నిరాహార దీక్ష భగ్నం
సుండుపల్లి : మండలంలోని రాయవరం గ్రామపంచాయతీలో ఇసుక క్వారీ రద్దు చేయాలని చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు మంగళవారం భగ్నంచేశారు. దీక్షలో ఉన్న వికలాంగుల నాయకుడు చాంద్‌బాషా, మాలమహానాడు అధ్యక్షుడు బండి ఈశ్వర్‌లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు టెంట్‌ను కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆందోళన కారులను చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు రోడ్డుపై బైఠాయించి ఇసుకక్వారీని రద్దుచేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఆందోళనకారులతో మాట్లాడుతూ ఇసుక క్వారీని రద్దు చేయాలంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు విన్నవించుకోవాలన్నారు. అలాగే అక్రమంగా ఇసుక రవాణాచేస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని రద్దుచేసే విషయం తమ పరిధిలో లేదన్నారు. దీంతో మహిళలు ఒక క్యూబిక్‌మీటరు మాత్రమే ఇసుక లోడు చేయాల్సి ఉండగా నాలుగు క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక ఎత్తారని ఏఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని మండల తహశీల్దార్ పరిశీలిస్తారని ఆయన పేర్కొనగా డ్వాక్రా మహిళలు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. ఒకానొక దశలో మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీక్షచేపడుతున్న ప్రదేశం నుంచి సుమారు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న రాయవరం ప్రాంతం వరకు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జికి నిరసనగా రాయవరం గ్రామంలో పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూత వేశారు.