
సాక్షి, తిరుపతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ముమ్మాటికీ చంద్రబాబు సర్కారు కుట్రేనని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన భూమన.. వైఎస్ జగన్‌ను తుద ముట్టించేందుకు దుండగుడు ప్రయత్నించాడని.. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌కు లభిస్తున్న ఆదరణ చేసి ఓర్వలేకే చంద్రబాబు ఇలా దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అలిపిరి వద్ద చంద్రబాబు మీద దాడి జరిగిన వెంటనే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పందించి ఆయనను పరామర్శించారని.. గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష కూడా చేశారని భూమన గుర్తుచేశారు. కానీ మానవత్వం లేని చంద్రబాబు.. సీఎం హోదాలో ఉండి కూడా ప్రతిపక్ష నేతను కనీసం పరామర్శించకపోగా ఆయన మీదే నిందలు వేయడం దారుణమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావు కాబట్టే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment