
భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగ భృతి లేక కొత్త ఉద్యోగాలపై ప్రతిపాదనలే పంపొద్దనడం దారుణమన్నారు. ఇంతకంటే దగాకోరుతనం మరొకటి లేదన్నారు. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడిలా హెచ్‌ఓడీలకు ఖాళీల ప్రతిపాదనలు పంపొద్దనడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రధాని మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా లేఖ రాస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి ప్రత్యేక హోదా అంటేనే అదేదో భూతమన్నట్లు, హోదా గురించి మాట్లాడితే బూతు అన్నట్లు వ్యవహరించిన విషయం మరిచిపోయారా బాబు అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా నినాదాన్ని, దాని ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాతే భయంతో హోదా అంశాన్ని భుజానకెత్తుకున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment