సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టాల హక్కులను సాధించే క్రమంలో కేటీఆర్ వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగిందని అన్నారు. ఈ భేటీపై వక్రభాష్యాలు చెబుతూ.. టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శలు గుప్పించారు. బాబు నలభయ్యేళ్ల రాజకీయ చరిత్ర అవినీతి మయం, దుర్గంధ భరితం, భరింపశక్యం కానటువంటిదని ఎద్దేవా చేశారు. నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్‌తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కేసీఆర్ వస్తే ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసి దగ్గరుండి సపర్యలు చేస్తారు. మీ మంత్రివర్గ సహచరురాలు పరిటాల సునీత ఇంట్లో వివాహానికి ఆహ్వానిస్తారు. కేసీఆర్ తలపెట్టిన చంఢీయాగంలో పాల్గొంటారు. కానీ, మేం కేటీఆర్‌తో భేటీ అయితే బురద జల్లుతారు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అనేక రుగ్మతలతో భాదపడుతున్నారని, కొత్తగా ఆయనకు మానసిక రుగ్మత కూడా వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు వింటేనే వణికిపోతూ.. బాబుకు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడటం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో మొదటినుంచి పోరాటం చేస్తున్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment