హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’ | minister rayapati comments on special status | Sakshi
Sakshi News home page

హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’

Published Tue, Sep 13 2016 3:25 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’ - Sakshi

హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’

టీడీపీ ఎంపీ రాయపాటికి భారీ లబ్ధి చేకూర్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
* పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం రూ.1,481 కోట్లు పెంపు
* 7న పోలవరం బాధ్యతలు రాష్ట్ర సర్కార్‌కు అప్పగించిన కేంద్రం
* 24 గంటలు గడవక ముందే అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు
* అంతా పక్కా ప్రణాళికతో నడిపించిన చంద్రబాబు


సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టినందుకు గానూ ఏపీ ప్రభుత్వ పెద్దలకు దక్కిన మొదటి ‘ప్యాకేజీ’ ఇది.

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(ప్రధాన పనులు) కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు  ఏపీ ప్రభుత్వం రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చింది. కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందనడానికి ఇదొక నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెం చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది.
 
ఐదు కోట్ల మంది ఆంధ్రుల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టి, వేగంగా పూర్తి చేసేందుకు రెండేళ్లుగా మొగ్గుచూపని ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం హెడవర్క్స్ పనుల అంచనా వ్యయం రూ.4,717 కోట్లు కాగా, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.. రష్యా, ఒమన్‌లకు చెందిన జేఎస్‌సీ, యూఈఎస్‌లతో జట్టుకట్టి, 14.05 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,054 కోట్లకు పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేజిక్కించుకుంది. ఈ పనులు 60 నెలల్లో పూర్తి చేసేలా 2013, మార్చి 2న కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
 
నాడు తస్మదీయుడు..
నేడు అస్మదీయుడు

అయితే పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కు లేదని.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని, పనులు అప్పగించొద్దంటూ అప్పట్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ(స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) నివేదిక ఇచ్చింది. రాయపాటి అప్పట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు. దీంతో పోలవరం హెడ్‌వర్స్ పనులు రాయపాటికి ఎలా అప్పగిస్తారంటూ అప్పటి విపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం రాయపాటి సైకిలెక్కారు.

దీంతో చంద్రబాబుకు రాయపాటి సన్నిహితుడిగా మారిపోయారు. కేవలం ప్రాజెక్టులు పనులు కొట్టేసేందుకే ఎంపీ రాయపాటి రష్యా, ఒమన్ దేశాలకు చెందిన సంస్థల సహకారం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ఆ సంస్థల చిరునామా కన్పించలేదు. 2015, అక్టోబర్ 10 వరకూ అంటే.. 32 నెలల్లో కేవలం రూ.232.42 కోట్ల విలువైన పనులే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) పదే పదే అసంతృప్తి వ్యక్తం చేసింది.

అలాగే కాంట్రాక్టర్‌కు పనులు చేసే సత్తా లేదని, తక్షణమే తొలగించాలని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా సూచించింది. కానీ ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు.. రాయపాటికి భారీ ఎత్తున దోచిపెట్టేందుకు పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. పీపీఏని నామమాత్రంగా మార్చి, రాయపాటితో కలసి నిధులు కొల్లగొట్టాలన్నది ఆ లేఖల ఎత్తుగడగా తెలుస్తోంది.
 
ఏపీకి అప్పగించగానే దోపిడీపర్వం..
పనులు వేగవంతం చేయాలంటే తాజా(2015-16) ఎస్‌ఎస్‌ఆర్ మేరకు అంచనా వ్యయాన్ని పెంచాలని, హెడ్‌వర్క్స్ పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని, వారిని కూడా ప్రధాన కాంట్రాక్టరే ఎంచుకోవచ్చంటూ రాయపాటి సాంబశివరావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లమాలిన ప్రేమ కురిపించారు. ఆ మేరకు 2015, అక్టోబర్ 10న కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించారు. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలో ఒప్పందం చేసుకోవాలని, ‘ఎస్క్రో’ అకౌంట్‌ను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని కేబినెట్ షరతు విధించింది.

కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంచనా వ్యయాన్ని పెంచుతూ పోలవరం ఈఎన్‌సీ ఏప్రిల్ 30న మొదటి సారి, ఆగస్టు 9న రెండో సారి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను తొక్కిపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగానే వాటిపై ఆమోదముద్ర వేసేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని  రూ.5,767.83 కోట్లకు పెంచారు. ఇందులో 2015, అక్టోబర్ 10 వరకు పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.232.42 కోట్లు కాగా, మిగతా పనుల విలువ రూ.5,535.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం ఒకేసారి రూ.1,481.41 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement