ఇకపై ‘ఇన్‌ కెమెరా’ విచారణ  | NIA special court decision in the Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

ఇకపై ‘ఇన్‌ కెమెరా’ విచారణ 

Published Sat, Feb 23 2019 2:55 AM | Last Updated on Sat, Feb 23 2019 12:01 PM

NIA special court decision in the Murder Attempt On YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు విచారణను ఇకపై ఇన్‌ కెమెరా ద్వారా చేపట్టాలని విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల న్యాయవాదులు తప్ప, మరెవ్వరూ కూడా ఈ కేసు విచారణ సమయంలో కోర్టులో ఉండరాదని స్పష్టంచేసింది. అలాగే, ఇకపై ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరిగే విచారణపై ఎలాంటి వార్తలు రాయడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయరాదని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాను ఆదేశించింది.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. చార్జిషీట్‌కు ప్రత్యేక కోర్టు నెంబర్‌ కేటాయించక ముందే ఈ చార్జిషీట్‌ బహిర్గతమైంది.

ఈ నేపథ్యంలో గత విచారణ సమయంలోనే న్యాయమూర్తి ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌ నిర్వహణకు ఆదేశాలిస్తానని సూచనప్రాయంగా చెప్పారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియడంతో అతన్ని పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ ప్రారంభం కాగానే, న్యాయమూర్తి ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్‌ 17(3) ప్రకారం ఈ కేసును ఇకపై ఇన్‌ కెమెరా (కేసుకు సంబంధించిన వారి సమక్షంలోనే విచారణ జరపడం) ద్వారా విచారణ చేపడతామంటూ ఉత్తర్వులు జారీచేయడం ప్రారంభించారు.

కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు, అలాగే నిష్పాక్షికంగా విచారణ జరిగేందుకు ఈ విచారణ తోడ్పతుందని న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, సాక్షులు, నిందితుడు, పీపీలు, న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్‌ చార్జిషీట్‌లోని అంశాలు పత్రికల్లో వచ్చాయంటూ, వాటి కాపీలను న్యాయమూర్తికి ఇచ్చారు. ఈ ఉత్తర్వులు జారీచేసిన తరువాత కోర్టు హాలులో ఉన్న ఇతర కక్షిదారులు, న్యాయ విలేకరులు, ఇతర రిపోర్టర్లు, న్యాయవాదులను బయటకు పంపేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement