సమైక్య సంకల్పం | YSRCP on going initiations | Sakshi
Sakshi News home page

సమైక్య సంకల్పం

Published Sat, Oct 5 2013 2:28 AM | Last Updated on Wed, Aug 8 2018 5:45 PM

YSRCP on going initiations

సాక్షి, విశాఖపట్నం: కేంద్ర కేబినెట్ ఆమోదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సీమాంధ్రలోని 13 జిల్లాలతోపాటు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యధికులు సమైక్యవాదానికే మద్దతిస్తున్నా.. నిరంకుశంగా విభజనకు పాల్పడడంపై మండిపడుతున్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనుండటంతో ఇప్పటికే నియోజక వర్గాలవారీ జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షల్ని మరింత ఉధృతంగా కొనసాగించనున్నట్టు పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు శుక్రవారం వెల్లడించారు.

72 గంటల బంద్‌కు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ కన్వీనర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు దీక్షల్ని విరమించి బం ద్‌లో పాల్గొన్నారు. కానీ ద్వితీయ స్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం రిలే దీక్షల్ని కొనసాగించారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోనూ రిలే దీక్షలు కొనసాగాయి. మూడు రోజులుగా నిరవధిక దీక్షల్లో ఉన్న నేతలు శుక్రవారం ఉదయం తమ దీక్షల్ని విరమించి బంద్‌లో పాల్గొన్నారు. వీరి స్థానంలో మిగిలినవారు రిలే దీక్షల్ని కొనసాగించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షలో కూర్చుని ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా నినదించారు. వీరికి పార్టీ సమన్వయకర్తలు, ప్రధాన నేతలు సంఘీభావం తెలిపి, సాయంత్రం నిమ్మరసం ఇచ్చి రిలే దీక్షల్ని విరమింపజేశారు. శనివారం నుంచి అన్ని నియోజక వర్గాల్లోనూ దీక్షలు కొనసాగనున్నాయి.

 72 గంటల బంద్‌కు సహకరించండి : అధిష్టానం పిలుపుమేరకు 72 గంటల బంద్‌కు ప్రజలంతా సహకరించాలని జిల్లా కన్వీనర్ కోరారు. శని, ఆదివారాల్లో బంద్ విజయవంతానికి పార్టీ శ్రేణులన్నీ కృషి చేయాలన్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల సిబ్బంది కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను సాధించేందుకున్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ సంక్షోభం ద్వారానే సమైక్యాంధ్ర నిలుస్తుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. ఇప్పుడుగానీ వెనుకడుగు వేస్తే రాష్ట్రం అథోగతిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement