ముద్రగడకు మద్దతుగా రేపటి నుంచి గుంటూరులో దీక్షలు
గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆవిర్భావం
కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ముందుకు...
అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న జేఏసీ నేతలు
కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను బలపర్చాలని వినతి
గుంటూరు : కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ఈనెల 6 నుంచి గుంటూరు నగరంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ నిర్ణయించింది. అన్ని పార్టీల నాయకులను ఒక తాటిపైకి చేర్చి గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీగా ఏర్పడింది. జెండాలను పక్కన పెట్టి కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ఉద్యమించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి కాపు జాతికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
ముందుగా గుంటూరు అర్బన్‌జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసిన జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు, కిలారి రోశయ్య, మాదా రాధాకృష్ణమూర్తి, కె.కె, ఊరిబండి శ్రీకాంత్‌లతోపాటు మరో వంద మంది రిలే నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తామని ఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడకు మద్దతుగా గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభిస్తున్నామన్నారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ కాపుల్లో వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయన్నారు. గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితమే కాపులు బీసీల్లో ఉండేవారన్నారు.
అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి...
దీక్షలకు మద్దతు తెలపాలని కోరుతూ తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందించారు. పార్టీ నేతలంతా సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకులు తెలిపారు.
కాపుకాద్దాం..!
Published Fri, Feb 5 2016 2:09 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement
Advertisement