హోదా కోసం ఢిల్లీకి వెళ్లలేదు
సాక్షి, అమరావతి: తాను రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరేందుకు ఢిల్లీ వెళ్లలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకే వెళ్లానని తెలిపారు. అదే సందర్భంలో ప్రత్యేకహోదా, తదితర అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించానని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసి...రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేస్తే బాగుంటుందని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు మోదీ చెప్పారన్నారు. కాంగ్రెస్ జీఎస్‌టీ బిల్లుకు ప్రైవేటు బిల్లును లింకు పెట్టి ఉంటే తప్పకుండా పాస్ అయ్యేదని, అలా లింకు పెట్టకుండా అక్కడ బిల్లు పాసయ్యాక ఇక్కడ మళ్లీ అడుగుతున్నారని విమర్శించారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని, అందుకే అక్కడ కాంగ్రెస్ పెట్టిన బిల్లు నెగ్గితే వాళ్లు రాజీనామా చేయాలి కాబట్టి దాన్ని లోక్‌సభకు పంపారని తెలిపారు. సాంకేతిక సమస్యలు చూపిస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ రాష్ట్రంతో ఆడుకుంటున్నాయని, ఇద్దరి రాజకీయ ప్రయోగాల్లో రాష్ట్రం నలిగిపోతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతిచ్చిన 11 పార్టీలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని, 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల మాదిరిగా పరిశ్రమలకు రాయితీలివ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరానని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ ప్రైవేటు బిల్లును లోక్‌సభకు పంపుతున్నట్లు ప్రకటన చేసినప్పుడు టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి చప్పట్లు కొట్టడాన్ని విలేకరులు ప్రశ్నించగా.. ఆయనకు అవగాహన లేక అలా చేశాడని వ్యాఖ్యానించారు. కృష్ణా పుష్కరాలకు ప్రధానితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంతరామ్, వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు, జేపీ నడ్డా, లోక్‌సభ స్పీకర్‌తోపాటు బీజేపీ సీనియర్ నేత అద్వానీలను కలసి ఆహ్వానించినట్లు తెలిపారు.
ఏపీకి ప్యాకేజీ ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారని, ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే.. ఇక జాప్యం చేయకుండా రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ప్రధానితో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాలకు రావాలని కోరుతూ చంద్రబాబు ప్రధానికి ఆహ్వాన పత్రిక అందించారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు కూడా మోదీని కలిశారు.