
ఉద్యమానికి ఊపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలతో సమైక్య ఉద్యమానికి ఊపు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలతో సమైక్య ఉద్యమానికి ఊపు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, జేఏసీ నాయకులు నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాక రరెడ్డి నేతృత్వంలో రెండురోజులపాటు నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో పార్టీ నాయకుడు వరప్రసాదరావు, పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 50 మంది నేతలు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఆర్‌టీసీ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. అన్నమ య్య కీర్తనలతో సంగీత విభావరి చేపట్టారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో దాదాపు 200 మంది నిరాహారదీక్షలో పాల్గొన్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయ కత్వంలో 300 మంది రిలేనిరాహార దీక్షలో పాల్గొన్నా రు. ఈ దీక్షకు పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, తిరుపతి పద్మావతి మహిళా కళాశాల విద్యార్థినులు సంఘీభావం తెలిపారు. జీడీ నెల్లూరులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నాయకత్వంలో ఐ దు మండలాల కన్వీనర్లు రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నగిరి నియోజకవర్గం పన్నూరులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రోజా పాల్గొన్నారు. బి.కొత్తకోటలో తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో ఆరు మండలాల కన్వీనర్లు, 150 మంది కార్యకర్తలు రెండురోజుల నిరాహారదీక్షను చేపట్టారు. ఈ దీక్షకు వై ఎస్సార్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నిరాహారదీక్ష చేపట్టారు.
చిత్తూరు వై ఎస్సార్ సీపీ కార్యక్రమాలను ఫేస్‌బుక్‌లో పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగనపల్లెకు చెందిన యూత్ నాయకుడు తులసీప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు పార్టీలో చేరారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దే శాయి తిప్పారెడ్డి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం ఆమరణ దీక్షలో కూర్చున్నారు. పూతలపట్టులో పార్టీ సమన్వయకర్తలు పుణ్యమూర్తి, సునీల్‌కుమార్, పూర్ణం, రవిప్రసాద్ రెండు రోజుల దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు తలుపులపల్లె బాబురెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. పీలేరులో పార్టీ రాజంపేట పార్లమెంటరీ ని యోజకవర్గ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిరాహార దీక్షలను ప్రారంభించారు. పార్టీ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి దీక్షల్లో పాల్గొన్నారు. సత్యవేడులో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఏడు మండలాల కన్వీనర్లతో కలసి నిరాహారదీక్ష చేపట్టారు. కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. పార్టీ నాయకుడు వెంకటేష్ బాబు, నాలుగు మండలాల కన్వీనర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నిరాహారదీక్షకు విశేష స్పందన - వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి
గంగాధరనెల్లూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో బుధవారం చేపట్టిన నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించిందని ఆపార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. గంగాధరనెల్లూరులో బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సీపీ తరఫున దీక్షలు చేపట్టామన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు స్వచ్ఛం దంగా దీక్షలో పాల్గొనడం విశేషమని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో ఓ ప్రణాళిక ప్రకారం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ నెల 7న ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఉంటుందన్నారు. 10వ తేదీన మండలాల్లో రైతుల ధర్నా, 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటో రిక్షాలతో ర్యాలీ, 21న నియోజకవర్గ స్థాయిలో మహిళల ధర్నా, 24న యూత్ ఆధ్వర్యంలో ధర్నా ఉంటుందని వివరించారు. అలాగే 26న చిత్తూరులో జిల్లాస్థాయిలో సర్పంచుల ధర్నా, 29న నియోజకవర్గ స్థాయిలో విద్యార్థుల ధర్నా, నవంబరు 1న పంచాయతీ స్థాయిలో సమైక్యాంధ్రాకు మద్దతుగా తీర్మాన సభ ఉంటుందన్నారు. వీటిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.