fast unto death
-
అక్టోబర్ 2 నుంచి ఆమరణ దీక్ష
రాజానగరం: పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తకావొస్తున్నా ఇం తవరకు ఆయా రైతులకు నష్టపరిహారాన్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గ పు ఆలోచనా విధానానికి తా ర్కాణంగా చెప్పవచ్చునని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. ఈ పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు కూలీల పక్షాన ఈ నెల 25వ తేదీ నుం చి చేపట్టదలచిన ఆమరణ దీక్షను రైతు సత్యాగ్రహం పేరుతో గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2వ తేదీన చేపట్టనున్నట్టు తెలిపారు. ‘రా వాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన ఇష్టానుసారంగా పంíపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరిహారం పంపిణీ విషయంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తించే రైతులు, రైతు కూలీలకు ఈ రోజుకు కూడా న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ ఇంకా 85 మంది వరకు రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరాకు రూ. నాలుగు లక్షలు పెంచి పరిహారం అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం కోర్టులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం ఆలోచించడం లేదన్నారు. అయితే తాను ఆమరణ దీక్ష గురించి ప్రకటించిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పరుగుపరుగున వెళ్లి రైతుల తరఫున సీఎంకు వినతి ప్రతం ఇచ్చినట్టుగా డ్రామాలాడటం విడ్డూరంగా ఉందన్నారు. సెంటు భూమి కూడా లేని బాలకృష్ణ లాంటి వ్యక్తులతో కొంతమంది డమ్మీ రైతులతో ప్రెస్మీట్లు పెట్టించి, తప్పుదారి పట్టేవిధంగా ఎల్లో మీడియాలో ప్రకటనలు ఇప్పించడం విచిత్రంగా ఉందన్నారు. 2013 భూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని లెక్కిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక రైతుకు చెందిన భూములు ఒకటికి రెండు మూడు ప్రాజెక్టుల్లో పోతే పరిహారం నాలుగు రెట్లు ఇవ్వడంతోపాటు రూ.ఐదున్నర లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కుటుంబంలో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉందన్నారు. రైతు కూలీలకు కూడా ఇదే విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లేదా నెలకు రూ.రెండు వేలు చొప్పున 20 సంవత్సరాలపాటు ఆ కుటుంబానికి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఏ విషయాన్నీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదని జక్కంపూడి ఆవేదన వ్యక్తం చేశారు. -
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
-
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
భద్రచలం: భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహర దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని దీక్షాస్థలి నుంచి బలవంతంగా భద్రచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత రెండు రోజులుగా సున్నం రాజయ్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దసర పండగ రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంది. కొత్త జిల్లాల జాబితాలో భద్రచలం పేరు లేకపోవడంతో సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోభాగంగా భద్రచలం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సున్నం రాజయ్య ఆమరణ దీక్షకు దిగారు. -
ఆమరణ దీక్షలు భగ్నం
కోరుట్ల డివిజన్ సాధనకు ఉద్యమం తీవ్రం ఆస్పత్రిలో ‘శికారి’ దీక్ష కొనసాగింపు కోరుట్ల : కోరుట్ల డివిజన్ కోసం మూడోసారి చేపట్టిన ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. గురువారం తెల్లవారుజామున కోరుట్ల, రాయికల్, మేడిపల్లి ఎస్సైలు ఆమరణ దీక్ష స్థలికి చేరుకుని దీక్షాపరులను ఆస్పత్రికి తరలించారు. దీక్షాపరులు పాత మున్సిపల్ మెయిన్ గేటుకు తాళం వేసుకున్నప్పటికీ వాటిని తీయించి దీక్షాపరులు శికారి రామకృష్ణ, వంగ ప్రభాకర్, గొసికొండ నరేశ్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఆరు గంటల సమయంలో వీరిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వంగ ప్రభాకర్, నరేశ్ దీక్ష విరమించగా..శికారి రామకృష్ణ కొనసాగిస్తున్నారు. దీక్ష కొనసాగిస్తా కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారని మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఆరోపించారు. కోరుట్ల డివిజన్ ప్రకటన వచ్చే వరకు ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్లూకోజ్ లెవల్స్, బీపీ లెవల్స్ తగ్గాయని దీక్ష విరమించాలని వైద్యుడు మల్లికార్జున్ సూచించారు. సంఘీభావం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న శికారి రామకృష్ణకు సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, అఖిలపక్ష నాయకులు అనూప్‌రావు, రుద్ర శ్రీనివాస్, సాయిని రవీందర్రావు, వెగ్యారపు మురళి, జిల్లా ధనుంజయ్, వాసం భూమానందం, యువజన సంఘాల నాయకులు సనావొద్దీన్, జాల వినోద్, గడెల విజయ్, కిషోర్, అఖిలపక్షాల నాయకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి సంఘీబావం ప్రకటించారు. ఆమరణ దీక్షలను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తరోకో నిర్వహించారు. -
నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
-
నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వినతి సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నారు. చారిత్రక నేపథ్యం, జనాభా, ఇతర మండలాల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని గత కొంత కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాట తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆమరణ దీక్షే సరైన మార్గమని కల్వకుర్తి అఖిలపక్షం తీర్మానం చేయడంతో వంశీ దీక్షకు దిగుతున్నారు. ఈ దీక్ష ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాదని ఆయన వెల్లడించారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా సాధించుకోవడానికే దీక్ష చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. -
జిల్లా కోసం 23 నుంచి ఆమరణ దీక్ష
జనగామ డివిజన్లో రేపటి నుంచి 48 గంటల బంద్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి జనగామ : రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు అనుకూలంగా ప్రకటన చేయని పక్షంలో ఈనెల 23 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ప్రకటించా రు. ఈనెల 14వ తేదీన జిల్లా జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ ఉండడంతో ముందస్తు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేశారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా సాధన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసలు శాస్త్రీయ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది.. పార్టీలకతీతంగా సన్నద్ధం కండి.. ఇప్పుడు చేసే ఉద్యమమే కీలకంగా మారుతుండడంతో పోరాటాన్ని ఉరుకులు పెట్టించాల న్నారు. ఈనెల 14న ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈనెల 13, 14వ తేదీ వరకు 48 గంటల పాటు జనగామ డివిజన్ బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న జాతీయ జెండాతో పాటు జనగామ జెండా ఎగురవేస్తామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో ముందస్తు అరెస్టులు చేస్తే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పోలీస్‌స్టేçÙన్ ముట్టడించాలన్నారు. ఈనెల 14న జరిగే ప్రజాప్రతినిధుల సమావేశం, 15న మంత్రుల సబ్‌కమిటీ రిపోర్టు ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. చివరి అస్త్రంగా జనగామ జిల్లా వచ్చుడో.. దశమంతరెడ్డి చచ్చుడో అనే నినాదంతో ఈనెల 23వ తేదీన ఆమరణ దీక్ష చేపడుతామన్నారు. జోనల్ సమస్య తలెత్తకుండా స్టేషన్‌ఘన్‌పూర్ 3, పాలకుర్తి 5, జనగామ నియోజకవర్గంతో పాటు కొత్తగా ఏర్పడే మండలాలు కొమురవెల్లి, తరిగొప్పుల, చిల్పూరు మండలాలను కలిపే పటాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, రాజమౌళి, మేడ శ్రీనివాస్, ఆకుల వేణుగోపాల్‌రావు, పజ్జూరి గోపయ్య, మంగళ్లపల్లి రాజు, చిన్నం నర్సింహులు, కృష్ణారెడ్డి, రత్నాకర్‌రెడ్డి, తీగల సిద్దూ, మాజీద్, మోర్తాల ప్రభాకర్, పి.సత్యం పాల్గొన్నారు. కాగా జనగామ జిల్లా కోసం పట్టణంలోని ఎనిమిదో వార్డు మహిళా కౌన్సిలర్ జక్కుల అనిత గురువారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డికి అందజేశారు. గతంలో 25 వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ ఆకుల రజని సతీష్ రాజీనామా చేయగా, అనితతో రాజీనామాల సంఖ్య రెండుకు చేరింది. -
హోదాపై ఆమరణదీక్షకు సిద్ధమా?
సీఎంకు మూడు పేజీల లేఖ రాసిన కాపు ఉద్యమనేత సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాన సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాకోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమా? మీతోపాటు మీ కుమారుడు లోకేశ్ కూడా సిద్ధపడతారా... అందుకు మీరు సై అంటే నేను కూడా ఆమరణ దీక్ష చేపడతాను’’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ముద్రగడ మూడు పేజీల లేఖను గురువారం సీఎంకు పంపించారు. ‘‘నా జాతికి మీరిచ్చిన హామీలు అమలు చేయమంటే కోపమొచ్చి నా కుటుంబాన్ని అవమానించారు. అయినా నాకెటువంటి చింతా లేదు. దీనిపై మీనుంచి సానుభూతి మాటలుగానీ, క్షమాపణగానీ కోరడం లేదు. ఇంకెన్ని అవమానాలు చేసినా, చేయించినా భరిస్తాను. నా జాతికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని అసెంబ్లీలో మీరు చేసే తీర్మానంకోసం ఎదురు చూస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆమరణ దీక్ష చేయడానికి మీరూ.. మీ కుమారుడు సిద్ధపడితే నేను కూడా మీతోపాటే మీఇంట్లోనే చోటిస్తే దీక్షలో కూర్చుంటా. ఎవరెన్నిరోజులు చేయగలరో ఆ దీక్షలో పరీక్షకు నిలబడదాం. ఈ దీక్షను సవాలుగా స్వీకరించడంవల్ల ప్రత్యేక హోదాతోపాటు మన శరీర పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి గురించి ప్రజలు తెలుసుకునే వీలుంటుంది.’’ అని ముద్రగడ తన లేఖలో తెలిపారు. -
న్యాయవాదుల ఆందోళన ఉధృతం
