రాజానగరం: పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తకావొస్తున్నా ఇం తవరకు ఆయా రైతులకు నష్టపరిహారాన్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గ పు ఆలోచనా విధానానికి తా ర్కాణంగా చెప్పవచ్చునని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. ఈ పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు కూలీల పక్షాన ఈ నెల 25వ తేదీ నుం చి చేపట్టదలచిన ఆమరణ దీక్షను రైతు సత్యాగ్రహం పేరుతో గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2వ తేదీన చేపట్టనున్నట్టు తెలిపారు. ‘రా వాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన ఇష్టానుసారంగా పంíపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరిహారం పంపిణీ విషయంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తించే రైతులు, రైతు కూలీలకు ఈ రోజుకు కూడా న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ ఇంకా 85 మంది వరకు రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.
ఎకరాకు రూ. నాలుగు లక్షలు పెంచి పరిహారం అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం కోర్టులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం ఆలోచించడం లేదన్నారు. అయితే తాను ఆమరణ దీక్ష గురించి ప్రకటించిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పరుగుపరుగున వెళ్లి రైతుల తరఫున సీఎంకు వినతి ప్రతం ఇచ్చినట్టుగా డ్రామాలాడటం విడ్డూరంగా ఉందన్నారు. సెంటు భూమి కూడా లేని బాలకృష్ణ లాంటి వ్యక్తులతో కొంతమంది డమ్మీ రైతులతో ప్రెస్‌మీట్లు పెట్టించి, తప్పుదారి పట్టేవిధంగా ఎల్లో మీడియాలో ప్రకటనలు ఇప్పించడం విచిత్రంగా ఉందన్నారు. 2013 భూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని లెక్కిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక రైతుకు చెందిన భూములు ఒకటికి రెండు మూడు ప్రాజెక్టుల్లో పోతే పరిహారం నాలుగు రెట్లు ఇవ్వడంతోపాటు రూ.ఐదున్నర లక్షలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, కుటుంబంలో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉందన్నారు. రైతు కూలీలకు కూడా ఇదే విధంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లేదా నెలకు రూ.రెండు వేలు చొప్పున 20 సంవత్సరాలపాటు ఆ కుటుంబానికి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఏ విషయాన్నీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదని జక్కంపూడి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment