ముద్రగడను మట్టుబెట్టాలని చూశారు
► కాపులకు వరాలు ఇచ్చి,
► వంచన చేసింది చంద్రబాబే..
► సెప్టెంబర్ వరకూ వేచి ఉంటాం
► రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా
అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని ఆమరణ దీక్ష పేరుతో ముట్టుబెట్టాలని చూశారని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆరోపించారు. తుని ఘటనలో అరెస్టరుు, సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ముద్రగడతో కలిసి కిర్లంపూడికి వెళ్లారు. బుధవారం రాత్రి అమలాపురంలోని తన సోదరుడు దివంగత కాపు నేత నల్లా చంద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయనకు కాపులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విష్ణుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడను రాజమండ్రి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్బంధించి, అన్ని రోజులు ఆమరణ దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదంటే, ఆయన ఏమైపోయినా ఫర్వాలేదన్న ధోరణితోనే ఉందని చెప్పారు.
గత ఎన్నికల్లో కాపులకు వరాలు ఇచ్చింది చంద్రబాబే, వాటిని అమలు చేయకుండా వంచన చేసిందీ ఆయనేనని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజూ ముద్రగడతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయలేదని, అలాగే ముద్రగడ ఆయనను కలిసేందుకూ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించిన చంద్రబాబు ఈ సమస్యను మరింత జటిలం చేశారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబుతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తే ముద్రగడ, తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆగస్టు వరకూ ఆగమంటూ ప్రభుత్వం గతం నుంచి చెబుతోందని, సెప్టెంబర్ వరకూ వేచి ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. చంద్రరావు కుమారులు అజయ్, సంజయ్, రాష్ట్ర కాపు నాయకులు నల్లా పవన్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, అరిగెల నాని తదితరులు పాల్గొన్నారు.