కమాన్‌చౌరస్తా : తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థాన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో నిరసన ప్రదర్శనకు దిగారు. న్యాయమూర్తులు సామూహిక సెలవు పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్ష చేపట్టారు. దీక్షలో న్యాయవాదులు ఎర్రం రాజిరెడ్డి, హన్మంతరావు, జెల్ల రమేశ్, పల్లె నర్సింహారెడ్డి, సీహెచ్.వెంకటరమణారెడ్డి, ముద్దసాని సంపత్, దాడి ఓంకార్, కొలకాని భూమయ్య పాల్గొన్నారు. భోజన విరామసమయంలో న్యాయస్థాన ఉద్యోగుల అధ్యక్ష, కార్యధర్శులు రమణారావు, పవన్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బి.రఘునందన్‌రావు పాల్గొన్నారు. జగిత్యాలలో కోర్టు భవనం ఎక్కి నిరసన జగిత్యాల రూరల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయూలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయూలని జగి త్యాల న్యాయవాదులు బుధవారం కోర్టుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం ఎక్కి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు విషయూన్ని జిల్లా న్యాయమూర్తి నాగమారుతిశర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు జగిత్యాల కోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తితో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్రెడ్డిను ఫోన్లో మాట్లాడించారు. హైకోర్టు విభజన తమ చేతుల్లో లేదని, న్యాయవాదులు, ఉద్యోగులు సమన్వయం పాటించాలని జిల్లా న్యాయమూర్తి కోరారు. న్యాయవాదుల నిరసనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం నుంచి కిందకు దిగివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, న్యాయూధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయూలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. న్యాయవాదుల నిరసనతో కోర్టులో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో టౌన్‌సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు హన్మంతరావు, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దామోదర్‌రావు, ఎన్నమనేని నివాసరావు, పడిగెల జనార్దన్‌రెడ్డి, తాటిపర్తి శంకర్‌రెడ్డి, మహేందర్, మురళీమోహన్, గంగరాజం తదితరులు పాల్గొన్నారు. . హుజూరాబాద్‌లో ఆమరణ దీక్ష హుజూరాబాద్: హైకోర్టును తక్షణమే విభజించాలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బుధవారం హుజూరాబాద్ సబ్‌కోర్టు ప్రధాన గేట్ ముందు న్యాయవాది కొత్తూరి రమేష్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా న్యాయవాదులందరూ దీక్షలో కూర్చున్నారు. హైకోర్టు విభజన విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన కేంద్రమంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఏర్పడినా న్యాయవ్యవస్థపై ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతోందన్నారు. భోజన విరామ సమయంలో కోర్టు సిబ్బంది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. సీఐ రమణమూర్తి పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనలో కేసరి శేషయ్య, ఎల్వీ.రమణారావు, రంగారావు, ముక్కెర రాజు, బండి కళాధర్, దొంత భద్రయ్య, లక్ష్మణమూర్తి, జయక ృష్ణ, రాఘవరెడ్డి, శ్యాంసుందర్, సృజన్, విజయ్‌కుమార్, సురేష్, లింగారెడ్డి, సమ్మయ్య, కుమారస్వామి, కొండయ్య, దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముద్రగడను మట్టుబెట్టాలని చూశారు
► కాపులకు వరాలు ఇచ్చి, ► వంచన చేసింది చంద్రబాబే.. ► సెప్టెంబర్ వరకూ వేచి ఉంటాం ► రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని ఆమరణ దీక్ష పేరుతో ముట్టుబెట్టాలని చూశారని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆరోపించారు. తుని ఘటనలో అరెస్టరుు, సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ముద్రగడతో కలిసి కిర్లంపూడికి వెళ్లారు. బుధవారం రాత్రి అమలాపురంలోని తన సోదరుడు దివంగత కాపు నేత నల్లా చంద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయనకు కాపులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విష్ణుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడను రాజమండ్రి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్బంధించి, అన్ని రోజులు ఆమరణ దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదంటే, ఆయన ఏమైపోయినా ఫర్వాలేదన్న ధోరణితోనే ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో కాపులకు వరాలు ఇచ్చింది చంద్రబాబే, వాటిని అమలు చేయకుండా వంచన చేసిందీ ఆయనేనని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజూ ముద్రగడతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయలేదని, అలాగే ముద్రగడ ఆయనను కలిసేందుకూ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించిన చంద్రబాబు ఈ సమస్యను మరింత జటిలం చేశారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబుతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తే ముద్రగడ, తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆగస్టు వరకూ ఆగమంటూ ప్రభుత్వం గతం నుంచి చెబుతోందని, సెప్టెంబర్ వరకూ వేచి ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. చంద్రరావు కుమారులు అజయ్, సంజయ్, రాష్ట్ర కాపు నాయకులు నల్లా పవన్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, అరిగెల నాని తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరివ్వకపోతే ఆమరణదీక్ష
► ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రిధర్రెడ్డి ► ఇరిగేషన్ కార్యాలయంలో బైఠాయింపు ► కాంట్రాక్టర్‌కు అధికారుల మద్దతుపై మండిపాటు నెల్లూరు(మినీబైపాస్): నెల్లూరు రూరల్ మండలంలోని మాదరాజుగూడూరు, కాకుపల్లి, లింగాయపాళెం రైతులకు రెండో పంట సాగుకు నీళ్లివ్వకపోతే ఆమరణదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయా గ్రామాల రైతులతో కలిసి బుధవారం ఆయన నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్ఈ గది ఎదుట బైఠాయించారు. ఎడగారు సాగుకు నీళ్లివ్వాలని రైతులు అనేక మార్లు కోరినా ఫలితం కరువైందన్నారు. సోమశిల డ్యాంలో సరిపడా నీళ్లున్నాయని, మరో వైపు వర్షాలు కురుస్తున్నా అధికారులు నీటి విడుదలకు నిరాకరించడం సరికాదన్నారు. నీళ్లు వదిలితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు ఇబ్బంది అని చెప్పడం దారుణమన్నారు. కాంట్రాక్టర్ ప్రయోజనం కోసం వేలాది ఎకరాల్లో పంట పండించే రైతుల కడుపు కొడతారా..అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని పొలాలకు 15 క్యూసెక్కుల నీరు ఇస్తామని వారం కిందట అంగీకరించిన అధికారులు ఇప్పుడు కాంట్రాక్టర్ కోసం మాటమారుస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఎకరా పొలం కూడా ఎండనీయబోమని ఓ వైపు జిల్లా మంత్రి చెబుతున్నారని, ఆయన మాటకు ఇరిగేషన్ అధికారులు విలువనివ్వరా అని నిలదీశారు. ఎస్ఈ వెంటనే కార్యాలయానికి చేరుకుని సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భీక్ష్మించారు. మరోవైపు రైతులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించారు. ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశాలతో ఎస్ఈ పీవీ సుబ్బారావు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, రైతులతో చర్చలు జరిపారు. 22వ తేదీన సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆరోజు సానుకూల నిర్ణయం రాకపోతే ఆమరణదీక్షకు దిగుతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలోవైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు తిరుపాల్, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటాం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆమరణ దీక్ష ప్రారంభం బోధన్: ప్రాణాలైనా అర్పిస్తాం.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని కార్మికులు నినదించారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసింది. లేఆఫ్ ఎత్తివేసి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్‌నగర్ ఎన్డీఎస్ఎల్ గేట్ ఎదుట కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అఖిల పక్ష నాయకులు వారికి మద్దతు ప్రకటించారు. -
ప్రభుత్వం సానుకూలంగా ఉంది: అచ్చెన్నాయుడు
ప్రభుత్వ పక్షాన ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, అవి సఫలీకృతం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం విరమించిన తర్వాత ఆయనతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పద్మనాభం దీక్ష విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా పెట్టి అమలుచేయాలని సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిందని, సమస్య శాశ్వత పరిష్కారం కోసమే ఈ కమిషన్ వేశారని తెలిపారు. ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగానే జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను పూర్తి చేయాలని అనుకుంటున్నారన్నారు. తుని ఘటనలో బయటి నుంచి కొంతమంది వచ్చారని, మరికొందరు తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ ఘటనపై చాలా కేసులు బుక్ చేశామని, వాటిపై లోతైన దర్యాప్తు జరిపి.. వారిపైనే కఠిన నిర్ణయాలు ఉంటాయని, దాంతో సంబంధం లేనివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలూ సంయమనంతో ఉండాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చూసి రెచ్చిపోకూడదని సూచించారు. -
మాలో కోటీశ్వరులకు రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు
కాపు రిజర్వేషన్ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన దీక్ష తగిన ఫలితం ఇవ్వడంతో దీక్షను విరమించానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీలు అమలయ్యేలా చూసే బాధ్యతను ఇకమీదట కూడా చేపడతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులలో కూడా పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని, ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో కలుపుతామని సీఎం కూడా అనేక సభల్లో చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేరుస్తామని చెప్పినా.. తర్వాత వేర్వేరు సమస్యల కారణంగా దాన్ని అమలు చేయలేదని, తాను రోడ్డెక్కాక స్పందించి.. తనను ఒక మెట్టు దిగమన్నారని, అవసరమైతే రెండు మెట్లు దిగుతానని, జాతికి మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పంపిన బృందం చేసిన ప్రతిపాదనలలో చిన్న చిన్న సడలింపులున్నా, జాతి హితం కోసం తాను అంగీకరించినట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ సీఎంను కావాలని తిట్టాలని గానీ, అవమానించాలని గానీ తాను దీక్ష చేపట్టలేదని.. తన జాతి ఆకలి కేకలు తట్టుకోలేక రోడ్డెక్కాను తప్ప తనకు ఎవరినీ అవమానించే ఆలోచన లేదని అన్నారు 20 ఏళ్లుగా ఈ ఉద్యమాన్ని అణచిపెట్టుకున్నామని.. అయితే ఇప్పటికీ దానిపై స్పందన లేకపోవడం, అలాంటి సందర్భంలో సీఎం బలమైన హామీ ఇవ్వడం వల్లే దాన్ని నెరవేర్చాలని తాము రోడ్డెక్కామన్నారు. ఆ హామీ అమలు ఆలస్యం కావడంతో పలు రకాల అనుమానాలు వచ్చి.. అనరాని మాటలు అని ఉంటానని, వాటికి క్షమించాలని కోరారు. మంజునాథ కమిషన్ నివేదిక తెప్పించుకుని, కేబినెట్లో పెట్టి, కేంద్రానికి పంపి అక్కడ కూడా ఆమోదింపజేస్తే మీ ఇంటికొచ్చి పళ్లెంలో కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు. తమ జాతికి తగిన ఫలాలు ఇస్తే సీఎం కాళ్లు మొక్కడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అత్యంత పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం తప్ప.. ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే సమయంలోనే ఈ క్లాజు కూడా పెట్టాలని చెప్పారు. బీసీ కోటాలో తగ్గించడం వద్దని, వాళ్లు, ఎస్సీ ఎస్టీలు అనుభవించే కోటా కాకుండా తమకు కొంత హక్కు ఇవ్వాలని కోరాము తప్ప.. వాళ్ల నోటి దగ్గర కూడు తీసే ఆలోచన తమకు లేదని ఆయన అన్నారు. తమకిచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని ఆయన మరోసారి కోరారు. తుని ఘటనలో చాలామంది మీద అక్రమంగా కేసులు బనాయించారని, కేసుల జాబితాను తనకు కూడా ఇవ్వాలని.. పూర్తి విచారణ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని ఆయన అన్నారు. తనతో పాటు ఈ నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులు, అమలాపురంలో మరికొందరు నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా చోట్ల చేస్తున్న దీక్షలను విరమించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, దాసరి నారాయణరావు, వట్టి వసంతకుమార్, వి.హనుమంతరావు, హర్షకుమార్, బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఇంకా పలువురు నాయకులు, ఎంఆర్పీఎస్ నేతలు తమ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారని, వాళ్లందరికీ తాను, తన జాతి ప్రజలు కృతజ్ఞతగా ఉంటామని ఆయన అన్నారు. -
ముద్రగడకు మద్దతుగా ప్లేట్లు కొట్టి నిరసన
అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలోని పలుచోట్ల ఆదివారం కాపు నాయకులు గరిటెలతో ప్లేట్లుకొట్టి నిరసన తెలిపారు. అవనిగడ్డలో టీటీడీ కల్యాణ మండపం ఎదుట దీక్షా శిబిరం వద్ద నాయకులు ప్లేట్లను గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. పలువురు కాపు నేతలు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరాటం ఆగదన్నారు. గాంధేయ మార్గంలో దీక్షలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. రెండు చేతులు లేని పెయింటర్ యలవర్తి వెంకటేశ్వరరావు ప్లేటు కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు సింహాద్రి వెంకటేశ్వరరావు, బాడిగ నాంచారయ్య, కొండవీటి కిశోర్, న్యాయవాది రాయపూడి వేణుగోపాల్, అలపర్తి గోపాలకృష్ణ, పద్యాల వెంకటేశ్వరరావు, దేవనబోయిన అంజిబాబు, తోట ప్రసాద్, దాసినేని గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొత్తమాజేరులో చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మాజేరు కాపు సంఘం ఆధ్వర్యంలో యువకులు, గ్రామస్తులు గరిటెలతో ప్లేట్లు కొట్టారు. చల్లపల్లి-మచిలీపట్నం ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
‘దివి’లో రెండోరోజు కాపుల దీక్ష భగ్నం
అవనిగడ్డ, భావదేవరపల్లి, చల్లపల్లి, మోపిదేవిలో దీక్షలను భగ్నం చేసిన పోలీసులు అవనిగడ్డలో దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలో పలుచోట్ల రెండోరోజైన ఆదివారం కాపు నేతలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి మద్దతు అవనిగడ్డ టీటీడీ కల్యాణమండపం ఎదురుగా కాపునేతలు రాజనాల బాలాజీ, ఇమ్మిడిశెట్టి వెంకటేష్ రెండోరోజు దీక్షచేశారు. వీరితోపాటు రేపల్లె హేమ, పూషడపు మనోహర్ దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, కడవకొల్లు నరసింహారావు వీరికి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామన్నారు ప్రభుత్వం స్పందిం చి బీసీలను కాపుల్లో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. కాపు సంఘం ఐక్యవేదిక నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి, కొండవీటి కిశోర్, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షను భ గ్నం చేసిన పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ వెంకటకుమార్ నేతృత్వంలో పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షను భగ్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని బలవంతంగా ట్రక్ ఆటోలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 144వ సెక్షన్ అమలులో ఉండగా దీక్షచేయమని పేర్కొంటూ వారివద్ద నుంచి పోలీసులు సంతకాలు తీసుకున్నారు. చల్లపల్లిలో చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అడపా రాంబాబు, ఆది రాంబాబు, అడపా బాబూరావు, సోమిశెట్టి శివనాగేశ్వరరావు దీక్షచేశారు. ఈ దీక్షకు న్యాయవాది మోపిదేవి ద్వారకానాథ్‌తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికుమార్ దీక్షను భగ్నం చేసి, వారిని బలవంతంగా పోలీసు వాహనంలో స్టేషన్‌కి తీసుకెళ్లారు. నాగాయలంక, భావదేవరపల్లిలో కాపుల దీక్షలు భావదేవరపల్లి(నాగాయలంక) : కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతు పలుకుతూ ప్రభుత్వతీరుకు నిరసనగా భావదేవరపల్లిలో గ్రామస్తులు రెండవరోజు ఆదివారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పూషడపు నిరంజనరావు, ముమ్మారెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెదప్రోలులో.. పెదప్రోలు(మోపిదేవి) : కాపులు బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా పెదప్రోలు ప్రధాన సెంటరో కాపులు మహిళలతో కలసి దీక్ష చేపట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కంచాలు, గరిటెలతో నినాదాలు చేశారు. శ్రీకాకుళం(అవనిగడ్డ) : శ్రీకాకుళంలో ఆదివారం కాపునేతలు దీక్ష చేశారు. కాపు సంఘం రాష్ట్ర నేత సింహాద్రి శ్రీనివాసరావుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా నేత అందె జగదీష్ దీక్షకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు మురళి, సత్యనారాయణ, కాంగ్రెస్ నేత కృష్ణారావు దీక్షకు మద్దతు తెలిపారు. -
బాబు పాదయాత్ర రాజకీయం కోసం కాదా?
♦ ఓడిపోయిన తర్వాత నాలాగ ఇంట్లో ఎందుకు కూర్చోలేదు ♦ కుల రాజకీయాలు చేస్తున్నాననడం సరికాదు ♦ ఆయనిచ్చిన హామీలు అడిగితే అంత కోపం ఎందుకో ♦ సాఫ్ట్వేర్ బాబుకు డేటా తెప్పించుకోడానికి 9 నెలలా? ♦ ఉపవాసాలు మాకు అలవాటే.. అతి చేయొద్దు ♦ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు తాను గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తుంటే కుల రాజకీయాలు చేస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారని.. మరి ఆయన గతంలో పాదయాత్ర చేసింది రాజకీయం కోసం కాదా అని కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత తనలాగే ఇంట్లో కూర్చోకుండా అధికారం కోసం పాదయాత్ర ఎందుకు చేశారని నిలదీశారు. ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరిన సందర్భంగా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆయనిచ్చిన హామీలనే ప్రస్తావిస్తుంటే.. ఆయనకు కోపం ఎందుకు వస్తోందని అడిగారు. తామేమీ పాకిస్థాన్ బోర్డర్ దాటలేదని, అలాంటప్పుడు ఇంత భద్రత ఏర్పాటుచేయడం అవసరమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి గతంలో దీక్షలు చేయలేదా.. ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనలు చేయలేదా, ప్రభుత్వానికి అడ్డు తగల్లేదా.. అని ప్రశ్నించారు. తమ కులానికి మేలు చేస్తామని ఆయన చెప్పడం వల్లే రిజర్వేషన్లు కావాలని అడిగాం తప్ప.. తామేమీ కుల రాజకీయాలు చేయట్లేదని స్పష్టం చేశారు. అయినా తమది కర్వేపాకు వర్గమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో తమను ఉపయోగించుకుని ఆ తర్వాత పక్కకు తీసి పారేయడం అందరికీ అలవాటుగా మారిపోయిందని చెప్పారు. ప్రతిపాదనలు వచ్చాయి.. ప్రభుత్వం తరఫున తన మిత్రుడు, టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కొన్ని ప్రతిపాదనలు చేశారని, వాటికి తాను కొన్ని సవరణలు చెప్పానని ముద్రగడ అన్నారు. ఆయన ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ల స్పందన ఏంటో చెబుతానన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలి, ఏడాదికి వెయ్యికోట్లు ఇవ్వాలని మరోసారి చెప్పారు. ఎన్నికల సమయంలో, దానికి ముందు టీడీపీ ఇచ్చిన హామీల మేరకే ఇప్పుడు అడుగుతున్నామని అన్నారు. ఇంతకుమించి చేయడానికి తగిన ఆర్థిక స్థోమత కూడా లేదని తెలిపారు. అయినా.. తమ జాతిలో నూటికి 90 మంది పేదవాళ్లే ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాపులు ఇప్పటికీ బీసీ స్టేటస్ అనుభవిస్తున్నారని.. ఇక్కడ మాత్రం తీసేశారని అన్నారు. డబ్బా కొట్టుకుంటున్నారు చంద్రబాబు ఇంతకుముందు తొమ్మిదేళ్ల పాలనలో కాపులకు ఏమైనా చేసి ఉంటే సరిపోయేదని.. అయినా ఆయన అది చేశాం, ఇది చేశామని డబ్బా కొట్టుకోవడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఏవీ అమలు కావట్లేదని ముద్రగడ అన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీవో చెత్తబుట్టలో ఉండాల్సిన కాగితం అంటున్నారని.. అది దొంగ జీవో అయితే మీరు మంచి జీవో ఇచ్చి తమ వాళ్లకు మేలు చేయాలని అడిగారు. సాఫ్ట్వేర్ బాబుకు డేటా సేకరణ కష్టమా కాపుల స్థితిగతుల గురించి వేసిన జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు 9 నెలల గడువు ఇవ్వడంపై కూడా ముద్రగడ పద్మనాభం తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే చాలా డేటా ఉందని, 2011లో చేసిన సామాజిక సర్వేలో కులాలు, ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయని.. ఒక్క బటన్ నొక్కితే అందరి జాతకాలు బయటకు వస్తాయని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉపయోగించేవాళ్లలో నెంబర్ వన్ తానేనని చెప్పుకొనే ముఖ్యమంత్రికి డేటా తీసుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన అన్నారు. తన పార్టీ పరిస్థితి గురించి ప్రైవేటు ఏజెన్సీలతో సమాచారం తెప్పించుకునే బాబు.. ఈ విషయంలోనూ అలా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని, ఆ విధంగా కూడా డేటా కలెక్ట్ చేసుకోవచ్చని, ఇన్ని మార్గాలు పెట్టుకుని మంజునాథ్ కమిషన్‌కు తొమ్మిది నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపవాసాలు అలవాటే.. డాక్టర్లూ అతి చేయొద్దు తనకు, తన భార్యకు రోజుల తరబడి ఉపవాసాలు చేయడం ముందు నుంచి అలవాటేనని, అందువల్ల మరికొన్నాళ్లు దీక్ష చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముద్రగడ చెప్పారు. తాను, తన భార్య కూడా నాలుగేసి రోజులు కేవలం టీ తాగి గడిపేసిన రోజులు చాలా ఉన్నాయన్నారు. సీఎం, పోలీసులు ఇచ్చినా ఆదేశం ప్రకారం తన ఆరోగ్యం నిలకడగా లేదని వైద్యులు చెప్పిస్తున్నారని అనుకుంటున్నానని.. డాక్టర్లు అతి చేసి ఉద్యమస్ఫూర్తిని దెబ్బ తీయొద్దని చెప్పారు. అనవసరంగా తమ దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సెలైన్ పెడితే దీక్ష విరమించేస్తానని అపోహలు సృష్టిస్తారేమో.. అయినా కూడా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. -
నెంబర్ 1 విశ్వాసఘాతకుడు ఆయనే: మంద కృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్ 1 విశ్వాస ఘాతకుడని, 2014లో కాపులు తెలుగుదేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటిస్తే.. వాళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తానెప్పుడూ కాపులకు హామీ ఇవ్వలేదు గానీ, ఎన్నికల్లో మొదటిసారి హామీ ఇచ్చాను కాబట్టి మాట నిలబెట్టుకుంటా అన్నాడని.. కానీ గెలిచిన తర్వాత అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినా ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్ సాధన కోసం ముద్రగడ పద్మనాభం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరాహార దీక్ష చేస్తుంటే, ఆయనకు మద్దతుగా బయటి వాళ్లు ఎవరూ తూర్పుగోదావరి జిల్లాకు రాకుండా ఆంక్షలు విధించడం దారుణమని మంద కృష్ణ మాదిగ అన్నారు. అలా ఆంక్షలు విధించడం పౌరహక్కులను కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన చెప్పారు. కాపులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని మందకృష్ణ మండిపడ్డారు. -
ముద్రగడకు పలువురి సంఘీభావం
జగ్గంపేట : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్షకు సర్వం సిద్ధమైంది. కాపులను బీసీల జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో ప్రాణాలను లెక్కచేయకుండా ఆరు పదుల వయస్సులో శుక్రవారం ఉదయం నుంచి ముద్రగడ ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, రాష్ట్రంలోని పలువురి నేతలు ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నారు. గురువారం కిర్లంపూడిలో ముద్రగడను పలువురి నేతలు కలిసి మద్దతు తెలిపారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, ఆకుల రామకృష్ణ, సంగిశెట్టి అశోక్, జీవీ రమణ తదితరులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. నేడు పూజలు చేయండి కాపులకు రిజర్వేషన్‌ను కల్పించాలని కోరుతూ సతీ సమేతంగా శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా కాపులందరూ శుక్రవారం ఉదయం తలారా స్నానం చేసి విష్ణుమూర్తికి పూజలు చేయాలని కాపు సద్బావన సంఘ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు విజ్ఞప్తి చేశారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీక్షకు మద్ధతుగా మధ్యాహ్నం భోజనం మాని ఎవరి ఇంటి వద్ద వారు ఖాళీ పళ్లానికి గరెటతో మోగించాలని కోరారు. ఆ శబ్ధం మన నాయకుడికి మద్దుతు తెలిపినట్టేనని అన్నారు. అలాగే కాపు సంఘం మరో నాయకుడు మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ ముద్రగడకు హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాపులందరిపై ఐక్యంగా ఉందన్నారు. దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాని కోరారు. -
కాపుకాద్దాం..!
ముద్రగడకు మద్దతుగా రేపటి నుంచి గుంటూరులో దీక్షలు గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆవిర్భావం కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ముందుకు... అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న జేఏసీ నేతలు కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను బలపర్చాలని వినతి గుంటూరు : కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ఈనెల 6 నుంచి గుంటూరు నగరంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ నిర్ణయించింది. అన్ని పార్టీల నాయకులను ఒక తాటిపైకి చేర్చి గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీగా ఏర్పడింది. జెండాలను పక్కన పెట్టి కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ఉద్యమించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి కాపు జాతికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ముందుగా గుంటూరు అర్బన్‌జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసిన జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు, కిలారి రోశయ్య, మాదా రాధాకృష్ణమూర్తి, కె.కె, ఊరిబండి శ్రీకాంత్‌లతోపాటు మరో వంద మంది రిలే నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తామని ఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడకు మద్దతుగా గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభిస్తున్నామన్నారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ కాపుల్లో వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయన్నారు. గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితమే కాపులు బీసీల్లో ఉండేవారన్నారు. అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి... దీక్షలకు మద్దతు తెలపాలని కోరుతూ తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందించారు. పార్టీ నేతలంతా సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకులు తెలిపారు. -
నిరాహార దీక్ష భగ్నం
సుండుపల్లి : మండలంలోని రాయవరం గ్రామపంచాయతీలో ఇసుక క్వారీ రద్దు చేయాలని చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు మంగళవారం భగ్నంచేశారు. దీక్షలో ఉన్న వికలాంగుల నాయకుడు చాంద్‌బాషా, మాలమహానాడు అధ్యక్షుడు బండి ఈశ్వర్‌లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు టెంట్‌ను కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆందోళన కారులను చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు రోడ్డుపై బైఠాయించి ఇసుకక్వారీని రద్దుచేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఆందోళనకారులతో మాట్లాడుతూ ఇసుక క్వారీని రద్దు చేయాలంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు విన్నవించుకోవాలన్నారు. అలాగే అక్రమంగా ఇసుక రవాణాచేస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని రద్దుచేసే విషయం తమ పరిధిలో లేదన్నారు. దీంతో మహిళలు ఒక క్యూబిక్‌మీటరు మాత్రమే ఇసుక లోడు చేయాల్సి ఉండగా నాలుగు క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక ఎత్తారని ఏఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మండల తహశీల్దార్ పరిశీలిస్తారని ఆయన పేర్కొనగా డ్వాక్రా మహిళలు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. ఒకానొక దశలో మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీక్షచేపడుతున్న ప్రదేశం నుంచి సుమారు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న రాయవరం ప్రాంతం వరకు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జికి నిరసనగా రాయవరం గ్రామంలో పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూత వేశారు. -
'ఆత్మబలిదానం చేస్తే నా డబ్బుతో విగ్రహం పెట్టిస్తా'
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆత్మబలిదానం చేస్తే తన డబ్బుతో మహబూబ్‌నగర్ గడియారం సెంటర్లో విగ్రహం పెట్టిస్తానని కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2019లోపు పూర్తిచేస్తే 2019లో తాను, మరో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ జెండాలు మోస్తామన్నారు. ఒకవేళ ఆ పథకాలు పూర్తి కాకపోతే మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు టీడీపీ జెండాలు మోస్తారా అని ప్రశ్నించారు. సీడబ్ల్యుసీకి రాసిన లేఖలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. అయినా.. జూన్ 11న ఏపీ అధికారులు లేఖ రాస్తే, హరీశ్ రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కృష్ణాజలాలపై జూన్ 18, 19 తేదీలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్ అడిగారు. అసలు ప్రభుత్వం పాలమూరు జిల్లా బంద్‌కు పిలుపునివ్వడంలో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. అయినా.. హరీశ్‌రావే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాజెక్టు సాధించొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ఆయన ఆత్మబలిదానం చేస్తే తన డబ్బుతో విగ్రహం పెట్టిస్తానని వ్యాఖ్యానించారు. -
మోక్షం కోసం.. 83 ఏళ్ల వయసులో ఆమరణదీక్ష
మోక్షం సాధించడం కోసం 83 ఏళ్ల మహిళ కటక్‌లో గత 50 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె ఆమరణ దీక్ష ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కటక్‌లోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన భవర్లాల్ సేథి భార్య అయిన విక్కీ దేవి సేథి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ దీక్ష చేస్తున్నారని, ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని సాధించాలన్న జైన సంప్రదాయం ప్రకారమే ఆమె ఇలా చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇందుకు తన కుటుంబం నుంచి, మత పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే.. ఇది చట్ట విరుద్ధమని, దీనిపై ఒడిషా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ 'స్ట్రగుల్ ఫర్ జస్టిస్' అనే స్వచ్ఛంద సంస్థ ఒరిస్సా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేసింది. ఇలా దీక్ష చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద శిక్షార్హమని ఆ సంస్థ కార్యదర్శి శశికాంత్ శర్మ అన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అనే విషయంలో హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఓయూలో ఆమరణ దీక్షలు
క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం నిరసన ర్యాలీలు... ఉద్రిక్తత హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం...పోలీసుల జోక్యంతో బుధవారం క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టీపీపీఎస్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ దీక్షలకు మద్దతుగా యూనివర్సిటీ లైబ్రరీని బహిష్కరించిన వందలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ప్రదర్శనతో ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు ముళ్ల కంచెను, బారికేడ్లను అడ్డంగా పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీ.విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతారాయ్, చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు, నాలుగు తరగతుల మినహా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే సహించబోమని హెచ్చరించారు. -
'రుణమాఫీ కోసం 25 నుంచి ఆమరణ దీక్ష'
కాకినాడ: ఈనెల 25వ తేదీ లోపల రైతుల రుణాలు మాఫీ చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరించింది. ఈనెల 25లోగా రుణమాఫీ అమలు చేయాలని సంఘ్ డిమాండ్ చేసింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత ఏదో ఒక సాకు చెబుతూ రుణాలు మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోంది.