- కోరుట్ల డివిజన్ సాధనకు ఉద్యమం తీవ్రం
- ఆస్పత్రిలో ‘శికారి’ దీక్ష కొనసాగింపు
ఆమరణ దీక్షలు భగ్నం
Published Thu, Sep 22 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
కోరుట్ల : కోరుట్ల డివిజన్ కోసం మూడోసారి చేపట్టిన ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. గురువారం తెల్లవారుజామున కోరుట్ల, రాయికల్, మేడిపల్లి ఎస్సైలు ఆమరణ దీక్ష స్థలికి చేరుకుని దీక్షాపరులను ఆస్పత్రికి తరలించారు. దీక్షాపరులు పాత మున్సిపల్ మెయిన్ గేటుకు తాళం వేసుకున్నప్పటికీ వాటిని తీయించి దీక్షాపరులు శికారి రామకృష్ణ, వంగ ప్రభాకర్, గొసికొండ నరేశ్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఆరు గంటల సమయంలో వీరిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వంగ ప్రభాకర్, నరేశ్ దీక్ష విరమించగా..శికారి రామకృష్ణ కొనసాగిస్తున్నారు.
దీక్ష కొనసాగిస్తా
కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారని మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఆరోపించారు. కోరుట్ల డివిజన్ ప్రకటన వచ్చే వరకు ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్లూకోజ్ లెవల్స్, బీపీ లెవల్స్ తగ్గాయని దీక్ష విరమించాలని వైద్యుడు మల్లికార్జున్ సూచించారు.
సంఘీభావం
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న శికారి రామకృష్ణకు సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, అఖిలపక్ష నాయకులు అనూప్‌రావు, రుద్ర శ్రీనివాస్, సాయిని రవీందర్‌రావు, వెగ్యారపు మురళి, జిల్లా ధనుంజయ్, వాసం భూమానందం, యువజన సంఘాల నాయకులు సనావొద్దీన్, జాల వినోద్, గడెల విజయ్, కిషోర్, అఖిలపక్షాల నాయకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి సంఘీబావం ప్రకటించారు. ఆమరణ దీక్షలను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తరోకో నిర్వహించారు.
Advertisement
Advertisement