అధికారం అండతో అడ్డంగా దోచుకున్న మాజీ మంత్రి
2014–19 మధ్య రూ.కోట్లకు పడగలు
ఆయన మామ కనుసన్నల్లోనే సెటిల్‌మెంట్లు
గుట్కా వ్యాపారం నుంచి ప్రభుత్వ స్థలాల కబ్జాల వరకు
మట్టి మేత, లిక్కర్ దందా, ఇసుక దోపిడీ దాక
హత్యకేసులోనూ నిందితుడు
రిమాండ్ ఖైదీగానూ సెంట్రల్ జైలులో గడిపిన వైనం
విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్‌మెంట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్‌లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు.
ఎక్సైజ్‌లో భారీగా దోపిడీ
∗ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్ దందా నడిపారు.
∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
∗ ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం.
∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు.
∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది.
∗ కరకట్ట, చల్లపల్లి బైపార్ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు. పొక్లెయిన్ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు.
∗ ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ, అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి.
∗ బినామీల పేరుతో కాల్‌మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం.
∗ ముఖ్యపట్టణంలో డివైడర్ గ్రిల్ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
∗ ఒక్కో వాటర్ ట్యాంక్ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది.
∗ రైల్వే గేట్ నుంచి మంగినపూడి బీచ్ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది.
∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి.
హత్య సహా 25 కేసులు
ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్ 192/2020తో 120 బీ, 302 ఐపీసీ 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment