‘హోదా’ సంజీవని కాదన్నది నువ్వే..
చంద్రబాబుపై బీజేపీ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? అని స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అదే అంశాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో తమ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మండిపడింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నేతలు కపిలేశ్వరయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కోటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో, చెడు జరిగితే నరేంద్ర మోదీ ఖాతాలో వేయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలని సురేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించి, మోదీ ఏపీకి ఏమీ చేయడం లేదంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ‘‘ఏపీలో ఎక్కడ చూసినా ప్రభుత్వ నిధులు దుబారా అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మీ(టీడీపీ) ఇష్టానుసారం పరిపాలన సాగిస్తే కుదరదు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ఖర్చుపై శ్వేతప్రతం విడుదల చేయాలి. జమా ఖర్చులు లెక్కచెప్పాల్సిన అవసరం ఉంది.
బీజేపీపై అపనిందలు వేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’’ అని సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న, బుచ్చయ్యచౌదరి లాంటివాళ్లతో తిట్టాల్సిందంతా తిట్టించి మరోవైపు బీజేపీపై విమర్శలు చేయవద్దని ఊరడింపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మిమ్మల్ని ఎవరు మాతో కలిసి రమ్మన్నారు.. ఎవరు పొమ్మంటున్నారు? అని ప్రశ్నించారు.
కేంద్రంపై తప్పుడు ప్రచారం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తే, అదంతా గాలికి వదిలేసి ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.16 వేల కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు పెంచేశారని సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పారదర్శక పాలన అందించాలన్న మోదీ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అందిస్తున్నా... అమరావతికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా మోదీ ఫొటో పెట్టలేదని విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో రోడ్లు వేయిస్తూ ముఖ్యమంత్రి ‘చంద్రన్నబాట’ అంటూ తన సొంత పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.