సాక్షి, అమరావతి: శిక్షణ ద్వారా యువతకు భారీఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. లక్షల్లో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ప్రభుత్వం ఎంతో ఘనంగా చేస్తున్న ప్రచారం అంతా ఉత్తి డొల్ల తప్ప అందులో ఏమాత్రం వాస్తవంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేటతెల్లమైంది. అలాగే, రాష్ట్రంలో అన్ని జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించేశామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని కూడా తేలింది. అంతేకాదు.. మహిళలపై నేరాలు ఏటేటా పెరిగిపోతున్నాయని సర్కారు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. (నిరుద్యోగులకు రిక్తహస్తం)
ఈ సందర్భంగా ప్రణాళికా శాఖ రూపొందించిన నివేదికలో 17 ప్రభుత్వ పథకాల అమలులో ప్రచార ఆర్భాటం తప్ప మరేంలేదని స్పష్టమైంది. యువతకు శిక్షణ పేరుతో కోట్ల రూపాయల కమీషన్లు ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు కట్టబెడుతున్నారని.. కానీ, అలా శిక్షణ పొందిన వారికి ఉద్యోగాల కల్పన అంతంతమాత్రంగానే ఉందని ప్రణాళిక శాఖ తన నివేదికలో వివరించింది. 1,21,280 మందికి శిక్షణ పేరుతో ఆయా సంస్థలకు రూ.145.53 కోట్లు చెల్లించేశారు. అయితే, ఇందులో ఉపాధి చూపించింది కేవలం 15,237 మంది కేనని, ఇది కేవలం 21.54 శాతమేనని నివేదికలో పేర్కొన్నారు. ఆదరణ పేరుతో హడావిడి చేసిన సీఎం చంద్రబాబు ఆచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. డి–కేటగిరిలో 0 నుంచి 40 శాతం అమలు పథకాలను చేర్చారు. ఈ కేటగిరిలో 17 పథకాలున్నాయి. దీంతో పాటు యునిసెఫ్ నిర్వహించిన సర్వేలో 93 శాతం హౌస్ హోల్డ్స్‌కు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. వీరిందరూ బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది.
మరోవైపు.. బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలు 12,918కు గాను 1,505 పంచాయతీల్లో.. 110 మున్సిపాల్టీలకు గాను 15 మున్సిపాల్టీల్లో మాత్రమే లక్ష్యం సాధించినట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. అంటే ఇన్ని రోజులు ఉపాధి హామీ నిధులతో వేల కోట్ల రూపాయలను వ్యయంచేస్తూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేశామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నదంతా బూటకమని తేలిపోయింది. అలాగే, అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలుగా చేస్తున్నామని చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవంలేదని ప్రణాళికా శాఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఏ ఏటికాయేడు పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలేదని కూడా ఆ నివేదిక తేల్చిచెప్పింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 8,855 మంది మహిళలపై నేరాలు జరగ్గా ఈ ఏడాది అదే కాలంలో 9,221 మహిళలపై నేరాలు జరగడం గమనార్హం. అత్యధికంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ తరువాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. (నీటి మీద రాతలు.. టీడీపీ హామీలు)
ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల్లోనూ అంతే..
అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి జాగాలు ఇచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలూ బూటకమేనని ప్రణాళికా శాఖ నివేదిక తేల్చిచెప్పింది. అర్హులందరికీ ఇవన్నీ ఇచ్చేస్తే దాదాపు కోటి మంది పేదలు ఇంకా దరఖాస్తులు ఎందుకు చేసుకున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం పది శాఖలకు చెందిన పథకాల కోసం ఏకంగా 99,08,297 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. రేషన్ కార్డులుగానీ, పింఛన్లుగానీ అర్హులైన వారందరికీ ఇవ్వకుండా ఖాళీ అయిన చోటే కొత్తవారికి మంజూరు చేస్తున్నారు. దీంతో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందడంలేదు.
ఇళ్తు, ఇంటి జాగా, పెన్షన్లు, రేషన్ కార్డులు, మంచినీటి సరఫరా, రహదారులు, వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఏకంగా 99,08,297 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ఏకంగా 32,11,595 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరో 20.81 లక్షల మందికి మంజూరు చేయాలని తేల్చి వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరోవైపు.. ఆర్టీజీఎస్ పేరుతో రకరకాల ఆంక్షలు విధించి పేదలకు పథకాలు అందకుండా వారిపై అనర్హుల పేరుతో వేటువేస్తున్నారు. ప్రాసెస్ చేయలేదని, మ్యాప్ కావడం లేదంటూ మరికొన్ని లక్షల దరఖాస్తులను మూలన పడేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment