జైల్‌భరోకు భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు | YSRCP cadre goes on Jailbharo | Sakshi
Sakshi News home page

జైల్‌భరోకు భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు

Published Sat, Aug 31 2013 1:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YSRCP cadre goes on Jailbharo

విజయవాడ, న్యూస్‌లైన్ : తెలుగు జాతి పరిరక్షణకోసం దృఢ సంకల్పంతో ఆస్పత్రిలో కూడా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం బాసటగా నిలుస్తున్నారు. ఒకవైపు ఆయన ఆరోగ్యంపై కలత చెందుతున్నప్పటికీ, తెలుగువారందరికీ సమన్యాయం చేయగల ఏకైక నాయకుడు జగనేనన్న విశ్వాసంతో దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో శుక్రవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో  జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది పార్టీ శ్రేణులు పీఎస్ ప్రాంగణాన్ని ముట్టడించాయి.

వెస్ట్‌జోన్ ఏసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సి.ఐ. హనుమంతరావుతోపాటు వివిధ స్టేషన్లకు చెందిన నలుగురు సి.ఐ.లు, పలువురు ఎస్.ఐ.లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒక్కసారిగా గేట్లను తోసుకుని లోపలికొచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీ సులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘జై జగన్... జైజై జగన్’ నినాదాలతో ఆ పరిసరాలు మార్మోగాయి.

జగన్ సంకల్పాన్ని దెబ్బతీయలేరు...
వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అసమర్థ ముఖ్యమంత్రి, అవకాశవాది చంద్రబాబు కుమ్మక్కై తెలుగు ప్రజలను విడదీయడానికి కుట్రపన్నారని చెప్పారు. సరైన సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, రాష్ట్ర భవిష్యత్ అంధకారం కాకుండా చూసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు దిగారన్నారు. ఆయన దీక్షను భగ్నం చేయడానికి ఆస్పత్రికి తరలించినా.. ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయారన్నారు. రాష్ట్రవ్యాపితంగా లక్షలాది మంది జైల్‌భరో కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ తరుణంలో గవర్నర్ కలుగజేసుకుని సమైక్య రాష్ట్రాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను భగ్నం చేయడానికి పాలకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఆయన డిమాండ్‌ను ఆమోదించేవరకు ఉద్యమం కొనసాగుతుందని, జగన్‌కు మద్దతుగా తామందరం ఆందోళనలో పాల్గొం టామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర అంటూ సీమాం ధ్రలో పర్యటించడానికి వస్తున్నారని, ఇటీవల లగడపాటికి పట్టిన గతే  బాబుకూ పడుతుందని ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ 30 రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్బంధంలో సైతం జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు దిగారన్నారు. ఆయనకు యావన్మంది రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ఆత్మగౌరవయాత్రను చేపట్టడాన్ని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబుది ఆత్మవంచన యాత్రగా అభివర్ణించారు. పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా సడలని సంకల్పంతో జననేత తన ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజల అభ్యున్నతి సాకారమవుతుందని వైఎస్ అభిలషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి,  వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు జ్యేష్ఠ రమేష్‌బాబు,  మేకా ప్రతాప అప్పారావు, ఉప్పులేటి కల్పన,  పి.గౌతంరెడ్డి, పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, దుట్టా రామచంద్రరావు, దూలం నాగేశ్వరరావు,  మాదివాడ రాము, దేవినేని చంద్రశేఖర్, సింహాద్రి రమేష్, కాజ రాజ్‌కుమార్, సూరపనేని రామారావు, వంగవీటి శ్రీనివాసప్రసాద్,  డి.రత్నశేఖర్, ఎల్.సునీత,  దాసీ జయప్రకాష్ కెనడీ, విశ్వనాథ రవి, బుల్లా విజయకుమార్,  మస్తాన్,  సుందర్‌పాల్, ఎం.ఎస్.బేగ్, విజయలక్ష్మి,  అమీర్‌జానీ తదితరులు పాల్గొన్నారు.

దీక్షలు భగ్నం.. మిగిలింది ఆరుగురే..


జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ నేతలు 20 మంది దీక్షలు చేస్తుండగా వారిలో 14 మంది దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రమేష్ (రాము), నూజివీడులో పార్టీ నేత లాకా వెంగళరావుయాదవ్, పెనుగంచిప్రోలులో వూట్ల నాగేశ్వరరావు, వేల్పుల పద్మకుమారి, గుడివాడలో పట్టణ కన్వీ నర్ మరీదు కృష్ణమూర్తి దీక్షలతోపాటు నందిగామలో తొమ్మిది మంది దీక్షలు భగ్నమయ్యాయి. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావులతోపాటు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తంగిరాల రామిరెడ్డి, కాశిరెడ్డి, పెనమాక రవి, జి.జయరాజ్‌లు ఆమరణదీక్షలు కొనసాగిస్తున్నారు.

కైకలూరులో పార్టీ కార్యాలయం వద్ద  నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్‌కు మద్దతుగా జరుగుతున్న రిలే దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. హనుమాన్‌జంక్షన్‌లో రిలే నిరాహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. చాట్రాయిలో  నాలుగో రోజు రిలే నిరాహారదీక్షలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement