా దరఖాస్తు చేయలేకపోయా’’ 
 – సీహెచ్‌ సుధీర్‌కుమార్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా

ఓటీపీ సమస్యగా మారింది 
‘‘ఆధార్‌ కార్డు పొందినప్పుడు మనం ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వెళుతుంది. అయితే, ఇప్పుడు ఆ నంబర్లను చాలామంది ఉపయోగించడం లేదు. దీంతో ఓటీపీ రాక, యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది’’ 
– ఖాన్, నిరుద్యోగి, విశాఖ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement