నేడు మోదీతో బాబు భేటీ | today babu meets modi | Sakshi
Sakshi News home page

నేడు మోదీతో బాబు భేటీ

Published Tue, Aug 25 2015 1:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

నేడు మోదీతో బాబు భేటీ - Sakshi

నేడు మోదీతో బాబు భేటీ

హోదా సాధిస్తారా?.. ప్యాకేజీ మాయ చేస్తారా?
* ప్యాకేజీవైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
* విభజన హామీల అమలుకు రూ.2 లక్షల కోట్లు కోరాలని నిర్ణయం?
* రాజధాని నిర్మాణానికి ప్రస్తుతం రూ.4 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి  
* కేంద్రాన్ని నిలదీయలేని నిస్సహాయత
* ‘ఓటుకు కోట్లు’తో బాబు రాజీ ధోరణి
* హోదాపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించడానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధించుకోవడం కంటే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలన్నట్లు ప్రభుత్వ తీరు కనిపిస్తోంది.

సీఎం చంద్రబాబు  మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో ఢిల్లీలో సమావేశమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గడిచిన 15 నెలలుగా కేంద్రం దాటవేస్తున్న హోదా పై ఈసారైనా స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి మాత్రం ప్యాకేజీపైనే ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. అదీ విభజన చట్టంలో చేసిన హామీలకు సంబంధించిందే తప్ప కొత్తగా ఉండదని తెలుస్తోంది.
 
వైఎస్సార్‌సీపీ బంద్ పిలుపుతో...
రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏడాదిన్నర కాలంగా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాజీ ధోరణిని ప్రదర్శిస్తోంది.కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతోంది.

రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో సీఎం కొంత హడావుడి చేస్తున్నారు తప్ప హోదా సాధన దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న దాఖలాలైతే కనిపించడం లేదని సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధానికి సమర్పించే విజ్ఞాపన పత్రాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని నామమాత్రంగా ప్రస్తావించినప్పటికీ  పెద్దగా పట్టుబట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కుపోయిన నేపథ్యంలో కేంద్రం సుముఖంగా లేని హోదా అంశం జోలికి పోకుండా విభజన చట్టంలోని హామీలన్నింటి  అమలుకయ్యే వ్యయాన్ని కలిపి పెద్ద ప్యాకేజీగా కనిపించేటట్లుగా ప్రకటింపజేసుకుంటే మేలన్న తలంపుతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం.
 
ప్యాకేజీతో ప్రజల దృష్టి మళ్లింపు
ప్రధాని మోదీ ఇటీవలి కాలంలో బిహార్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో.. విభజన  చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ కూర్చి గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్‌కూ ఒక ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యమంత్రి కోరబోతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాయితీలతో పాటు రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వడం వంటి మొత్తం అంశాలన్నింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

ప్యాకేజీ ప్రకటన చేయించడం ద్వారా ప్రత్యేక హోదా అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కింద లభించే గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికన్నట్లు ఖర్చుచేయడానికి వీలుండదు. ప్యాకేజీ ప్రకటించిన పక్షంలో తద్వారా ఆయా ప్రాజెక్టులకు లభించే నిధులను ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి వీలవుతుందని రాజకీయ వర్గాల కథనం.
 
బిహార్‌కన్నా ఎక్కువగా ఉంటే చాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ‘ప్రత్యేక’ంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నింటికీ కలిపి రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా ప్రధానిని కోరనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వచ్చే అయిదేళ్లలో నెరవేర్చడానికి అయ్యే మొత్తం ఖర్చును కలిపి బిహార్‌కన్నా ఎక్కువ  ప్యాకేజీ ప్రకటించినట్లు కనబడితే అదే చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అందులోనే పారిశ్రామిక రాయితీలు, నూతన రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విద్యా, వైద్య రంగాలకు చెందిన జాతీయ సంస్థల ఏర్పాటు, గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ... తదితర అంశాలతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఉంటాయని సమాచారం. నూతన రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు రూ. వెయ్యి కోట్లు, భవనాల నిర్మాణాలకు రూ.500 కోట్లను గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతన రాజధాని నిర్మాణం కోసం రూ.4,000 కోట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కలిసి, లేఖలు రాసి కోరిన కొన్ని అంశాలు..
* విభజన చట్టంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గతేడాది ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినందున 15 ఏళ్లపాటు రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ హోదా కల్పించాలి.  రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94(1) ప్రకారం రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు 15 ఏళ్లపాటు నూటికి నూరు శాతం పారిశ్రామిక పెట్టుబడులపై పన్ను రాయితీలు ఇవ్వాలి.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్లు 46(2), (3) ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఐదేళ్లలో రూ.24,350 కోట్ల ఆర్థిక సాయం అందించాలి.
* గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.15,691 కోట్లు మంజూరు చేయాలి.  పలు పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రుణంగా మంజూరు చేసిన రూ. 10,090 కోట్లను గ్రాంట్‌గా మార్చా లి.
* హైదరాబాద్ తరహాలో కొత్త రాజధాని నిర్మాణానికి పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో భాగంగా విజయవాడ-గుంటూరు-తెనాలి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తొలి దశలో రూ.19,700 కోట్లు కేటాయించాలి.
* రాష్ట్రంలో 2,897 కిలోమీటర్ల మేర గల 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి పెంచాలి.  నూతన రాజధానికి 30 టీఎంసీల తాగునీరు అవసరం. కృష్ణా నదిలో ఎవరికీ కేటాయించని నీటి నుంచి 30 టీఎంసీలను నూతన రాజధానికి కేటాయించాలి.
* కొత్త రైల్వే జోన్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలి.  
 
ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన మంగళవారం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement