హోదాపై ఆమరణదీక్షకు సిద్ధమా?
సీఎంకు మూడు పేజీల లేఖ రాసిన కాపు ఉద్యమనేత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాన సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాకోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమా? మీతోపాటు మీ కుమారుడు లోకేశ్ కూడా సిద్ధపడతారా... అందుకు మీరు సై అంటే నేను కూడా ఆమరణ దీక్ష చేపడతాను’’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ముద్రగడ మూడు పేజీల లేఖను గురువారం సీఎంకు పంపించారు. ‘‘నా జాతికి మీరిచ్చిన హామీలు అమలు చేయమంటే కోపమొచ్చి నా కుటుంబాన్ని అవమానించారు. అయినా నాకెటువంటి చింతా లేదు.
దీనిపై మీనుంచి సానుభూతి మాటలుగానీ, క్షమాపణగానీ కోరడం లేదు. ఇంకెన్ని అవమానాలు చేసినా, చేయించినా భరిస్తాను. నా జాతికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూల్‌లో చేర్చమని అసెంబ్లీలో మీరు చేసే తీర్మానంకోసం ఎదురు చూస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆమరణ దీక్ష చేయడానికి మీరూ.. మీ కుమారుడు సిద్ధపడితే నేను కూడా మీతోపాటే మీఇంట్లోనే చోటిస్తే దీక్షలో కూర్చుంటా. ఎవరెన్నిరోజులు చేయగలరో ఆ దీక్షలో పరీక్షకు నిలబడదాం. ఈ దీక్షను సవాలుగా స్వీకరించడంవల్ల ప్రత్యేక హోదాతోపాటు మన శరీర పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి గురించి ప్రజలు తెలుసుకునే వీలుంటుంది.’’ అని ముద్రగడ తన లేఖలో తెలిపారు.