కేసీఆర్ దీక్ష..చరిత్రాత్మకం
=సమాజాన్ని జాగృతం చేసింది
=ఉద్యమంలో ఓరుగల్లుది కీలకపాత్ర
=సంపూర్ణ తెలంగాణ సాధించే వరకూ పోరు
=ప్రస్తుత ఘర్షణ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్యే...
=తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చరిత్రను మలుపు తిప్పింది. సమాజాన్ని జాగృతం చేయడంతోపాటు ప్రజలను కదిలించేందుకు దోహదం చేసింది. ఈ ఉద్యమంలో ఓరుగల్లు కీలకపాత్ర పోషించింది. ప్రజా ఉద్యమాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయి. ఈ పోరాట స్ఫూర్తితోనే భవిష్యత్ తెలంగాణలో ముందుకు సాగాలి.’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి సెంటర్‌లో టీఆర్‌ఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ దీక్షా దివస్ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ తెలంగాణ సాధించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
1969 తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ఆరు సూత్రాల పథకం ముందుకు తెచ్చారని, ఈ క్రమంలోనే 371(డీ) రాజ్యంగ సవరణ చేశారని చెప్పారు. ఈ సమయంలోనే పార్లమెంట్‌లో విపక్షాలు ఇదంతా వృథా ప్రయాసగా కొట్టిపడేశాయని, ఈ దఫా విఫలమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమొక్కటే పరిష్కారమని అప్పుడే స్పష్టం చేశాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న ఘర్షణ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్యేనని అభివర్ణించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సమాజాభివృద్ధికి ఉద్యమ స్ఫూ ర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గుప్పెడు మందిదే పెత్తనం
కొంత మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ పెత్తనం కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఇదే విషయూన్ని తేల్చిచెప్పిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటూ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిందే తప్ప... సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదనే విషయం గుర్తించాలన్నారు.
భారత ప్రభుత్వం కూడా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, సమానత్వం వైపా ? ఒక వర్గానికి అండగా నిలుస్తారా ? అన్నది బహిర్గతమయ్యే సమయం వచ్చిందన్నారు. తెలంగాణ పోరాటం ప్రజాస్వామికమైందని, ఇది తమపై సాగుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమమన్నారు. త్వరలో సీమాంధ్ర పెత్తందారుల కుట్రలను, తెలంగాణను అడ్డుకుంటున్న శక్తుల తీరును అన్ని పార్టీలకు మరోమారు వివరిస్తామన్నారు. తెలంగాణ సాధన దిశగా కదిలిస్తామని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సమాజానికి ఈ పోరాటం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ పోరాట స్ఫూర్తితోనే భవిష్యత్ తెలంగాణలో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు. ప్రజలను కదిలించేందుకు, ఉద్యమానికి ఈ దీక్షలు ఎంతో దోహదం చేశాయన్నారు. చరిత్రను ములుపు తిప్పిందన్నారు. ఈ ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన రావడానికి ముందు తామంటేతామంటూ తెలంగాణపై పోటీపడి మాట్లాడిన రాజకీయపక్షాలు.... ప్రకటన రాగానే యూ టర్న్ తీసుకున్నాయని విమర్శించారు.
ఇప్పుడు కూడా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతుంటే మరోసారి అడ్డుకునే కుట్రలు సాగుతున్నాయన్నారు. ఎన్నో చర్చలు, కమిటీలు, అఖిలపక్షాల అనంతరమే నిర్ణయం తీసుకున్న విషయాన్ని విస్మరిస్తున్నారని, మరో పదేళ్లు చర్చలు జరిపినా సమయం సరిపోలేదంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రులకు హైదరాబాద్‌లో రక్షణ లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎనిమిది వేల కేసులు పెడితే... అందులో ఒక్కటి కూడా సీమాంధ్రులపై దాడిచేసిన కేసు లేదనే విషయం గుర్తించాలన్నారు. మరి వీరికి ఎందుకు రక్షణ అని కోదండరాం ప్రశ్నించారు.