korutla division
-
ఆదివారం.. వంట భారం.. సాయం తీసుకోమంటే ఏకంగా..
కోరుట్ల: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. 67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్ కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సాయం తీసుకోమన్నందుకు.. వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్‌గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. మౌఖిక ఆదేశాలున్నాయి ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు. – బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల -
ఆమరణ దీక్షలు భగ్నం
కోరుట్ల డివిజన్ సాధనకు ఉద్యమం తీవ్రం ఆస్పత్రిలో ‘శికారి’ దీక్ష కొనసాగింపు కోరుట్ల : కోరుట్ల డివిజన్ కోసం మూడోసారి చేపట్టిన ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. గురువారం తెల్లవారుజామున కోరుట్ల, రాయికల్, మేడిపల్లి ఎస్సైలు ఆమరణ దీక్ష స్థలికి చేరుకుని దీక్షాపరులను ఆస్పత్రికి తరలించారు. దీక్షాపరులు పాత మున్సిపల్ మెయిన్ గేటుకు తాళం వేసుకున్నప్పటికీ వాటిని తీయించి దీక్షాపరులు శికారి రామకృష్ణ, వంగ ప్రభాకర్, గొసికొండ నరేశ్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఆరు గంటల సమయంలో వీరిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వంగ ప్రభాకర్, నరేశ్ దీక్ష విరమించగా..శికారి రామకృష్ణ కొనసాగిస్తున్నారు. దీక్ష కొనసాగిస్తా కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారని మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఆరోపించారు. కోరుట్ల డివిజన్ ప్రకటన వచ్చే వరకు ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్లూకోజ్ లెవల్స్, బీపీ లెవల్స్ తగ్గాయని దీక్ష విరమించాలని వైద్యుడు మల్లికార్జున్ సూచించారు. సంఘీభావం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న శికారి రామకృష్ణకు సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, అఖిలపక్ష నాయకులు అనూప్‌రావు, రుద్ర శ్రీనివాస్, సాయిని రవీందర్రావు, వెగ్యారపు మురళి, జిల్లా ధనుంజయ్, వాసం భూమానందం, యువజన సంఘాల నాయకులు సనావొద్దీన్, జాల వినోద్, గడెల విజయ్, కిషోర్, అఖిలపక్షాల నాయకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి సంఘీబావం ప్రకటించారు. ఆమరణ దీక్షలను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తరోకో నిర్వహించారు.